సాక్షి, హైదరాబాద్: అటవీ విద్యా బోధన, పరిశోధనలో అత్యున్నత ప్రమాణాలు పాటిస్తున్నందుకు గాను తెలంగాణ అటవీ కళాశాల, పరిశోధన సంస్థ (ఎఫ్‌సీఆర్‌ఐ)ను ఏ ప్లస్ కేటగిరీ విద్యాసంస్థగా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. అటవీ కాలేజీలు, ప్రమాణాలు, వసతులను అధ్యయనం చేసిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ (ఐసీఎఫ్‌ఆర్‌ఈ), తెలంగాణ కాలేజీకి అత్యంత ప్రాధాన్యత గుర్తింపునిచ్చింది. ప్రభుత్వ కృషికి తగిన ఫలితం లభించిందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. అటవీశాఖ అధికారులు, కాలేజీ యాజమాన్యం, సిబ్బంది, విద్యార్థులను అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. అడవులు, పర్యావరణ రక్షణకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ అటవీ విద్యను ప్రోత్సహించాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక అటవీ కళాశాల ఏర్పాటును ప్రోత్సహించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలోనే ఈ నిర్ణయం తీసుకున్నారు.
2015లోనే కాలేజీ స్థాపన..
తమిళనాడు మెట్టుపలాయం అటవీ కాలేజీకి దీటుగా తీర్చిదిద్దాలన్న కేసీఆర్ ఆదేశాలతో 2015లో కాలేజీ స్థాపన.. 2016లో బీఎస్సీ ఫారెస్ట్రీ మొదటి బ్యాచ్ నాలుగేళ్ల కోర్సుతో ప్రారంభమైంది. ఈ ఏడాదే ఫైనలియర్ విద్యార్థులు తమ కోర్సు పూర్తి చేసుకుంటున్నారు. ముందుగా దూలపల్లి ఫారెస్ట్ అకాడమీలో మొదలైన కాలేజీ.. గతేడాది డిసెంబర్‌లో హైదరాబాద్ శివారు ములుగులోని సొంత క్యాంపస్‌లోకి మారింది. అత్యంత అధునాతన సౌకర్యాలు, వసతులతో ఏర్పాటైన కొత్త క్యాంపస్ ముఖ్యమంత్రి చేతుల మీదుగానే ప్రారంభమైంది. విజయవంతంగా మొదటి బ్యాచ్ బీఎస్సీ ఫారెస్ట్రీ కోర్సును పూర్తి చేసుకుంటున్న అటవీ కళాశాల ఈ ఏడాది నుంచి రెండేళ్ల ఎంఎస్సీ ఫారెస్ట్రీతో పాటు, మూడేళ్ల పీహెచ్‌డీ ఫారెస్ట్రీ కోర్సులను కూడా ప్రారంభిస్తోంది.
తొలినాళ్లలో ఇంటర్మీడియట్ మార్కుల ఆధారంగా బీఎస్సీ అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగింది. ఆ తర్వాత ఎంసెట్ కౌన్సెలింగ్ ఆధారంగా ప్రస్తుతం అడ్మిషన్లు జరుగుతున్నాయి. బోధనలో ఉన్నత ప్రమాణాలు పాటించటంతో పాటు బ్రిటిష్ కొలంబియా, అబర్న్ యూనివర్సిటీలతో అవగాహనా ఒప్పందాలను కుదుర్చుకుంది. ఇటీవలే ఓ విద్యార్థినికి అబర్న్ యూనివర్సిటీ ఉచితంగా ఎంఎస్సీ సీటును ఆఫర్ చేసింది. తాజాగా ఏ ప్లస్ గుర్తింపు సాధించడంతో తెలంగాణ ఫారెస్ట్ కాలేజీకి జాతీయ, అంతర్జాతీయ గుర్తింపు మరింతగా వచ్చే అవకాశముంది. ప్రభుత్వం, ఇతర సంస్థల సహకారంతో అటవీ కాలేజీ విద్య, పరిశోధనా రంగాల్లో అభివృద్ధికి ఆస్కారం ఏర్పడుతోంది.
Comments
Please login to add a commentAdd a comment