మెట్రో నగరాల్లో హైదరాబాద్‌ సిటీ టాప్‌ | Forest Green Cover Increased In Telangana Hyderabad | Sakshi
Sakshi News home page

మెట్రో నగరాల్లో హైదరాబాద్‌ సిటీ టాప్‌

Published Fri, Jan 14 2022 6:46 AM | Last Updated on Fri, Jan 14 2022 3:48 PM

Forest Green Cover Increased In Telangana Hyderabad - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హైదరాబాద్‌: దేశంలోని మెట్రో నగరాల్లో 2011– 2021 మధ్య దశాబ్ద కాలంలో పచ్చదనం విస్తీర్ణం గ్రేటర్‌లో అత్యధికంగా (48.66 చ.కి.మీ) పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో 19.91 చదరపు కి.మీ పెరగగా.. ఇదే సమయంలో అహ్మదాబాద్‌లో 8.55 చ.కి.మీ,  బెంగళూరులో 4.98 చ.కి.మీ తగ్గింది. జీహెచ్‌ఎంసీ విస్తీర్ణం 634.18 చ.కి.మీ పరిధిలో 2011లో కేవలం 33.15 చ.కి.మీ మేర పచ్చదనం ఉండగా అది 2021లో 81.81 చ.కి.మీటర్లకు పెరిగింది. నగరంలో పచ్చదనం శాతం 5.23 శాతం నుంచి 12.9 శాతానికి పెరిగింది. ఫారెస్ట్‌ సర్వే ఆఫ్‌ ఇండియా తాజాగా విడుదల చేసిన నివేదికలో ఈ అంశాల్ని ప్రస్తావించింది. 

పచ్చదనంపై శ్రద్ధతో.. 
తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న శ్రద్ధ, హరితహారం వంటి కార్యక్రమాలతో నగరంలో పచ్చదనం క్రమేపీ పెరుగుతోంది. గ్రేటర్‌ నగరంలో ఇప్పటి వరకు నిర్వహించిన హరితహారం కార్యక్రమాల్లో భాగంగా దాదాపు నాలుగు కోట్ల  మొక్కలు ప్రభుత్వం తరపున నాటడం, ప్రజలకు పంపిణీ చేయడం  వంటివి చేశారు.  

లేఔట్‌లలోని ఖాలీస్థలాల్లో, ప్రభుత్వ కా ర్యాలయాలు, సంస్థల ప్రాంగణాల్లో, చెరువులు, సరస్సుల వెంబడి, కాలనీల్లో ఖాలీగా ఉన్న స్థలాల్లో విరివిగా నాటారు. అవెన్యూ ప్లాంటేషన్‌ పేరిట రోడ్ల వెంబడి, ఇతరత్రా బహిరంగ ఖాలీ ప్రదేశాల్లో పెద్ద చెట్లుగా ఎదిగే మొక్కలు నాటారు.ఈ కార్యక్రమాల కోసం ఇప్పటి వరకు దాదాపు రూ. 50 కోట్లు ఖర్చు చేశారు. 
► ఇటీవలి కాలంలో ఎక్కడా ఖాళీ ప్రదేశమన్నది కనిపించకుండా  మొక్కలు నాటేందుకు కొన్ని కాలనీల్లో ఇప్పటికే చర్యలు చేపట్టారు. జీహెచ్‌ఎంసీ బడ్జెట్‌లోనూ గ్రీన్‌ బడ్జెట్‌ పేరిట పది శాతం నిధుల్ని పచ్చదనం పెంపు కార్యక్రమాలకు కేటాయించారు. గ్రేటర్‌ నగరంలో దాదాపు 4850 కాలనీలున్నాయి.  
► ఆయా కాలనీలన్నింటిలోనూ ఎక్కడా ఖాళీ స్థలం కనిపించకుండా, ఇక నాటేందుకు ఎక్కడా జాగాలేదు అనే విధంగా  మొక్కలు నాటే చర్యలకు సిద్ధమయ్యారు. చిట్టడవులుగా పెరిగే మియావాకీ విధానానికీ తగిన ప్రాధాన్యతనిచ్చారు. పార్కులతోపాటు ఫ్లైఓవర్ల కింద, రోడ్ల వెంబడి సెంట్రల్‌ మీడియన్లలో పెద్దయెత్తున మొక్కలు నాటారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement