
భద్రాచలం/సాక్షిప్రతినిధి, ఖమ్మం: ‘రాజ్‌భవన్ ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తోంది. సాధారణంగా రాజ్‌భవన్‌ల ద్వారాలు మూసి ఉంటాయి. కానీ ఈ రాజ్‌భవన్ ద్వారాలు ప్రతి ఒక్కరి కోసం తెరిచే ఉంటాయి. ఇది నిజంగా ఒక ప్రజాభవన్. మీరు ఎప్పుడైనా హైదరాబాద్ వస్తే రాజ్‌భవన్‌ను సందర్శించండి. అక్కడ ఈ అక్క మీకు అండగా ఉంటుంది.
నేను తమిళనాడు ఆడపడుచునైనా తెలంగాణ అక్కనే..’ అని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. బుధవారం కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో, ఖమ్మం రూరల్ మండలంలో గవర్నర్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆదివాసీలు, విద్యార్థులతో సమావేశమయ్యారు.
సీతారాములను దర్శించుకుని..
గవర్నర్ ముందుగా భద్రాచలంలో సీతారాములను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. క్యూలైన్లలో ఉన్న భక్తులతో కాసేపు ముచ్చటించారు. తర్వాత భద్రాచలంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో ఆదివాసీలతో ముఖాముఖి కార్యక్రమంలో గవర్నర్ పాల్గొన్నారు.
‘ప్రియాతి ప్రియమైన నా ఆదివాసీ బంధువులారా..’ అంటూ తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించారు. ఆదివాసీల సమస్యలు తన హృదయాన్ని కలచివేస్తున్నాయని.. నాణ్యమైన విద్య, మెరుగైన వైద్య సదుపాయాలు అందకపోవడం విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. సామాజికంగా, ఆర్థికంగా, విద్య, వైద్యపరంగా ఆదివాసీలు అభివృద్ధి చెందడానికి కలసి పనిచేద్దామన్నారు.
జనంలోకి వెళితేనే సమస్యలు తెలుస్తాయి
ప్రజలను నేరుగా కలిస్తేనే సమస్యలపై మరింత అవగాహన కలుగుతుందని, రాజ్‌భవన్‌లో కూర్చుంటే సమస్యలు మాత్రమే వినగలుగుతానని గవర్నర్ తమిళిసై అన్నారు. ప్రజల సమస్యలను, బాధలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకే వచ్చానని, వీలైనంత వరకు సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రాలో కలిసిన ఐదు గ్రామ పంచాయతీలను తిరిగి భద్రాచలంలో విలీనం చేయాలనే డిమాండ్‌ను.. ఈ ప్రాంత ప్రజలు, ఆదివాసీల తరఫున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేస్తానని చెప్పారు.
పరిశోధనలపై దృష్టి పెట్టాలి
దేశ ఆర్థికాభివృద్ధి, ఉద్యోగాల కల్పన కోసం.. ఇన్నోవేషన్ (ఆవిష్కరణ), ఎంటర్ ప్రెన్యూర్íÙప్ (వ్యవస్థాపన) కీలకమని.. కళాశాలలు తమ క్యాంపస్‌లను ఆవిష్కరణలకు వేదికగా మార్చుకోవాలని గవర్నర్ తమిళిసై పిలుపునిచ్చారు. విద్యార్థులు కూడా ఆవిష్కరణలు, పరిశోధనలపై దృష్టిపెట్టాలని సూచించారు.
బుధవారం ఖమ్మంరూరల్ మండలంలోని కిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో వై20 ఇండియా ఉత్సవంలో గవర్నర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రతి విద్యార్థికి ఒక ప్రత్యేకమైన సామర్థ్యం ఉంటుందని, తమ అభిరుచికి అనుగుణంగా రాణించడానికి కృషిచేయాలని సూచించారు. విద్యార్థులు రాజకీయాల్లో కూడా రాణించాలని.. చదువుకున్న రాజకీయ నాయకులు దేశానికి ఉపయోగపడతారని పేర్కొన్నారు.