
సాక్షి, మంచిర్యాల: రెండు నెలలుగా ఆసిఫాబాద్ అటవీ అధికారులకు చిక్కకుండా మహారాష్ట్రకు వెళ్లిపోయిన పులిది విచిత్ర ప్రవర్తన. మొదటి నుంచీ జనావాసాల్లోనే సంచరిస్తూ ప్రజలపై దాడి చేసేది. తడోబా అంధేరి టైగర్ రిజర్వుకు చెందిన ఈ మగ పులి గతేడాది ఏప్రిల్ నెలలో ఆసిఫాబాద్ మీదుగా కవ్వాల్ టైగర్ కారిడార్‌లోకి అడుగుపెట్టింది. ఇదే సమయంలో మరో మగ పులి రాగా మంచిర్యాల జిల్లా చెన్నూరు, నీల్వాయి, కోటపల్లి అడవుల్లో సంచరించి ఎవరికీ హానీ చేయకుండా తిరిగి మహారాష్ట్రకు వెళ్లిపోయింది. ఈ రెండింటికీ ఏ1, ఏ2గా నామకరణం చేశారు. నాలుగేళ్ల వయస్సున్న ఏ2 ఎనిమిది నెలలుగా ఇక్కడే సంచరిస్తూ.. తోటి పులుల ఆవాసాలను డిస్టబ్ చేయడమే కాక తన ప్రవర్తనతో అటవీ అధికారులు, సామాన్యుల్లోనూ భయం పుట్టించింది. ఈ మగ పులి జన్మస్థలం చంద్రాపూర్ జిల్లాలో చంద్రాపూర్ థర్మల్ విద్యుత్ కేంద్రం పరిసర అడవులు. ఈ పులితోపాటు మరో ఆడపులికి తన తల్లి జన్మనివ్వగా.. ఆ పులి ప్రస్తుతం అక్కడే ఉంది. ఈ మగ పులి చిన్నప్పటి నుంచే భిన్న ప్రవర్తనను కలిగి ఉన్నట్లు అక్కడి అధికారులు గుర్తించారు. మానవ సంచార ప్రదేశాలకు తరచూ వస్తూ జనాలను బెంబేలెత్తించేది. పలుమార్లు అక్కడ కూడా మనుషులపై దాడికి ప్రయత్నించింది. (చదవండి: పులిపై మత్తు ప్రయోగం.. రంగంలోకి షూటర్లు)
అలా ఆవాసం వెతుక్కుంటూ తెలంగాణలోకి చేరింది. మొదటగా ఏప్రిల్‌లో ఆసిఫాబాద్ జిల్లా ఖైరీగూడ ఓపెన్ కాస్టుల్లో, బెల్లంపల్లి పట్టణానికి సమీప ప్రాంతంలోకి రావడంతోపాటు అడవులకు ఆనుకుని ఉన్న గ్రామాల వరకు వచ్చి అనేక మందికి ప్రత్యక్షంగా కనిపించింది. మొదటిసారి దిగిడలో ఓ యువకుడిపై దాడి చేసింది. రెండోసారి 18 రోజుల వ్యవధిలోనే యువతిపై దాడి జరగడంతో అధికారులు ఈ మగ పులి ప్రవర్తనను మహారాష్ట్ర అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ పులిని బంధించి జూకు తరలించడమే ఉత్తమమని భావించి చివరకు మత్తు మందు ప్రయోగం వరకు వెళ్లినా ఫలితం రాలేదు. అడవిలో మానవ అలికిడి, శబ్దాలను పసిగట్టిన పులి తన ‘సొంతూరు’కు వెళ్లిపోయింది. రెండురోజుల క్రితం బెజ్జూరు రేంజీ తలాయి, పెంచికల్‌పేట రేంజీ పెద్దవాగు తీరం వెంట ప్రాణహిత నది దాటి మహారాష్ట్రలోని తడోబా అడవుల్లోకి అడుగుపెట్టినట్లు అధికారులు గుర్తించారు. అయితే టైగర్ కారిడార్‌లో పులుల రాకపోకలు సాధారణమే అయినప్పటికీ ఈ పులి ప్రవర్తన స్థానిక అధికారులను ముచ్చెమటలు పట్టించింది. మళ్లీ ఎప్పుడైనా ఇటువైపు రావొచ్చని అధికారులు చెబుతున్నారు. అప్పుడు ఎవరికీ హాని చేయకుండా ముందు జాగ్రత్తతో బంధిస్తామని ఉన్నతాధికారులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment