
పోలీసుల అదుపులో మహేశ్
సాక్షి, యాదాద్రి: తమ భూ వివాదాన్ని పరిష్కరించాలంటూ ఓ రైతు కొడుకు కలెక్టర్ కారుకు అడ్డు వెళ్లి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. వెంటనే స్పందించిన పోలీసులు అతడిని అడ్డుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో బుధవారం ఈ సంఘటన జరిగింది.
వివాదంలో 3.17 ఎకరాలు
యాదగిరిగుట్ట మండలం ధర్మారెడ్డిగూడెంకు చెందిన రైతు బొడిగె ఉప్పలయ్యకు చెందిన 3.17 ఎకరాల భూమి వివాదంలో ఉంది. 2016 నుంచి పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నా కాలేదు. దీంతో గత నవంబర్‌లో ఉప్పలయ్య కలెక్టరేట్‌కు వచ్చి ఆందోళన చేశాడు. అతని కొడుకు మహేశ్ డిసెంబర్‌లో పెట్రోల్ డబ్బాతో వచ్చి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడు. కలెక్టర్ చాంబర్‌లోకి వెళ్లి ఒంటిపై పెట్రోల్ పోసుకున్నాడు. అక్కడున్నవాళ్లు అడ్డుకొని అతనితో మాట్లాడారు. సమస్య పరిష్కారం తమ చేతిలో లేదని, సివిల్ కోర్టులో జరుగుతుందని అధికారులు చెప్పారు.
తాను సివిల్ కోర్టుకు వెళ్లనని, అధికారులే పరిష్కరించాలంటూ తాజాగా బుధవారం గణతంత్ర వేడుకలు జరుగుతున్న కలెక్టరేట్ వద్దకు మహేశ్ వచ్చాడు. కార్యక్రమం ముగించుకుని వెళ్తున్న కలెక్టర్ పమేలా సత్పతి కారుకు అడ్డంగా పోయి ఒంటిపై పెట్రోల్ పోసుకోబోయాడు. భువనగిరి ఏసీపీ వెంకట్‌రెడ్డి, ఇతర పోలీసు సిబ్బంది అతడిని పట్టుకుని పెట్రోల్ డబ్బాను లాగేశారు. అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.
సివిల్ కోర్టులో పరిష్కరించుకోవాలి
ఉప్పలయ్యకు సంబంధించి 3.17 ఎకరాల భూమి రికార్డులోకి రావాలి. కొత్త చట్టం ప్రకారం, ట్రిబ్యునల్‌లో తీర్పు ప్రకారం ఉప్పలయ్య సివిల్ కోర్టులో కేసు వేసుకోవాలి. దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న కేసులో రెవెన్యూ పరంగా ఏం చేయలేం. అవసరమైతే లీగల్ ఎయిడ్ ద్వారా ఉచితంగా న్యాయవాదిని నియమిస్తాం. ఇలా బ్లాక్‌మెయిల్ చేయడం సరికాదు. పెట్రోల్ డబ్బాతో వచ్చి తరచూ అధికారులను బెదిరిస్తున్నాడు.
– డి. శ్రీనివాస్‌రెడ్డి, అదనపు కలెక్టర్, యాదాద్రి భువనగిరి
Comments
Please login to add a commentAdd a comment