అడవి పంది.. చంపాలంటే ఇబ్బంది! | Forest Laws Preventing The Killing of Wild Boar | Sakshi
Sakshi News home page

Published Sat, Nov 21 2020 8:46 AM | Last Updated on Sat, Nov 21 2020 8:47 AM

Forest Laws Preventing The Killing of Wild Boar - Sakshi

రాష్ట్రంలో పెద్ద పులి ఒక వ్యక్తిపై దాడి చేసి చంపడమే కాకుండా కొన్ని శరీరభాగాలను భక్షించడం కలకలాన్ని సృష్టించింది. ఆ పులిని గుర్తించి బంధించేందుకు అటవీ అధికారులు ముమ్మర చర్యలు చేపట్టారు. పులి దాడి చేసి చంపిన అదే (కొమురం భీం ఆసిఫాబాద్‌) జిల్లాలోని అదే దహెగాం మండలం చిన్న ఐనం గ్రామంలో తన పొలం లో పనిచేసుకుంటున్న కె.జితేందర్‌ (33) అనే రైతుపై ఈ నెల 15న అడవి పంది దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. కరీంనగర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి అతడు చనిపోయాడు. 
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఇటీవల అడవి పందుల బెడద విపరీతంగా పెరిగింది. అడవుల పక్కనుండే పల్లెల్లోని ప్రజలు తమ ప్రాణాలను, పంటలను వీటి నుంచి రక్షించాలని అధికారులను వేడుకుంటున్నారు. ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, మెదక్, నల్లగొండ తదితర జిల్లాల్లో ఈ సమస్య పెరుగుతోంది.  ఈ అంశంపై వ్యవసాయ, అటవీ శాఖలు దృష్టి సారించాయి. 

షెడ్యూల్‌–3 నుంచి మార్చితేనే..
రక్షిత జంతువుల జాబితాలో అడవి పందిని చేర్చడంతో ప్రభావిత ప్రాంతాల్లో వాటిని సంహరించేందుకు అటవీ చట్టాలు అడ్డొస్తున్నాయి. వీటిని చంపడం ఈ చట్టాల మేరకు నేరం. 1972 వన్యప్రాణి సంరక్షణ చట్టంలోని షెడ్యూల్‌–3లో ఉన్న అడవి పందిని షెడ్యూల్‌–5లోకి (వెర్మిన్‌లోకి చేర్చి తే) మార్చితే పరిమిత ప్రాంతాల్లో హతమార్చే అవకాశాలుంటాయి. అయితే దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరి కావడంతో వీటి వల్ల ఏయే జిల్లాల్లోని ఏయే ప్రాంతా ల్లో పంటలకు నష్టం వాటిల్లుతోంది? ఇతరత్రా రైతులు, ప్రజ లకు ఎదురవుతున్న సమస్యలేమిటి అన్న దాని పై నివేదిక సిద్ధం చేసే పనిలో అటవీశాఖ నిమగ్నమైంది. (ఆ రెండిటి మధ్య అత్యంత అరుదైన పోరు)

ఏమిటీ వెర్మిన్‌..?
పంటలు, వ్యవసాయంలో సహాయపడే పశువులు, మేకలు, ఇతర పెంపుడు జంతువులకు నష్టం కలుగజేసే.. ఆస్తులు, ఇతర ప్రాణాలకు అపాయం కలిగించే వ్యాధులు, రోగాల వ్యాప్తికి కారణమయ్యే జంతువులు, పక్షులను ‘వెర్మిన్‌’గా ప్రకటించవచ్చు. ఈ సమస్య అధికంగా ఉన్న ప్రాంతాల్లోనే, పరిమిత కాలం పాటు వేటగాళ్ల సాయంతో వెర్మిన్లను వేటాడేందుకు అనుమతి లభిస్తుంది. గతంలో పలు రాష్ట్రాలు తగిన సమాచారం, పంటలు, ఇతరత్రా జరుగుతున్న నష్టంపై సమగ్ర వివరాలు పంపకుండానే కొన్ని రకాల జంతువులను ‘వెర్మిన్‌’గా ప్రకటించాలని చేసిన విజ్ఞప్తులపై కేంద్రం ఆ మేరకు నోటిఫికేషన్లు జారీ చేసిన సందర్భాలున్నాయి. ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు కూడా చాలా సమయమే పడుతోం ది. ఈ నేపథ్యంలో అటు వ్యవసాయశాఖ, ఇటు అటవీశాఖ ఆయా జిల్లాలు, ప్రాంతాల వారీ గా జరుగుతున్న నష్టంపై వివరాలు సేకరించి నివేదికను సిద్ధం చేయడంలో నిమగ్నమయ్యాయి. (లాప్‌టాప్‌ లాక్కెళ్లిన పంది.. నగ్నంగా అడవంతా..)

ఈ నివేదిక సిద్ధమయ్యాక రాష్ట్ర ప్రభుత్వానికి పంపించి, సర్కార్‌ ఆమోదంతోనే కేంద్రానికి పంపించాల్సి ఉంటుంది. అయితే కేంద్రం నుంచి అనుమతే కాకుండా రాష్ట్రప్రభుత్వ ఆమోదం మేరకు అడవి పందుల వల్ల అధిక నష్టం జరుగుతున్న ప్రాంతాల్లో, పరిమిత కాలానికి వీటిని వేటగాళ్లతో చంపించేందుకు అవకాశం కూడా ఉంది. ఈ వన్యప్రాణులు, పక్షులను ‘వెర్మిన్లు’గా ముద్రవేసి చంపడాన్ని పర్యావరణవేత్తలు వ్యతిరేకిస్తున్నారు. కూరమృగాలు, వన్యప్రాణుల నుంచి పంటల రక్షణ, రైతులపై ప్రాణాంతక దాడుల నివారణకు ఉత్తరాఖండ్, బిహార్, హిమాచల్‌ప్రదేశ్‌లకు కొన్ని జంతువులను వెర్మిన్‌లో చేర్చేందుకు కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ అనుమతినిచ్చిం ది. ఈ రాష్ట్రాలతో పాటు గతంలో మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలు కూడా ప్రైవేట్‌ షూటర్లు, వేటగాళ్లతో కొన్ని జంతువులను చంపేందుకు అనుమతినిచ్చాయి. 

వివరాలు రాగానే నివేదిక..
అడవి పందులను తాత్కాలికంగా వెర్మిన్‌ జాబితాలో చేర్చే అంశాన్ని పరిశీలిస్తున్నాం.. అయితే దానికి కేంద్రం అనుమతి కావాలి. రాష్ట్రంలో అడవి పందుల సమస్యలపై కొన్ని జిల్లాల ఫీల్డ్‌ ఆఫీసర్ల నుంచి నివేదికలొచ్చాయి. పూర్తి వివరాలు, సమాచారం వచ్చాక ఓ నిర్ణయం తీసుకుంటాం.. దీనికి సంబంధించి వ్యవసాయ శాఖ నుంచి కూడా నివేదిక రావాల్సి ఉంది. ఆ తర్వాత ఈ అంశంపై తుది నిర్ణయం కోసం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపిస్తాం.– అటవీశాఖ వైల్డ్‌లైఫ్‌ విభాగం ఓఎస్డీ శంకరన్‌  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement