సాక్షి, హైదరాబాద్: సంబరాల్లేవు. సందడి లేదు. షాపింగ్ హడావుడి, ప్రయాణ ప్లానింగ్, అలయ్– బలయ్.. ఆత్మీయ పలకరిం పులు.. ఏమీ లేవు. ఆడపడుచుల ఆటలు.. బతుకమ్మ పాటలూ లేవు. తెలంగాణలో అతిపెద్ద పండుగ దసరా కళ తప్పింది. ఉత్సవ వాతావరణం లోపించింది. కరోనా మహమ్మారి తెచ్చిన కష్టమిది. పైగా ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలు... రాష్ట్రవ్యాప్తంగా రైతన్నకు వేదన మిగిల్చి పండుగ సంతోషాన్ని లేకుండా చేశాయి. నిండా మునిగిన భాగ్యనగరం ఇప్పుడిప్పుడే కాస్త తేరుకుంటోంది. మొత్తానికి జనంలో ఎక్కడా పండుగ జోష్ కనిపించడం లేదు. ఈసారికి ఉన్నచోటే సాదాసీదాగా కానిచ్చేద్దాం... అనే ఆలోచనలో జనం ఉన్నారు. కోవిడ్ మహమ్మారి ప్రభావానికి అన్నీ మారుతున్నాయి.
గత ఏడెనిమిది నెలలుగా కరోనా వైరస్ విజృంభణతో దాదాపుగా ఇళ్లకే పరిమితమైన వారు ఇప్పుడిప్పుడే కొం చెం స్వేచ్ఛగా బయటకు వస్తున్నారు. లాక్‌డౌన్ కారణంగా ఆర్థిక వ్యవస్థ గాడితప్పింది. చిరువ్యాపారులు చిత్తయ్యారు. పేదలు, మధ్యతరగతి ప్రజల ఆర్థిక పరిస్థితి ఒక్కసారిగా తల్లకిందులైంది. కొనుగోలు శక్తి తగ్గిపోయింది. దీంతో సహజంగానే పండుగ చేసుకునే మూడ్‌లో జనం లేరు. దానికితోడు తొలగని కరోనా ముప్పు. పిల్లల ఆనందం కోసం..: తెలంగాణ సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా భావించే బతుకమ్మ పండుగ పట్టణాల్లో, పల్లెల్లో ఘనంగా జరిగేది. అపార్ట్‌మెంట్లలో, కమ్యూనిటీ సెంటర్లలో, గుడుల్లో... బతుకమ్మలు పేర్చడం, ఆటపాటలతో సందడిగా గడిచేది. ఈసారి కోవిడ్ నిబంధనల మూలంగా ఎక్కడా పెద్దగా బతుకమ్మ ఆడలేదు. పట్టణాలు, నగరాల్లో దుర్గామాతను ప్రతిష్టించి, సాంస్కృతిక కార్యక్రమాలు, దాండియాలతో నవరాత్రులు ఘనంగా జరిగేవి. అదీ ఈసారి కనిపించలేదు. పిల్లల ఆనందాన్ని ఎందుకు కాదనాలనే ఉద్దేశంతో పలువురు తల్లిదండ్రులు దసరా షాపింగ్‌ను ఏదో అయిందనిపించారు. మునుపటి స్థాయిలో విక్రయాలు లేవని వ్యాపారులు బోరుమంటున్నారు.
గతం కంటే భిన్నం...
గతంలో దసరా వచ్చిందంటే పట్నం, పల్లె అనే తేడా లేకుండా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకునే వారు. పట్నాలన్నీ పల్లెలకు తరలాయా అన్నట్టుగా ఉండేది. మెజారిటీ జనం సొంతూళ్లకు చేరుకునే వారు. కోవిడ్ నేపథ్యంలో జనంతో కలిసిపోయి పండుగ చేసుకునే పరిస్థితి లేదు కాబట్టి ఎక్కడున్నా ఒక్కటేననే భావనతో ఈసారి చాలామంది ప్రజలు ఊళ్లకు వెళ్లలేదు. దసరా నాడు ఊరంతా ఉమ్మడిగా జమ్మి చెట్టు వద్ద పూజలు చేసి, జమ్మి‘బంగారం’పంచుకుని... గుంపులుగా ఆలింగనాలు చేసుకునే పరిస్థితి నేడు లేదు, ఇత ర వస్తువుల మాదిరిగానే జమ్మి ఆకులను కూడా బయట కొనుగోలు చేసి కుటుంబపెద్దలు, ఆప్తులకు పరిమితంగా అందజేసి ఆశీర్వాదాలు పొందా ల్సిన పరిస్థితి ఏర్పడింది. ఊళ్లకు వెళ్లలేని వారు, కోవిడ్ భయంతో పట్టణా ల్లోనే ఉండి పోయినవారు ఫోన్లలోనే దసరా శుభాకాంక్షలు చెప్పుకోవాల్సిన పరిస్థితి. ఫోన్లు, వాట్సాప్, ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా గ్రీటింగ్స్ చెప్పుకోవాల్సి వస్తోంది. సామూహిక సంబరాలకు జనం దూరమయ్యారు. కోవిడ్ భయం, ఆంక్షల కారణంగా పిల్లాపాపలతో బయటకు వెళ్లలేకపోతున్నారు. సినిమాలు, షికార్లు, ఔటింగ్‌లు, డిన్నర్‌లు లేవు. ఇలాంటి పరిస్థితుల్లో సొంతూరుకి వెళ్లి నాలుగు రోజులుంటే మనసు కాస్త కుదుటపడేది. కానీ కరోనా కారణంగా ఆ అవకాశమూ లేకుండా పోయింది.
ప్రయాణాలు అంతంతే...
గతంలో దసరా పండుగ వచ్చిందంటే పట్నం నుంచి పల్లెకు ప్రజలు క్యూ కట్టేవారు. బస్సులు, రైళ్లు, ప్రైవేటు వాహనాలు కిక్కిరిసిపోయేవి. సీట్ల కోసం అధికారులు, రాజకీయ నాయకుల రికమండేషన్‌తో బెర్తులు ఖరారు చేసుకునేవారు. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సులు లేవు. రైళ్లు కూడా చాలా పరిమితంగా నడుస్తున్నాయి. మరోవైపు కరోనా భయం. దీంతో ప్రయాణాలు తగ్గిపోయాయి. పండుగ వేళ టోల్ ప్లాజాల వద్ద కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్‌లు గతంలో కనపడేవి. సొంత వాహనాలున్న కుటుంబాలు కొన్ని ఊళ్లకు ప్రయాణమయ్యాయి తప్పితే... ఇప్పుడా రద్దీ లేదు. రహదారులు ఖాళీఖాళీగా దర్శనమిస్తున్నాయి.
మాస్క్‌లు, భౌతికదూరం... గ్రామ కమిటీల నిర్ణయం
దసరా వచ్చిందంటే పల్లెటూరులో సందడే వేరు. జనంతో ఊళ్లు నిండిపోయేవి. ఆత్మీయ పలకరింపులు, ఆలింగనాలు, యోగక్షేమాలు తెలుసుకోవడం, విందులు వినోదాలతో పండుగ కళ ఉట్టిపడేది. కరోనా నేపథ్యంలో పట్నంవాసులు పల్లెకు వెళ్లకపోవడంతో ఈసారి స్తబ్ధత నెలకొంది. పల్లెలో ఉన్న వాళ్లు సైతం మాస్క్‌లు, భౌతికదూరం పాటిస్తూ పండగ జరుపుకోవాలని ఇప్పటికే గ్రామ కమిటీలు నిర్ణయించాయి.
‘ముందుచూపు లేకపోవడంవల్లే నష్టం’
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వానికి ముందుచూపు లేకపోవడం వల్లే రాష్ట్రం లో భారీ వర్షాలు, వరదల కారణంగా పెద్ద ఎత్తున నష్టం జరిగిందని ఏఐసీసీ కిసాన్ సెల్ వైస్ చైర్మన్ ఎం.కోదండరెడ్డి విమర్శించారు. శనివారం ఆయన గాంధీభవన్ లో టీపీసీసీ కిసాన్ సెల్ అధ్యక్షుడు అన్వేశ్ రెడ్డితో కలి సి విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి నష్ట అం చనాలు వేయలేదని, కేంద్రం నుంచి వచ్చిన పరిశీలన బృందానికి తాము రాష్ట్రంలో జరిగిన నష్టాలను లేఖ రూపంలో తెలియజేశామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment