మెదక్ జిల్లాలో ఏడుపాయల దుర్గమ్మ ఆలయాన్ని చుట్టుముట్టిన వరదనీరు
సాక్షి, హైదరాబాద్/భద్రాచలం: మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశాల్లో భారీ వర్షాల కారణంగా గోదావరితో పాటు దాని ఉప నదులు ప్రాణహిత, ఇంద్రావతి, తాలిపేరు, శబరి పోటెత్తి ప్రవహిస్తున్నాయి. దీంతో గోదావరి మళ్లీ ఉగ్రరూపం దాల్చుతోంది. శనివారం రాత్రి 7 గంటలకు భద్రాచలం వద్ద 9,96,976 క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతోంది. నీటి మట్టం 45.10 అడుగులకు చేరడంతో మళ్లీ మొదటి ప్రమాద హెచ్చరికను జారీచేశారు.
ఎగువన బేసిన్‌లో కురిసిన వర్షాల ప్రభావం వల్ల శనివారం సాయంత్రం 6 గంటలకు కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజీలోకి 5,15,460 క్యూసెక్కులు, తుపాకులగూడెం (సమ్మక్క) బ్యారేజీలోకి 7,20,120 క్యూసెక్కులు చేరుతుండగా.. సీతమ్మసాగర్‌లోకి 10,97,072 క్యూసెక్కులు చేరుతున్నాయి. ఆ మూడు బ్యారేజీలలోకి వస్తున్న నీటిని వస్తున్నట్లుగా దిగువకు వదిలేస్తున్నారు.
స్లూయిజ్‌లు లీక్ కావడంతో శనివారం భద్రాచలం కొత్తకాలనీలోని ఇళ్లను ముంచెత్తిన వరద నీరు
పెరగనున్న వరద ఉధృతి: మరో 48 గంటల పాటు గోదావరి బేసిన్‌లో ప్రధానంగా తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో ఆదివారం గోదావరిలో వరద ఉధృతి మరింతగా పెరగనుంది. దీంతో ఏజెన్సీ వాసులు ఆందోళనకు గురవుతున్నారు. భద్రాచలం కరకట్టకు దిగువన ఉన్న అశోక్ నగర్, కొత్త కాలనీ వాసుల పరిస్థితి మళ్లీ దయనీయంగా మారింది.
ఇటీవలి వరద నీటిని రెండురోజుల క్రితం మోటార్లతో గోదావరిలోకి ఎత్తిపోశారు. అయితే శుక్రవారం భారీ వర్షం రాగా స్లూయిజ్‌ల లాక్‌లను దించకపోవడంతో పెరిగిన గోదావరి నీటి ప్రవాహం మళ్లీ కొత్తకాలనీలోని ఇళ్లను చుట్టుముట్టింది. శుక్రవారమే తాము ఇళ్లను శుభ్రం చేసుకున్నామని, ఇప్పుడు మళ్లీ వరద రావడానికి అధికారుల వైఖరే కారణమని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment