చేతిలో స్మార్ట్‌ఫోన్‌..వెన్నెముక డౌన్‌! | Excessive use of mobile phones, standing and sitting problems | Sakshi
Sakshi News home page

చేతిలో స్మార్ట్‌ఫోన్‌..వెన్నెముక డౌన్‌!

Published Mon, Apr 24 2023 3:26 AM | Last Updated on Mon, Apr 24 2023 9:01 AM

Excessive use of mobile phones, standing and sitting problems - Sakshi

ఒకప్పుడు రైల్లోనో, బస్సులోనో కూర్చునే చోటు దొరక్క నిలబడాల్సి వచ్చిందని మాత్రమే చింతించేవారు.. మరి ఇప్పుడు మనం మొబైల్‌ను మిస్‌ అవుతున్నామని అంతకు మించి చింతిస్తున్న పరిస్థితి. (నిలబడీ మొబైల్‌ వాడేవాళ్లూ ఎక్కువే ఉన్నారనుకోండి). కూర్చునేందుకు కాస్త చోటు దొరికితే చాలు.. టక్కున ఫోన్‌లో తలదూర్చేస్తున్నారు.

ఇదొక్కటే కాదు.. కూర్చున్నా, బెడ్‌పై ఉన్నా, బయట ఎక్కడైనా తిరుగుతున్నా, నడుస్తూ వెళుతున్నా మొబైల్‌ ఫోన్‌ చేతిలోనే ఉంటోంది. కానీ ఇదే అతిపెద్ద సమస్యను తెచ్చిపెడుతోంది. ఫోన్‌ చూడటం కోసం మెడ వంచడం, చేతులను ఎక్కువ సేపు పైకెత్తి ఉంచడం, కూర్చున్నా, పడుకున్నా ఫోన్‌ చూడటం కోసం ఏదో ఓవైపు వంగిపోతుండటం, స్క్రోలింగ్, టైపింగ్‌ కోసం వేళ్లను విపరీతంగా వినియోగిస్తుండటం వంటి వాటితో ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి.  – సాక్షి, హైదరాబాద్‌


టెక్‌ నెక్‌.. సమస్యతో.. 
స్మార్ట్‌ఫోన్‌తో గంటల కొద్దీ గడిపేవారు, ఇందులో ముఖ్యంగా టీనేజర్లు ‘టెక్‌ నెక్‌’, లేదా ‘న్యూ కార్పల్‌ టన్నెల్‌ సిండ్రోమ్‌’తో బాధపడుతున్నారని తాజా పరిశోధనలు గుర్తించాయి. దీనిద్వారా మెడ, వెన్నునొప్పితోపాటు తలనొప్పి, భుజాల నొప్పులు, చేతుల్లో జలదరింపు, కండరాలు పటుత్వం కోల్పోవడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి.

చాలాసేపు మెడ వంచి చూడటం వల్ల.. మెడలోని స్నాయువులు, కండరాలు, కీళ్లపై ఒత్తిడి పడుతోందని ఇండియన్‌ స్పైనల్‌ ఇంజూరీస్‌ సెంటర్‌ (ఐఎస్‌ఐఈ) మెడికల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ హెచ్‌ఎస్‌ ఛబ్రా హెచ్చరించారు. దీర్ఘకాలికంగా, మెడ కండరాలు అపసవ్యంగా సంకోచించడం వల్ల పుర్రెతో అనుసంధానమైన ఉన్నచోట మంట, నొప్పిని కలిగిస్తుందని.. ఈ నొప్పి ఫాసియా ద్వారా మెడ నుంచి తలకు వ్యాపిస్తుందని వివరించారు. 

భంగిమ సరిగా లేక.. భారంగా.. 
మొబైల్‌ను చేతిలో పట్టుకున్నప్పుడు కేవలం వేళ్లు మాత్రమే ఉపయోగి­స్తున్నా­మ­ని అనుకుంటాం. కానీ మన చేతులు, మోచేయి, కండరం, మెడ ఇవన్నీ వినియోగిస్తాం. మొబైల్‌ను చూస్తున్నప్పుడు మెడను కిందకు వంచుతాం. దీనివల్ల మెడ, వెన్నెముకపై ఒత్తిడి పడుతుంది. ‘ఇంటర్నేషనల్‌ జర్నల్‌ ఆఫ్‌ ఎన్విరాన్‌మెంటల్‌ హెల్త్‌ అండ్‌ పబ్లిక్‌ హెల్త్‌’కథనం ప్రకారం.. ఇలా మెడ వంచి చూసే భంగిమ వల్ల వెన్నెముకపై తల బరువు పెరుగుతుంది.

‘‘వాస్తవానికి తల నిటారుగా ఉన్న స్థితిలో దాదాపు 5–8 కిలోల బరువుపడుతుంది. తల వంగుతున్నప్పుడు 15 డిగ్రీల దగ్గర.. మెడపై భారం సుమారు 12 కిలోలు, 30 డిగ్రీల దగ్గర 18.14 కిలోలకు 45 డిగ్రీల దగ్గర 22.23 కిలోలకు 60డిగ్రీల దగ్గర 27.22 కిలోలకు పెరుగుతుంది. ఇలా మెడ అతిగా వంగడంతో వెన్నెముక, సపోర్టింగ్‌ లిగమెంట్లు, కండరాలపై ప్రభావం పడుతుంది..’’అని ఆ కథనం స్పష్టం చేసింది. 

కీళ్లు శాశ్వతంగా దెబ్బతినే ప్రమాదం 
ఫోన్‌ మాట్లాడే సమయంలో నిలబడే, కూర్చునే భంగిమలో లోపాలు మసు్క్యలోస్కెలెటల్‌ సమస్యలకు కారణం అవుతున్నాయని.. గర్భాశయ, థొరాసిక్, నడుము ప్రాంతాలలో వెన్నెముక దెబ్బతినడంతో అనేక మంది ఇబ్బందిపడుతున్నారని వైద్యులు చెప్తున్నారు.

సాధారణంగా కీళ్ల పనితీరు బాగున్నప్పుడు ఒత్తిడికి గురైనా, విశ్రాంతి సమయంలో మరమ్మతు అవుతాయని వివరిస్తున్నారు. కానీ కీళ్లను అసాధారణ భంగిమలో ఎక్కువసేపు ఉంచడం, ఒకే భంగిమలో ఎక్కువసేపు ఉంచడం వల్ల తీవ్రమైన ఒత్తిడి పడి.. అరిగిపోయి, తిరిగి బా­గయ్యేందుకు అవకాశం లేనంతగా దెబ్బతింటున్నాయని స్పష్టం చేస్తున్నారు. 

నిపుణులు ఏమంటున్నారంటే? 
♦ 
మెడ భుజం ముందుకు సాగినప్పుడు.. ముందువైపు కండరాలు బిగుతుగా మారుతూ, వెనుక వైపు బలహీనపడతాయి. కండరాల అసమతుల్యత ఏర్పడుతుంది. కాబట్టి మొబైల్‌ ఉపయోగిస్తున్నప్పుడు భంగిమపై శ్రద్ధ చూపడం తప్పనిసరి. 

♦ శరీర భంగిమ అనేది ఫిట్‌నెస్‌కు కీలకం. ట్రెడ్‌మిల్, క్రాస్‌ ట్రైనర్‌ వంటివాటి మీద ఉండగా.. మొబైల్‌ ఫోన్‌ వినియోగించడం వంటివి చేయవద్దు. 

♦ నిలబడి   ఉన్నప్పుడు, ఎవరికైనా మెసేజీలు పంపుతున్నప్పుడు తల పైకి, భుజాలు కిందకు ఉంచాలి. వీలైనంత వరకు మొబైల్‌ను కళ్లకు సమాంతరంగా ఉంచడం సరైన భంగిమ. 

♦ కురీ్చలో లేదా సోఫాలో కూర్చున్నప్పుడు ఫోన్‌ చూస్తూ వంగిపోవడం ఏ విధంగానూ ఆరోగ్యకరం కాదు. వెన్ను నిటారుగా ఉంచి కూర్చోవాలి. ఫోన్‌ చూడటానికి లేదా టెక్ట్స్‌ చేయడానికిగానీ మెడ ఎక్కువగా వంచకూడదు. 

♦ పడుకున్నప్పుడు ఫోన్‌ పట్టుకోవడానికి.. మోచేతికి దిండు లేదా మరేదైనా మెత్తని దాన్ని ఆసరాగా తీసుకోవాలి. 

♦ భోజనం చేసేప్పుడు, టీవీ చూస్తున్నప్పుడు, కంప్యూటర్‌ వినియోగిస్తూ, డ్రైవ్‌ చేస్తూ.. ఇలా పలు సందర్భాల్లో ఫోన్‌ను కూడా ఉపయోగించడమనే మల్టీ టాస్కింగ్‌ అటు శారీరకంగా, ఇటు మానసికంగా కూడా ఆరోగ్యానికి చేటు తెస్తుందని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. 

బఫెలో హంప్‌ కనిపిస్తోంది 
టెక్ట్స్‌ నెక్‌ సిండ్రోమ్, స్పైన్‌ పెయిన్‌ వంటివన్నీ మనం నిలబడే, కూర్చునే, శరీరాన్ని ఉంచే తీరులో సమస్య వల్లే తలెత్తుతున్నాయి. దీర్ఘకాలంపాటు తప్పుడు భంగిమ వల్ల మెడ అలైన్‌మెంట్‌ సాగిపోతుంది. దాదాపు 60, 70ఏళ్ల వయసులో సంభవించే మెడలు సాగిపోవడం, ఫ్రోజెన్‌ షోల్డర్, రౌండెడ్‌ షోల్డర్‌ వంటివి 40 ఏళ్ల వయసులోనే వచ్చేస్తున్నాయి. మొత్తంగా సహజమైన శరీర నిర్మాణాన్ని ఈ భంగిమ లోపాలు దెబ్బతీస్తున్నాయి.

ఒకప్పుడు బాగా తలవంచుకుని పనిచేసే కొందరు బ్యాంకు ఉద్యోగులు వంటివారిలో ఎక్కువగా కనిపించే మెడ వెనకాల సెమీ సర్కిల్‌ ఇప్పుడు చాలామందిలో కనిపిస్తోంది. బఫెలో హంప్‌గా పేర్కొనే దీన్ని నిర్లక్ష్యం చేస్తే తీవ్ర సమస్యలు తప్పవు. ఏదేమైనా భంగిమ లోపాలు సరిచేసుకుంటూనే ఫోన్‌ వాడకాన్ని వీలైనంత తగ్గించుకోవడమే ఉత్తమం.      – డాక్టర్‌ విజయ్‌ బత్తిన, ఉఛ్వాస్‌ ట్రాన్సిషనల్‌ కేర్‌  

ఫోన్‌ వినియోగాన్ని పరిమితం చేయాలి 
ఇటీవల భుజాల నొప్పులు, మణికట్టు బాధలు చాలా మందిలో గమనిస్తున్నాం. మొబైల్స్‌ని ప్రొఫెషనల్‌గా వాడేవారిలో బొటనవేలు మొద్దు బారడం సహా మరిన్ని సమస్యలు కనపడుతున్నాయి. పడుకునే భంగిమలో పుస్తకం చదివినట్టు ఫోన్‌ చూడడం సరికాదు.

అలాగే వాష్‌రూమ్స్, టాయిలెట్స్‌లో కూడా వాడొద్దు. ఎలాపడితే అలా వాడటం వల్ల భుజాల కండరాలు, చేతులు, మణికట్టు ఒత్తిడికి గురవుతాయి. అయితే ఏది సరైన భంగిమ అనేది ఇప్పటివరకు స్పష్టత లేదు. కాబట్టి వీలైనంత వరకూ ఫోన్‌ వాడేటప్పుడు మధ్యలో విరామాలు తీసుకోవడం, ఫోన్‌ వినియోగాన్ని పరిమితం చేయడం తప్పనిసరి.  – డాక్టర్‌ శివరాజు, జనరల్‌ ఫిజీషియన్, కిమ్స్‌ ఆస్పత్రి 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement