సాక్షి, హైదరాబాద్: మధ్యవర్తిత్వానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం త్వరలో చట్టం చేయనుందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ వెల్లడించారు. ఆ బిల్లు ఆమోదం పొంది అమల్లోకి వస్తే కేసుల పరిష్కారం వేగవంతం అవుతుందని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ మీడియేషన్ సెంటర్ (ఐఏఎంసీ) ఏర్పాటై ఏడాది పూర్తయిన సందర్భంగా ఆదివారం భారత మధ్యవర్తిత్వ దిన తొలి వార్షికోత్సవం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జస్టిస్ ఎన్వీ రమణ హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘మధ్యవర్తిత్వం ద్వారా కేసుల్ని రాజీ చేసుకొనే విధానాన్ని అనుసరిస్తేనే ఏ దేశమైనా న్యాయ వివాదాల సత్వర పరిష్కారం ద్వారా పురోగతి సాధిస్తుంది. ఎంఎన్సీ సంస్థల నుంచి సాధారణ స్థాయి సంస్థల్లో జరిగే ఒప్పందా ల్లో విదాదం ఏర్పడితే నేరుగా న్యాయస్థానాన్ని ఆశ్ర యించకుండా తొలి దశలో మధ్యవర్తిత్వం ద్వారా ఆ వివాదం పరిష్కరించుకొనేలా ఒప్పందం ఉండాలి.
హైదరాబాద్‌లో వేలాది నిర్మాణాలు జరుగుతున్నా యి. సివిల్ వివాదాలు ఏళ్ల తరబడి కోర్టుల్లో వాయిదాల మీద వాయిదాలు పడే అవకాశం ఉంది. తద్వారా అది పెట్టుబడులపై ప్రతికూల ప్రభావం చూపుతుంది’అని జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు.
చోళుల కాలంలోనే ‘మధ్యవర్తిత్వం’...
దేశంలో చోళుల కాలం నుంచే మధ్యవర్తిత్వ ప్రయత్నాలు సాగేవని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ హిమాకోహ్లి తెలిపారు. ‘వ్యాపార లావాదేవీల్లో వివాదాలను ఆర్బిట్రేషన్ విధానంలోనే పరిష్కరించుకొనేవారు. ఆర్బిట్రేషన్, చర్చలు, మధ్యవర్తిత్వం లోక్‌అదాలత్ ఇవన్నీ ప్రత్యామ్నాయ వివాద పరిష్కారానికి (ఏడీఆర్) విభిన్న కోణాలే. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ 2021–22 సమాచారం ప్రకారం దేశంలో 464 ఏడీఆర్ కేంద్రాలుంటే 397 పనిచేస్తున్నాయి.
570 మధ్యవర్తిత్వ కేంద్రాలు పనిచేస్తున్నాయి. వాటిలో ఇప్పటివరకు 53 వేల కేసులు పరిష్కారం అయ్యాయి. మధ్యవర్తిత్వ బిల్లు – 2021ను త్వరలోనే పార్లమెంటు ఆమోదించే అవకాశం ఉంది. నిర్దిష్ట గడువులోగా మీడియేషన్ ప్రక్రియ పూర్తి (180 రోజుల్లో పూర్తి చేయాలి. లేనిపక్షంలో మరో 180 రోజులు పొడిగింపు), మధ్యవర్తుల నమోదుకు జాతీయ స్థాయిలో మధ్యవర్తిత్వ మండలి ఏర్పాటు, మధ్యవర్తిత్వ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసుకున్నాక ఉభయ పార్టీలు అందుకు కట్టుబడి ఉండాలి.
మధ్యవర్తిత్వ వ్యవహారాలన్నీ గోప్యంగా ఉంచడం వంటివి ప్రతిపాదిత బిల్లులో కీలకాంశాలు. కోవిడ్ లాక్‌డౌన్ వేళ ఏడీఆర్ అమల్లో స్పష్టమైన మార్పులు చోటుచేసుకున్నాయి. అవి ఆన్‌లైన్ వివాద పరిష్కార (ఓడీఆర్) దిశగా కేసుల సత్వర పరిష్కారానికి దోహదపడ్డాయి’అని జస్టిస్ హిమాకోహ్లి పేర్కొన్నారు.
సమయం, డబ్బు ఆదా: హైదరాబాద్‌లో ఐఏఎంసీ ఏర్పాటును స్ఫూర్తిగా తీసుకొని కేంద్ర ప్రభుత్వం గుజరాత్‌లో ఆర్బిట్రేషన్–మీడియేషన్ సెంటర్ ఏ ర్పాటుకు ఆర్థిక సాయం అందించింది. ఈ సెంటర్ల ద్వారా సమయం, డబ్బు ఆదా అవుతుంది. సింగపూర్ ఆర్బిట్రేషన్–మీడియేషన్ ఒప్పందంపై భార త్ 2019 ఆగస్టు 7న సంతకం చేసింది. శ్రీకృష్ణుడు కౌరవ, పాండవుల మధ్య రాయబారానికి ప్రయచారు. అది విఫలం కావడంతోనే కురుక్షేత్ర యుద్ధం జరిగింది. పెను వినాశనానికి దారితీసింది. గ్రామీణ ప్రాంతాల్లో పెద్దలు రచ్చబండ విధానం ద్వారా స్థానికంగా వివాదాల్ని పరిష్కరించే సంప్రదాయం ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు అంతర్జాతీయంగా మధ్యవర్తిత్వ విధానానికి ఆదరణ లభిస్తోంది’అని జస్టిస్ ఎన్వీ రమణ వివరించారు.
33 కేసుల పరిష్కారం...
ఐఏఎంసీ ఇప్పటివరకు 33 కేసుల్ని పరిష్కరించిందని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వర్‌రావు వెల్లడించారు. ఆర్బిట్రేషన్ ద్వారా పది కేసులు, మీడియేషన్ ద్వారా 23 కేసుల్లో మొత్తం 700 బిలియన్ డాలర్ల విలువైన వివాదాలు పరిష్కారమయ్యాయని వివరించారు. అనంతరం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, ఐఏఎంసీ సీఈ వో జస్టిస్ ఆర్వీ రవీంద్రన్, సింగపూర్ ఐఏఎంసీ చైర్మన్ జార్జి లిమ్ ప్రసంగించారు. వారికి ఐఏఎంసీ రిజిస్ట్రార్ తారిక్ స్వాగతం పలికారు. తర్వాత మధ్యవర్తిత్వంపై పలు చర్చాకార్యక్రమాలు జరిగాయి.
Comments
Please login to add a commentAdd a comment