
వైభవంగా పెద్దగట్టు జాతర ప్రారంభం
సూర్యాపేట: ‘ఓ లింగా.. ఓ లింగా..’నామస్మరణతో సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం దురాజ్‌పల్లిలోని లింగమంతులస్వామి (పెద్దగట్టు) జాతర మార్మోగింది. రెండేళ్లకోసారి జరిగే ఈ జాతర ఆదివారం అర్ధరాత్రి మంద గంపల ప్రదక్షిణలతో వైభవంగా ప్రారంభమైంది. మొదటి రోజు వేలాదిగా భక్తులు తరలివచ్చి స్వామి వారికి మొక్కులు చెల్లించుకున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ట్రాక్టర్లు, ఆటోలు, డీసీఎంలలో పెద్దగట్టుకు చేరుకున్నారు.
ఈ సందర్భంగా యాదవులు సంప్రదాయ దుస్తుల్లో డోలు వాయిద్యాలు, భేరీల చప్పుళ్లు, కటారు విన్యాసాలు చేస్తూ ఓ లింగా.. నామస్మరణతో గట్టుపైకి వచ్చారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి స్వామి వారికి పూజలు చేశారు. జాతర మొదటిరోజులో భాగంగా సూర్యాపేట మండలం కేసారం గ్రామం నుంచి దేవరపెట్టెను యాదవ కులస్తులు కాలినడకన ఊరేగింపుగా పెద్దగట్టుకు చేర్చారు. అంతకు ముందు కేసారం గ్రామంలో దేవరపెట్టెలోని దేవతామూర్తులకు మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి, ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి వేర్వేరుగా పట్టువ్రస్తాలు సమర్పించి పూజలు చేశారు.

రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేశ్‌రెడ్డి కూడా ప్రత్యేక పూజలు చేశారు. కాగా, సోమవారం.. చౌడమ్మతల్లికి బోనాలు సమరి్పంచనున్నారు. జాతర రెండోరోజు అత్యంత ముఖ్యమైన ఘట్టం కావడంతో భక్తులు లక్షల్లో తరలివచ్చే అవకాశం ఉందని చెపుతున్నారు. ఇదిలా ఉండగా, పెద్దగట్టు జాతర నేపథ్యంలో విజయవాడ నుంచి హైదరాబాద్, హైదరాబాద్ నుంచి విజయవాడ, ఖమ్మం వైపు వెళ్లే వాహనాలను పోలీసులు దారిమళ్లిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment