ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని కొందరు రైతులు వరిలో కొత్త రకాల వంగడాలు సాగు చేస్తూ నూతన ఒరవడికి శ్రీకారం చుడుతున్నారు. వ్యవసాయ అధికారుల సలహాలు, సూచనలతో బ్లాక్ రైస్ (నల్ల ధాన్యం), రెడ్ రైస్, బాస్మతి, కూజ్ పటియాలా, రత్నచోడీ, ఇంద్రాణి.. ఇలా విభిన్న రకాల వరి పండిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. కొందరు సేంద్రియ ఎరువులు వాడుతూ తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించి లాభాలు పొందుతున్నారు. కొన్ని రకాల ధాన్యానికి స్థానికంగా బాగా డిమాండ్ ఉండటంతో వీటి సాగుపై ఆసక్తి కనబరుస్తున్నారు. కొందరు పండించిన ధాన్యంలో కొంత ఇంటి అవసరాలకు వాడుకుంటున్నారు. మిగిలింది తెలిసిన వారికి ఇవ్వడంతో పాటు అవసరమైన వారికి విత్తనాలుగానూ అందిస్తున్నారు.
మోత్కూరు/హుజూర్‌నగర్‌రూరల్: యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని ఆరెగూడెం గ్రామానికి చెందిన రైతు దేవరపల్లి విద్యాసాగర్‌రెడ్డి సాధారణంగా తనకున్న 25 ఎకరాల వ్యవసాయ భూమిలో 15 ఎకరాల్లో వరి సాగు చేస్తాడు. వానాకాలం పంటగా పూస బాస్మతి వరిని అర ఎకరంలో సాగు చేశాడు. భువనగిరిలోని ఓ ప్రైవేట్ దుకాణంలో ఈ రకం విత్తనాలను కిలోకు రూ.200 చొప్పున 12 కిలోలు కొనుగోలు చేశాడు. సాధారణ రకం వరి సాగులానే దీనికి కూడా సస్యరక్షణ చర్యలు చేపట్టాడు. మొత్తం మీద అర ఎకరం సాగుకు రూ.10 వేల పెట్టుబడి పెట్టాడు. సుమారు 20 బస్తాల దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నాడు. కిలో రూ.80 నుంచి రూ.100 పలుకుతుందని ఆశిస్తున్నాడు.
లక్కవరంలోనూ..
సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ మండలంలోని లక్కవరం గ్రామానికి చెందిన రైతు రణపంగురాజు కూడా ఎకరం పది గుంటల పొలంలో పూస బాస్మతి (1503) సాగు చేశాడు. దీని కోసం రూ.18 వేల వరకు పెట్టుబడి పెట్టాడు. అయితే తాను అనుకున్న దానికంటే అధికంగా ఎకరానికి 30 బస్తాల చొప్పున దిగుబడి రావడం, మార్కెట్‌లో బాస్మతికి మంచి గిరాకీ ఉండటంతో ఆనందం వ్యక్తం చేస్తున్నాడు.
కొత్త వంగడాలపై దృష్టి సారించాలి
నేను బాస్మతి సాగు చేశా. దిగుబడి తక్కువగా వస్తుందని కొంత మంది రైతులు చెప్పారు. కానీ ధైర్యం చేసి సాగు చేశా. అంచనాలకు మించి దిగుబడి వచ్చింది. రైతులు కొత్తరకపు వరి వంగడాలపై దృష్టి సారించాలి.
– రైతు రణపంగురాజు, లక్కవరం
బ్లాక్, రెడ్‌తో భారీ లాభాలు
చివ్వెంల (సూర్యాపేట): సూర్యాపేట జిల్లా చివ్వెంల మండల కేంద్రానికి చెందిన యువరైతు ఇట్టమళ్ల స్టాలిన్ నూతన వరి వంగడాలను సేద్యం చేస్తూ మంచి లాభాలను గడిస్తున్నాడు. గత సంవత్సరం నుంచి రెండు ఎకరాల్లో బ్లాక్, రెడ్ రైస్ వంగడాలను నాటి ఎకరాకు రూ.1.50 లక్షలు లాభం పొందుతున్నాడు. ఎకరాకు 10 కేజీల వరి విత్తనాలు నారుగా పోసి నాటడంతో పాటు దానికి కావాల్సిన సేంద్రియ ఎరువులు స్థానికంగా సేకరించి వేస్తున్నాడు. ప్రతి పంటకు ఎకరాకు 20–25 క్వింటాళ్ల దిగుబడి వస్తోంది. పండించిన పంటను స్థానికంగా వరి విత్తనాలకు విక్రయిస్తున్నాడు. క్వింటాల్‌కు రూ.10 వేల చొప్పున ఖమ్మం, వరంగల్ జిల్లాల నుంచి రైతులు వచ్చి కొనుగోలు చేసి తీసుకువెళ్తున్నారు. ప్రతి సంవత్సరం ఒక పంట వేస్తూ పెట్టుబడి పోగా ఎకరానికి రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు లాభాలు పొందుతున్నాడు.
బ్లాక్ రైస్, 1119 జోరు
నిడమనూరు/బీబీనగర్: నల్లగొండ జిల్లా నిడమనూరు, సోమోరిగూడెం, నారమ్మగూడెంలలో రైతులు వరిలో బ్లాక్ రైస్, 1119 రకాలను సాగు చేస్తున్నారు. నిడమనూరు మండలంలోని నారమ్మగూడెంలో కొండా శ్రీనివాసరెడ్డి తన వ్యవసాయబూమిలో ఖరీఫ్‌లో బ్లాక్ రైస్ సాగు చేశాడు. 120 నుంచి 130 రోజుల పంట. దీనిలో సన్న, దొడ్డు రకం రెండూ ఉన్నాయి. ఇవి నల్లగా ఉంటాయి. మధుమేహంతో బాధపడుతున్నవారు బ్లాక్ రైస్ బియ్యాన్ని వాడడానికి ఇష్టపడుతున్నారు. మండల కేంద్రానికి చెందిన బొల్లం శ్రీనివాస్‌యాదవ్ అతని సోదరుడు కూడా నిడమనూరులో కొంత, మండలంలోని సోమోరిగూడెంలో ఎకరంలో బ్లాక్ రైస్‌ను సాగు చేశారు.
ఈసారి మరిన్ని ఎకరాల్లో..
పంట దిగుబడి బాగానే వస్తుందని అనుకుంటున్న. రెండు ఎకరాల్లో సాగు చేశా. ఇంటి అవసరాలకు పోను తెలిసిన వారికి ఇవ్వాలని అనుకుం టున్నా. గతంలోనూ తెలిసిన వారికి ఇచ్చా. ఎక్కువ మొత్తంలో సాగు చేస్తే మార్కెట్ చేసుకో వాల్సి ఉంటుంది. ఈసారి ఎక్కువ ఎకరాల్లో సాగు చేస్తా.
–కొండా శ్రీనివాసరెడ్డి
గొల్లగూడెంలో..
యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం గొల్లగూడెం గ్రామానికి చెందిన బాత్క వెంకటేష్ 20 గుంటల భూమిలో బ్లాక్ రైస్ సాగు చేశాడు. రూ.450 కేజీ చొప్పున విత్తనాలు కొనుగోలు చేశాడు. వరి సాగు మాదిరిగానే మెళుకువలు పాటిస్తూ పంటను పండించాడు. ప్రసుత్తం పంట బాగా రాగా సుమారు 5 అడుగుల ఎత్తున ధాన్యం గొలుసులు పెరిగాయి. మరో 5 రోజుల్లో చేనును కోయనున్నట్లు, పంట బాగా వచ్చినట్లు వెంకటేష్ ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. ఇతను బ్లాక్ రైస్ సాగు చేస్తున్నాడని తెలియగానే కొందరు టీచర్లు, ఉద్యోగులు..ధాన్యం తమకు విక్రయించాలని కోరారు. ఈసారి 5 ఎకరాలలో ఈ రకం సాగు చేస్తానని వెంకటేష్ చెబుతున్నాడు,
ఒకే రైతు.. పలు రకాలు
రాజాపేట: ఎప్పటికీ ఒకే వరి రకం పంటలు సేద్యం చేయకుండా విభిన్న వంగ డాలను సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని నెమిల గ్రామానికి చెందిన పులి భూపాల్. బ్లాక్ రైస్, రత్నచోడి గుంట, ఇంద్రాణి, మహరాజ, కూజ్ పటియాలా వంటి రకాలను తనకు ఉన్న 10 ఎకరాలకు గాను 3 ఎకరాల్లో సాగు చేస్తున్నాడు. ఇందుకు ఎకరాకు రూ.40 వేల వరకు ఖర్చు చేశాడు. మార్కెట్‌లో బ్లాక్‌రైస్, నవార్, రత్నచోడీ వంటి వరి ధాన్యానికి డిమాండ్ ఉండటంతో వాటి సాగు చేసినట్లు తెలిపాడు. ప్రస్తుతం బ్లాక్ రైస్ కిలో రూ. 250, నవార్ కిలో రూ.120 చొప్పున సొంతంగా విక్రయిస్తున్నట్లు వివరించాడు.
సేంద్రియ పద్ధతిలో బ్లాక్‌రైస్, నవార్ సాగు
ప్రస్తుత పరిస్థితుల్లో బ్లాక్‌రైస్, నవార్ వంటి వివిధ రకాల వరి ధాన్యం వైపు ప్రజలు మక్కువ చూపుతున్నారు. సేంద్రియ పద్ధతిలో సాగుచేస్తే ప్రతి పంటకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. కేజీ ధర రూ.220 నుంచి రూ.250 వరకు పలుకుతోంది. డిమాండ్‌ను బట్టి సొంతంగా మార్కెట్ చేయాలనే ఉద్దేశంతో వివిధ రకాల వరి ధాన్యం సేద్యం చేస్తున్నా.
– పులి భూపాల్
కూజ్ పటియాలాతో ఖుషీ
ఆత్మకూరు (ఎం): యాదాద్రి భువనగిరిజిల్లా ఆత్మకూర్ (ఎం) మండలం టి.రేపాక గ్రామానికి చెందిన రైతు బండ యాదగిరి మూడు ఎకరాల్లో కూజ్ పటియాలా రకం సాగు చేస్తున్నాడు. 1010 రకం వడ్లు పండిస్తే సరైన ధర లేక పోవడం, ప్రభుత్వం కొనుగోలు చేయక పోవడం లాంటి సమస్యలు వస్తుండటంతో ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలిపాడు. వడ్లను సిద్దిపేటలో ఓ రైతు నుంచి కిలోకు రూ.100 చొప్పున తీసుకువచ్చాడు. పంట కాలం నాలుగు నెలలు. సేంద్రియ పద్ధతిలో వేప నూనె, పంచగవ్వ, స్థానికంగా దొరికే దినుసులతో కషాయాలను తయారు చేసి పంటకు పిచికారీ చేస్తున్నాడు. ఈ రకం వరి పంటతో మంచి లాభం పొందే అవకాశం ఉందని యాదగిరి తెలిపాడు. సేంద్రీయ పద్ధతులు పాటించి సాగు చేయడమే కాకుండా మంచి బలవర్థకమైన, ప్రొటీన్‌లు, ఔషధగుణాలు కలిగిన ధాన్యం కావడంతో స్థానికంగా ఈ రకానికి బాగా డిమాండ్ ఉంది. ఎకరానికి 50 బస్తాల వరకు దిగుబడి రాగా క్వింటాల్ రూ. 8 వేల చొప్పున అమ్ముతున్నాడు.
సాగు విస్తీర్ణం పెంచుతా
బాస్మతి వరి సాగు విస్తీర్ణం పెంచుతా. వానాకాలంలో అర ఎకరం సాగు చేశాను. తెగుళ్ల బాధ పెద్దగా లేదు. దిగుబడి ఆశాజనకంగా ఉంది. సుమారు 40 బస్తాల ధాన్యం రావచ్చు. ఇప్పటికే పది మంది రైతులు పొలంలోని బాస్మతి వరి పంటను పరిశీలించారు. వారంతా బాస్మతి సాగు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.
– దేవరపల్లి విద్యాసాగర్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment