సాక్షి, హైదరాబాద్: ఇకపై మీ–సేవా కేంద్రాల్లో దర ఖాస్తు చేసుకుంటే తక్షణమే (ఇన్‌స్టంట్‌గా) పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం జారీ కానుంది. పురపాలక శాఖ పౌర సేవల పోర్టల్‌లో దరఖాస్తు చేసుకుంటే తక్షణమే ఆస్తి పన్నుల మదింపు, వెకెంట్ ల్యాండ్ ట్యాక్స్ మదింపు, ట్రేడ్ లైసెన్సు జారీ, ట్రేడ్ లైసెన్సు పునరుద్ధరణ వంటి సేవలు లభించనున్నాయి. ఆస్తి పన్నులపై పునః సమీక్ష దరఖాస్తుతో పాటు ఈ పునః సమీక్షలో తీసుకున్న నిర్ణయంపై అప్పీళ్లను 15 రోజుల గడువులోగా పరిష్కరించనున్నారు. ఖాళీ భవనాలు/ ఇళ్లకు ఆస్తి పన్నుల నుంచి ఉపశమనం కల్పించడానికి వెకెన్సీ రెమిషన్ దరఖాస్తులను సైతం 15 రోజుల్లోగా పరిష్కరించనున్నారు. కొత్త మున్సిపల్ చట్టంలోని షెడ్యూల్–3లో పొందుపర్చిన ‘పౌర సేవల పట్టిక’లో నిర్దేశించిన గడువుల్లోగా ఆయా సేవలను ఇకపై కచ్చితంగా పౌరులకు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.
ఈ మేరకు రాష్ట్ర పురపాలక శాఖ డైరెక్టర్ ఎన్.సత్యనారాయణ శనివారం అన్ని పురపాలికలకుఆదేశాలు జారీ చేశారు. పురపాలికల్లో ఆన్‌లైన్ ద్వారా పౌరులకు సత్వర సేవలను అందించాలని సరళీకృత వాణిజ్యం(ఈఓడీబీ) సంస్కరణలు–2020 పేర్కొం టున్నాయని తెలిపారు. ఆన్‌లైన్/ మీ–సేవా ద్వారా పౌరులకు నిర్దిష్ట గడువులోగా సేవలు అందించాలని ఇప్పటికే కొత్త మున్సిపల్ చట్టం సైతం పేర్కొంటోందని, ఈ క్రమంలో చట్టంలో పేర్కొన్న పౌర సేవల పట్టికను తప్పనిసరిగా అమలు చేయాలని మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. పౌర సేవల పట్టికను మున్సిపల్ కార్యాలయం నోటీసు బోర్డు, పౌర సేవల కేంద్రం, పురపాలిక పోర్టల్‌లో ప్రదర్శనకు ఉంచాలని కోరారు. పురపాలక శాఖ పోర్టల్ https://cdma.telangana.gov.in లేదా మీ–సేవా కేంద్రాలకు దరఖాస్తు చేసుకోవడం ద్వారా ఈ కింద పేర్కొన్న సేవలను నిర్దిష్ట గడువులోగా పొందవచ్చు.
వాట్సాప్‌లో ఆస్తిపన్నుల వివరాలు
ఆస్తిపన్నుల వివరాలను వాట్సాప్ ద్వారా తెలియజేసేందుకు ‘తెలంగాణ ఈ–పట్టణ సేవలు’పేరుతో పురపాలకశాఖ కొత్త సేవలను ప్రారంభించింది. 9000253342 నంబర్‌కు ఆస్తిపన్ను ఇండెక్స్ నంబర్ (పిన్) లేదా ఇంటి నంబర్‌ను వాట్సాప్ ద్వారా పంపిస్తే సదరు ఇంటికి సంబంధించిన ఆస్తిపన్ను వివరాలను పంపించనుంది. అలాగే ఈ పన్నులను ఆన్‌లైన్ ద్వారా చెల్లించేందుకు అవసరమైన లింక్‌లను కూడా పంపించనుంది. ఈమేరకు పురపాలకశాఖ డైరెక్టర్ ఎన్.సత్యనారాయణ శనివారం ఉత్తర్వులు జారీచేశారు.
Comments
Please login to add a commentAdd a comment