
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో కొత్తగా ఇల్లు కొనుక్కున్న/నిర్మించుకున్నవారికి జీహెచ్‌ఎంసీ ఆస్తిపన్నుకు సంబంధించిన పీటీఐఎన్ (ఆస్తిపన్ను గుర్తింపు సంఖ్య) కోసం ఇక వేచి చూడాల్సిన అవసరం లేదు. ఆస్తిపన్ను అసెస్‌మెంట్ కోసం ఆన్‌లైన్ ద్వారానే సెల్ఫ్ అసెస్‌మెంట్‌ను ఎంతో కాలం క్రితమే జీహెచ్‌ఎంసీ అందుబాటులోకి తెచ్చినప్పటికీ, ఆన్‌లైన్ ద్వారా ప్రజలు సమర్పించిన వివరాలను నిర్ధారించుకోవడానికి జీహెచ్‌ఎంసీ అధికారులు క్షేత్రస్థాయిలో స్వయంగా తనిఖీ చేశాకే పీటీఐఎన్ కేటాయించేవారు.
ఇప్పుడిక సెల్ఫ్ అసెస్‌మెంట్‌కు సంబంధించి జతపర్చాల్సిన పత్రాలు జత చేశాక, నివాస గృహమా, వాణిజ్య భవనమా, జోన్, సబ్‌జోన్ తదితర అవసరమైన వివరాలన్నీ నమోదు చేశాక చెల్లించాల్సిన ఆస్తిపన్ను వివరాలు తెలుస్తాయి. ఆస్తిపన్నును ఆన్‌లైన్‌లోనే చెల్లించవచ్చు. ఆస్తిపన్ను చెల్లించగానే పీటీఐఎన్ జనరేట్ అవుతుంది. చెల్లించిన ఆస్తిపన్నుకు సంబంధించిన డిమాండ్ నోటీసు కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పీటీఐఎన్ జనరేట్ అయ్యాక సంబంధిత అధికారులు క్షేత్రస్థాయి తనిఖీలతో ఆస్తిపన్ను ఖరారు చేస్తారు. హెచ్చుతగ్గులుంటే సవరిస్తారు.
రిజిస్ట్రేషన్ సమయంలోనూ..
రిజిస్ట్రేషన్ ఆఫీస్‌లో రిజిస్ట్రేషన్ జరగ్గానే పీటీఐఎన్ జనరేట్ అయ్యే ప్రక్రియ కూడా అందుబాటులోకి తెచ్చినప్పటికీ, పూర్తిస్థాయిలో అమలుకు మరికొంత సమయం పట్టనున్నట్లు సంబంధిత అధికారి తెలిపారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి పీటీఐఎన్ జనరేట్ అయితే ఆ వివరాలు జీహెచ్‌ఎంసీకి చేరతాయి. జీహెచ్‌ఎంసీలో సంబంధిత సర్కిల్‌స్థాయి అధికారులు సంబంధిత ఆస్తిని తనిఖీ చేసి ఆస్తిపన్ను నిర్ధారిస్తారు. అలాంటి వారు సెల్ఫ్‌అసెస్‌మెంట్ చేసుకోవాల్సిన పని ఉండదు. అంటే ఇప్పటి వరకు ఆస్తిపన్ను నిర్ధారణ అయ్యాక పీటీఐఎన్ జనరేట్ చేసేవారు. కొత్త పద్ధతి వల్ల పీటీఐఎన్ ముందుగానే జనరేట్ అవుతుంది.
బర్త్ సర్టిఫికెట్ ఫైల్ ట్రాకింగ్ సిస్టం..
ఆస్పత్రుల్లో శిశువుల జననం జరిగినప్పటి నుంచి బర్త్ సర్టిఫికెట్ రెడీ అయ్యేంత వరకు ఫైల్ ట్రాకింగ్ సైతం తల్లిదండ్రులకు తెలిసేలా మరో సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చారు. డెత్ సర్టిఫికెట్ల జారీకి సైతం దాదాపుగా ఇదే విధానాన్ని అందుబాటులోకి తేనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment