Good response for TSRTC TTD darshan ticket booking - Sakshi
Sakshi News home page

టీఎస్ఆర్టీసీ బాలాజీ దర్శన్‌ టికెట్లకు మంచి స్పందన.. ఏడు నెలల్లో 77,200 టికెట్ల బుకింగ్‌..

Published Tue, Feb 7 2023 4:41 PM | Last Updated on Tue, Feb 7 2023 6:06 PM

Good Response For TSRTC Balaji Darshan Tickets - Sakshi

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్‌ఆర్టీసీ) బాలాజీ దర్శన్‌ టికెట్లకు భక్తుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఏడు నెలల్లో 77,200 మంది భక్తులు ఈ టికెట్లను బుక్‌ చేసుకుని.. క్షేమంగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. గత ఏడాది జులైలో 3,109, ఆగస్టులో 12,092, సెప్టెంబర్‌లో 11,586, అక్టోబర్‌లో 14,737, నవంబర్‌లో 14,602, డిసెంబర్‌లో 6,890, ఈ ఏడాది జనవరిలో 14,182 మంది బస్‌ టికెట్‌తో పాటు శ్రీవారి శీఘ్ర దర్శన టికెట్లను బుక్‌ చేసుకున్నారు. 

తెలంగాణ నుంచి తిరుమల వెళ్లే భక్తుల కోసం గత ఏడాది జులై నుంచి 'బాలాజీ దర్శన్‌'ను టీఎస్‌ఆర్టీసీ అందుబాటులోకి తీసుకువచ్చింది. తిరుమల వెళ్లేందుకు బస్‌ టికెట్‌ బుక్‌ చేసుకునే సమయంలోనే శ్రీవారి శీఘ్ర దర్శన టికెట్‌ను బుక్‌ చేసుకునే సదుపాయాన్ని కల్పించింది. అందుకోసం టీటీడీతో టీఎస్‌ఆర్టీసీ ఒక ఒప్పందం కుదుర్చుకుంది.

"బాలాజీ దర్శన్‌ టికెట్లకు భక్తుల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. ఈ నెలలో శుభకార్యాలు, పెళ్లిళ్లు ఎక్కువగా ఉన్నాయి. శ్రీవారి దర్శనం కోసం వెళ్లే భక్తులు టీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలని యాజమాన్యం కోరుతోంది. ప్రయాణ టికెట్‌తో పాటు శ్రీవారి ప్ర‌త్యేక‌ దర్శన టికెట్‌ను సంస్థ అందిస్తోంది. ఈ టికెట్ తో ఎలాంటి ఇబ్బంది లేకుండా సురక్షితంగా ప్రయాణించి వెంకటేశ్వరస్వామిని దర్శించుకోవచ్చు. బాలాలయ మహా సంప్రోక్షణను టీటీడీ వాయిదా వేసినందున.. ఈ నెల 23 నుంచి మార్చి 1 వరకు బ్లాక్ చేసి ఉన్న‌ శీఘ్ర దర్శన టికెట్లను తిరిగి విడుదల చేయడం జరిగింది. భక్తులు www.tsrtconline.in వెబ్‌సైట్‌లో టికెట్లను బుక్‌ చేసుకోగలరు." అని టీఎస్‌ఆర్టీసీ చైర్మన్‌, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌, ఎండీ వీసీ సజ్జనార్‌ సూచించారు.  బాలాజీ దర్శన్ టికెట్లను కనీసం వారం రోజుల ముందుగా బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంద‌ని తెలిపారు.
చదవండి: టీచర్ల బదిలీలకు మళ్లీ బ్రేక్‌ .. బదిలీ జాబితా నిలిపివేత 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement