
సాక్షి, హైదరాబాద్ :దీపావళి పండుగ కానుకగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు 2020-21 ప్రాపర్టీ ట్యాక్స్‌లో రిలీఫ్ ఇవ్వాలని నిర్ణయించినట్లు మంత్రి కేటీఆర్ తెలియజేశారు. జీహెచ్‌ఎంసీలో రూ.15 వేల ఆస్తి పన్ను కట్టేవారికి 50 శాతం..ఇతర పట్టణాల్లో రూ.10 వేల ఆస్తి పన్ను కట్టేవారికి 50 శాతం రాయితీ ప్రకటించారు. దీంతో జీహెచ్‌ఎంసీలో 13.72 లక్షలు.. మిగిలిన పట్టణాల్లో 17.68 లక్షలు.. తెలంగాణ వ్యాప్తంగా 31.40 లక్షల మందికి లబ్ధి చేకూరనుందని ఆయన తెలిపారు. ఇప్పటికే ఆస్తి పన్ను కట్టిన వారికి వచ్చే ఏడాది రాయితీ ఇస్తామన్నారు. శనివారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్‌తో మంత్రి కేటీఆర్ సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ హాజరయ్యారు.
సమావేశం అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ..‘‘ 4,75,871 కుటుంబాలకు వరద సాయం రూ.10 వేల చొప్పున అందించాం. వరద సాయం అందని వారికి మరో అవకాశం ఇస్తాం. వారు మీసేవలో దరఖాస్తు చేసుకోవాలి. జీహెచ్‌ఎంసీ వర్కర్ల జీతాన్ని రూ.14,500 నుంచి రూ.17,500కు పెంచుతున్నాం. ప్రజల పక్షాన నిలబడిన సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు. దీపావళి కానుకగా ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు. 2020లో కరోనా వల్ల ఆర్థిక వ్యవస్థ పూర్తిగా తలకిందులు అయ్యింది. ప్రభుత్వ పరంగా చాలా కార్యక్రమాలు చేశాం. కరోనా నియంత్రణలో తెలంగాణ ప్రభుత్వం బాగా పనిచేసిందని కేంద్ర మంత్రి హర్షవర్ధన్ మెచ్చుకొన్నార’’న్నారు.
Comments
Please login to add a commentAdd a comment