సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పారిశ్రామిక, ఐటీ రంగాల్లో వివిధ కేటగిరీల అవసరాలకు అనుగుణంగా నిర్దిష్ట రంగాల వారీగా (సెక్టోరల్) ప్రత్యేక పాలసీలు విడుదల చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఐటీ ఎంఎస్‌ఎంఈ రంగానికి కూడా ప్రత్యేక పాలసీ రూపొందించాలని నిర్ణయించింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగం ఎగుమతుల్లో జాతీయ స్థాయి కంటే మెరుగైన వృద్ధి రేటు సాధిస్తున్న తెలంగాణ 2020–21 ఆర్థిక సంవత్సరంలో రూ.1.40 లక్షల కోట్ల ఎగుమతులు సాధి స్తుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ రంగం ద్వారా రాష్ట్రంలో ఇప్పటికే 5.82 లక్షల మందికి ప్రత్యక్ష ఉపాధి లభిస్తోంది. అయితే రాష్ట్రంలో ఈ రంగానికి వెన్నుదన్నుగా ఉంటున్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా కంపెనీలు (ఎంఎస్‌ఎంఈ) కరోనా పరిస్థితుల్లో తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. రాష్ట్రంలో 1,200కు పైగా ఎంఎస్‌ఎంఈలు ఉండగా, ఉద్యోగాల కల్పన, ఐటీ, ఐటీ ఆధారిత ఉత్పత్తుల ఎగుమతులు, ప్రభుత్వా నికి ఆదాయం సమకూర్చడంలో ఇవి కీలకపాత్ర పోషిస్తున్నాయి. రాష్ట్రంలోని ఐటీ ఉద్యోగుల్లో సగానికిపైగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా కంపెనీల్లోనే పనిచేస్తున్నారు. అయితే ఏడాది క్రితం మొదలైన కరోనా సంక్షోభం ఇంకా కొన సాగుతుండటంతో ఎంఎస్‌ఎంఈలు తీవ్రంగా దెబ్బ తిన్నాయి. దీంతో ప్రత్యేక విధానం ప్రకటించాలని హైసియా, నాస్కామ్ వంటి సంస్థలతో పాటు ఐటీ ఎంఎస్‌ఎంఈలు విజ్ఞప్తి చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం దీనిపై దృష్టి సారించింది.
ప్రత్యేక ఐటీ టవర్, ఆఫీస్ స్పేస్ కావాలి
ఐటీ ఎంఎస్‌ఎంఈల కోసం రూపొందించే ప్రత్యేక పాలసీలో చేర్చాల్సిన అంశాలపై హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఎంటర్‌ప్రైజెస్ అసోసియేషన్ (హైసియా), ఇతర ఎంఎస్‌ఎంఈలు ఇటీవల ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించాయి. ప్రత్యేక ఐటీ టవర్ నిర్మించి, అందులో ఒక్కో కంపెనీకి కనీసం 20 మంది కూర్చునేలా ఆఫీసు స్పేస్‌ను కేటాయించాలని కోరాయి. కంపెనీలు తమ నిర్వహణ వ్యయం తగ్గించుకునేందుకు వీలుగా ఐటీ టవర్‌లోని కిచెన్, సమావేశ మందిరాలు వంటి వసతులు అందరూ ఉపయోగించుకునేలా చూడాలని విజ్ఞప్తి చేశాయి. తమకు కేటాయించే ఆఫీస్ స్పేస్‌కు తక్కువ అద్దె చెల్లించేలా సబ్సిడీ ఇవ్వాలని కోరాయి. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాటయ్యే ఐటీ ఎగ్జిబిషన్లలో ఎంఎస్‌ఎంఈలకు స్టాల్స్ కేటాయించడం, ఇతర మౌలిక వసతులు, ప్రోత్సాహకాలతో ‘సెక్టోరల్ పాలసీ’ రూపొందించాలని ఎంఎస్‌ఎంఈలు కోరుతున్నాయి.
సర్కారు చేయూత..
కరోనా మూలంగా రాష్ట్రంలో ఇతర రంగాలు దెబ్బతిన్నా మొత్తంగా ఐటీ రంగం మాత్రం పురోగతి సాధిస్తోంది. 2019–20లో రాష్ట్రంలో 18 శాతం వృద్ధిరేటు సాధించిన ఐటీ రంగం 2020–21లో ఆరు నుంచి ఏడు శాతం మేర వృద్ధి నమోదు చేసే అవకాశముందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో ఐటీ రంగంలో కీలకపాత్ర పోషిస్తున్న ఎంఎస్‌ఎంఈలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది చివరిలోనే ప్రత్యేక సలహా కమిటీ ఏర్పాటు చేసింది. హైసియా, నాస్కామ్‌తో పాటు ఐటీ విభాగం అధికారులు ఈ ప్రత్యేక సలహా కమిటీలో సభ్యులుగా ఉంటారని ఐటీ శాఖ ప్రకటించింది. ప్రభుత్వ పరంగా చేపడుతున్న ఐటీ ప్రాజెక్టులన్నీ పెద్ద కంపెనీల చేతుల్లోకి వెళ్తుండగా, కరోనా పరిస్థితుల్లో 30 శాతం ప్రాజెక్టులను చిన్న, మధ్య తరహా ఐటీ కంపెనీలకు ఇవ్వాలని నిర్ణయించింది. కాగా ఎంఎస్‌ఎంఈలు కన్సార్షియంగా ఏర్పాటై పెద్ద ఐటీ ప్రాజెక్టులను చేపట్టేలా ఈ కమిటీ మార్గదర్శకాలను రూపొందిస్తోంది.
సెక్టోరల్ పాలసీతో మరింత మందికి ఉపాధి
ప్రస్తుత కరోనా సంక్షోభ పరిస్థితుల్లో ఎంఎస్‌ఎంఈలు మనుగడ సాధించేలా ప్రత్యేక పాలసీ రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరాం. ఎంఎస్‌ఎంఈలు కూడా తమ సామరŠాధ్యన్ని పెంచుకునేలా ప్రభుత్వ పరంగా ప్రోత్సాహం ఉండాలని కోరుతున్నాం. సెక్టోరల్ పాలసీ ద్వారా ఐటీలో ఎంఎంఎస్‌ఈ రంగం మరింత మందికి ఉపాధి కల్పించడంతో పాటు ఐటీ ఉత్పత్తుల్లోనూ మరింత క్రియాశీలంగా పనిచేస్తుంది.
- భరణికుమార్ ఆరోల్, అధ్యక్షులు, హైసియా
త్వరలో ప్రత్యేక పాలసీ విడుదల
ఐటీ, ఐటీ ఆధారిత ఉత్పత్తుల రంగంతో పాటు ఎమర్జింగ్ టెక్నాలజీలోనూ తెలంగాణ రాష్ట్రం అనేక కొత్త ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. ఇప్పటికే ఎమర్జింగ్ టెక్నాలజీ రంగంలో కృత్రిమ మేథస్సు (ఏఐ) వంటి వాటిని ప్రోత్సహించేందుకు ‘సెక్టోరల్ పాలసీ’ని ప్రకటించాం. ఐటీ రంగంలో పనిచేస్తున్న ఎంఎస్‌ఎంఈలు కరోనా సంక్షోభంలో తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్న నేపథ్యంలో త్వరలో వీటి కోసం కూడా ప్రత్యేక ‘సెక్టోరల్ పాలసీ’ విడుదల చేస్తాం.
- జయేశ్ రంజన్, ముఖ్య కార్యదర్శి, ఐటీ పరిశ్రమల శాఖ
ఐటీ ఎంఎస్‌ఎంఈలకు ప్రత్యేక పాలసీ
Published Wed, Apr 14 2021 3:25 AM | Last Updated on Wed, Apr 14 2021 3:29 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment