సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో నెలకొన్న స్థానిక సమస్యలకు కొత్త ఆవిష్కరణల ద్వారా పరిష్కారం చూపాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. వీటికి క్షేత్ర స్థాయి నుంచే సామాజిక ఆవిష్కరణలను ప్రోత్సహించి వాటికి వాణిజ్య రూపం ఇవ్వడం ద్వారా ఉపాధి కల్పన, రాష్ట్ర ఆదాయం కూడా పెంచడం సాధ్యమని అంచనా వేస్తోంది. ఈ తరహా ఆవిష్కరణల కోసం జపాన్ అంతర్జాతీయ సహకార సంస్థ (జికా)తో రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోంది. తెలంగాణ ఆవిర్భావం నుంచి రాష్ట్రంలో ఆవిష్కరణల వాతావరణాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు సాగిస్తోంది.
కాగా ఇప్పటికే రాష్ట్రంలో నెలకొన్న స్టార్టప్ వాతావరణం అంశం గ్లోబల్ స్టార్టప్ ఇకో సిస్టమ్ 2020 (జీఎస్‌ఈఆర్) నివేదికలో ప్రస్తావనకు నోచుకుంది. రాష్ట్రంలోని మూడున్నర కోట్ల జనాభాలో 2.1 కోట్ల మంది గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తుండగా పట్టణ వాసులతో పోలిస్తే వారు విభిన్న సమస్యలను ఎదుర్కొంటున్నారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లోని సమస్యల పరిష్కారానికి భిన్నమైన మార్గాన్ని అనుసరించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో ‘జికా’సాయంతో క్షేత్రస్థాయిలో సామాజిక ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ప్రత్యేక ప్రాజెక్టును చేపట్టాలని భావిస్తోంది. ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఆవిష్కరణలు, వాణిజ్య, ఇతర సామర్థ్యాల పట్ల ఆసక్తితో ఉన్న జికా ఈ ప్రాజెక్టుకు అండగా నిలిచేందుకు ముందుకు వస్తోంది. దీంతో మరిన్ని అంతర్జాతీయ ప్రైవేటు సంస్థలు కూడా ఈ రంగంలో పెట్టుబడులతో ముందుకొచ్చే అవకాశముందని సర్కారు భావిస్తోంది. తద్వారా రాష్ట్రంలో ఆర్థిక కార్యకలాపాలు, ఉద్యోగాల కల్పన, ఉత్పాదకతతో పాటు జీడీపీ పెరుగుతుందని అంచనా వేస్తోంది. దీంతో ఇన్నాళ్లూ ఆవిష్కరణల కేంద్రాలుగా ఉన్న నగరాల నుంచి ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలకు ఆవిష్కరణల వాతావరణం విస్తరించే అవకాశముంది.
సామాజిక, క్షేత్ర స్థాయి ఆవిష్కరణలకు రూ.660 కోట్లు
స్టార్టప్‌ల ద్వారా వెలుగు చూస్తున్న ఆవిష్కరణలు రాష్ట్ర ఆర్థికాభివృద్దిలో కీలకంగా మారుతున్నా, గ్రామీణ ప్రాంతాల్లో పురుడు పోసుకుంటున్న ఆవిష్కరణలు మాత్రం వెలుగు చూడటం లేదు. ఈ పరిస్థితిని మార్చేందుకు సామాజిక, క్షేత్ర స్థాయి ఆవిష్కరణల ద్వారా వాణిజ్య కార్యకలాపాలను వేగవంతం చేసేందుకు రూ.660 కోట్లతో చేపట్టే ప్రాజెక్టుకు జికా మద్దతు ఇస్తుంది. ఇందులో రూ.100 కోట్లు సోషల్ ఇంపాక్ట్ సెక్టార్‌లో మహిళా ఎంట్రప్రెన్యూర్ల కోసం కేటాయిస్తారు. రూ.117.61 కోట్లు గ్రామీణ ప్రాంత పాఠశాలలు, కళాశాలల్లో ఎంట్రప్రెన్యూర్ల ప్రోత్సాహానికి, మరో రూ.56.72 కోట్లు గిరిజనుల్లో పోషకాహార సమస్యలు, మురుగునీరు నిర్వహణ, పారిశుధ్యం, అంటు వ్యాధులు తదితరాల కోసం ఉపయోగిస్తారు.
వివిధ కార్యక్రమాల ద్వారా గ్రామీణ ప్రాంత ఆవిష్కర్తలను గుర్తించేందుకు రూ.90.5 కోట్లు, రాష్ట్రంలో ఐటీ టవర్లు కలిగిన ఐదు జిల్లాలతో పాటు, హైదరాబాద్‌ను ఆవిష్కరణల కేంద్రంగా తీర్చిదిద్దేందుకు రూ.264 కోట్లు వెచ్చిస్తారు. జిల్లాల్లో ఉన్న ఐదు ఐటీ టవర్లు క్షేత్ర స్థాయిలో సామాజిక ఆవిష్కరణలకు మూల కేంద్రాలుగా పనిచేస్తూ హైదరాబాద్‌పై ఆధారపడటాన్ని కొంత మేర తగ్గించగలుగుతాయి. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రయోగాత్మకంగా గిరిజనుల్లో పోషకాహార లోపం, మురుగునీరు, పారిశుధ్య నిర్వహణ, అంటు వ్యాధులు, తాగునీరు పారిశుధ్యం, పరిశుభ్రత, వ్యవసాయ ఉత్పాదక పెంపు వంటి వాటికి ఆవిష్కర్తలు పరిష్కారం చూపుతారు.
20 లక్షల మందికి అవగాహన కల్పించడమే లక్ష్యం
‘జికా’సాయంతో చేపట్టే ప్రాజెక్టు లక్ష్యాలు, ఉద్దేశాల గురించి వివరించడంతో పాటు కొత్త ఆవిష్కరణలపై 20 లక్షల మంది సామాన్య ప్రజలకు అవగాహన కల్పించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ప్రదర్శనలు, యాత్రలు, విలేజ్ ఇన్నోవేషన్ చాలెంజెస్, హ్యాకథాన్స్ వంటివి నిర్వహిస్తారు. తద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని 3,200 మంది బాలికలు, మహిళలు, 1.38 లక్షల మంది విద్యార్థులు, 1,456 మంది ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. ఈ ప్రాజెక్టు ద్వారా వచ్చే ఐదేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 13,190 క్షేత్ర స్థాయి ఆవిష్కరణలను సృష్టించడం లక్ష్యం కాగా, వీటిలో 4,188 ఆవిష్కరణలను ప్రపంచస్థాయి ఉత్పత్తులుగా తీర్చిదిద్దేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. తద్వారా ఉత్పాదక, ఉత్పత్తి పెరిగి రాష్ట్ర ఆర్థికాభివృద్దికి బాటలు వేయనుంది.
ఈ ఆవిష్కరణల ద్వారా 1,880 సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల(ఎంఎస్‌ఎంఈ)కు జీవం పోయడంతోపాటు మరో 645 ఎంఎస్‌ఎంఈల పునరుజ్జీవనానికి దారితీస్తుంది. వీటిలో 1,370 ఎంఎస్‌ఎంఈలను రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న ఎంఎస్‌ఎంఈ పార్కుల్లో సర్దుబాటు చేస్తారు. వీటి ద్వారా 7,600 మందికి ప్రత్యక్షంగా, 22 వేల మందికి పరోక్షంగా ఉపాధి లభించడంతోపాటు ఆదాయం, కొనుగోలు శక్తి, అనుబంధ ఎంటర్‌ప్రైజెస్ వృద్ధి, పన్నుల ద్వారా ఆదాయం పెరుగుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. సామాజిక, క్షేత్ర స్థాయి ఆవిష్కరణల ప్రోత్సాహక ప్రాజెక్టు కోసం ‘జికా’తో జరుపుతున్న సంప్రదింపులు త్వరలో కొలిక్కి వచ్చే అవకాశముందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ ‘సాక్షి’కి వెల్లడించారు.
సామాజిక ఆవిష్కరణలు..
- సంగారెడ్డి జిల్లాకు చెందిన సంగమేశ్వర్ అనే ఉపాధ్యాయుడు ఎరువులను పిచికారీ చేసేందుకు కంప్రెసర్ ద్వారా నడిచే వీల్ స్ప్రేయింగ్ పంప్‌ను రూపొందించారు. పంటల అవసరాలకు అనుగుణంగా స్ప్రేయర్ ఎత్తును సర్దుబాటు చేయొచ్చు.
- నల్గొండకు చెందిన అరుణజ్యోతి లోఖండే అనే మహిళ వంటింటి కూరగాయల వ్యర్థాలతో ‘సీడ్ పేపర్ న్యాప్కిన్లు‘ తయారు చేశారు. విత్తనాలు లేని న్యాప్కిన్లను ముక్కలుగా చేసి మొక్కలకు ఎరువుగా వాడొచ్చు. విత్తనాలు ఉన్న న్యాప్కిన్లను నర్సరీల్లో ఉపయోగించవచ్చు.
ఇలా సామాజిక అవసరాలు లేదా సమస్యలకు ప్రస్తుతం ఉన్న పరిష్కారాలకంటే మెరుగైన వాటిని కనుగొనడమే సామాజిక ఆవిష్కరణల లక్ష్యం. ఇలాంటి ఆవిష్కరణలను వాణిజ్యపరంగా తయారు చేసేందుకు సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఈ) ఏర్పాటు చేస్తే ఉపాధి కల్పన, ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment