సాక్షిప్రతినిధి, వరంగల్/సాక్షి, హైదరాబాద్: సీనియర్ రాజకీయ వేత్త, మాజీ ఎమ్మెల్యే మందాడి సత్యనారాయణరెడ్డి (84) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం తెల్లవారుజామున హనుమకొండలోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండలం ఇప్పగూడలో 1936, సెప్టెంబర్ 2న మందాడి రంగమ్మ, రాంరెడ్డి దంపతులకు ఆయన జన్మించారు. ఆయనకు కుమారుడు శ్యాంప్రసాద్‌రెడ్డి, కూతురు రమ ఉన్నారు.
బీజేపీలో కార్యకర్తగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. 2004లో ఎమ్మెల్యేగా గెలిచారు. రాజకీయ నేతగానే కాకుండా.. గాయకుడిగా, కవి, రచయితగా కూడా ఆయన గుర్తింపు పొందారు. తెలంగాణ ఉద్యమ సమయంలో మందాడి సత్యనారాయణరెడ్డి కీలక పాత్ర పోషించారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని సామాన్య ప్రజలకు అర్థమయ్యేలా పాటలు రాసి అసెంబ్లీ వేదికగా పాడారు. మందాడి సత్యనారాయణరెడ్డి మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
విద్యార్థిగా ఉన్నప్పటి నుంచే ఆర్‌ఎస్‌ఎస్ వైపు..
మందాడి సత్యనారాయణరెడ్డి వరంగల్‌లో విద్యాభ్యాసం చేస్తున్నప్పుడే 1952లో ఆర్‌ఎస్‌ఎస్‌లో చేరారు. విద్యాభ్యాసం అనంతరం 1957లో భారతీయ జన సంఘ్‌లో ఫుల్‌టైం ఆర్గనైజర్‌గా పనిచేశారు. వివాహం అనంతరం కూడా ఫుల్‌టైం ఆర్గనైజింగ్ సెక్రెటరీగా అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో ఆయన పనిచేశారు. విద్యాభ్యాసం సమయంలో కూడా జై తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. కచ్ ఐక్యత, గోవా ఉద్యమాల్లో అరెస్టయి కొన్నిరోజులు జైలు జీవితం గడిపారు.
తెలంగాణకోసం పోరాటం
1997 నుంచి వివిధ వేదికల ద్వారా మందాడి తెలంగాణ సమస్యలు, ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకోసం పోరాటాలు చేశా రు. 1971లో జనసంఘ్, 1997లో బీజేపీలకు తెలంగాణ ఆవిర్భావం ఆవశ్యకత గురించి చెప్పి ఒప్పించారు. 2001లో టీఆర్‌ఎస్‌లో చేరిన సత్యనారాయణరెడ్డి 2004 ఎన్నికల్లో నాటి హన్మకొండ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2009 ఎన్నికలకు ముందుగానే టీఆర్‌ఎస్‌ను వీడిన ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2012లో తిరిగి బీజేపీలో చేరిన సత్యనారాయణరెడ్డి తుది శ్వాస వరకు పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లారు.
ప్రముఖుల సంతాపం
మాజీ ఎమ్మెల్యే మందాడి సత్యనారాయణరెడ్డి మృతి పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, మందాడి సత్యనారాయణరెడ్డి మృతి పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సత్యనారాయణరెడ్డి కుమారుడు శ్యాంప్రసాద్‌రెడ్డికి ఫోన్ చేసి సంతాపం తెలిపారు.
కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి, ఎంపీ కె.లక్ష్మణ్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ నేత పొన్నాల లక్ష్మయ్య తదితరులు సంతాపం ప్రకటించారు. అలాగే వివిధ పార్టీలకు చెందిన రాజకీయ ప్రముఖులు మందాడి భౌతికఖాయాన్ని సందర్శించి నివాళులర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment