సాక్షి, హైదరాబాద్: గ్రూప్–1 ప్రిలిమినరీ పరీక్ష ప్రశ్నపత్రం మధ్యస్థంగా ఉందని అభ్యర్థులు, నిపుణులు పేర్కొన్నారు. ప్రశ్నపత్రాన్ని కొందరు యూపీఎస్సీ ప్రిలిమ్స్ పరీక్ష స్థాయితో పోల్చగా మరికొందరు అంతకుమించి కఠినంగా ఉందని చెప్పుకొచ్చారు. యూపీఎస్సీ పరీక్షలో 100 ప్రశ్నలకు 120 నిమిషాల సమయం ఇస్తుండగా... గ్రూప్–1 ప్రిలిమ్స్ పరీక్షలో 150 ప్రశ్నలకు 150 నిమిషాల సమయమే ఇవ్వడంతో ప్రశ్న చదివి జవాబు రాయడం క్లిష్టంగా మారిందని ఎక్కువ మంది అభ్యర్థులు చెప్పారు.
జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ ప్రశ్నలకు జవాబుల ఎంపికకు ఎక్కు వ సమయం పట్టిందన్నారు. నాలుగు జవాబుల్లో ఏ ఏ మూడు సరైనవి అంటూ ఇచ్చిన ప్రశ్నలు తికమకపెట్టేలా ఉన్నాయన్నారు. ఇక రీజనింగ్ విభాగం నుంచి 10 శాతం లోపే ప్రశ్నలు ఉండాల్సి ఉన్నా 15 శాతానికిపైగా ప్రశ్నలు వచ్చాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. కరెంట్ అఫైర్స్‌లో వచ్చి న ప్రశ్నలు లోతైన అంశాలతో అడగటంతో అభ్యర్థులు కంగుతిన్నారు. ఒకట్రెండు ప్రశ్నలు ఆంగ్లం, తెలుగులో వేర్వేరు అర్థాలు వచ్చేలా ఉన్నట్లు చెప్పారు.
50 శాతం పైబడి మార్కులతో కటాఫ్...!
ప్రిలిమినరీ పరీక్ష ‘కీ’ వెలువడే వరకు సమాధానాలను అంచనా వేయడం కష్టంగా ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. జవాబుల సరళిని విశ్లేషిస్తే కనీసం 50% పైబడి మార్కులతో కటాఫ్ ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. పురుషుల కేటగిరీలో 85 మార్కులు, మహిళల కేటగిరీలో 80 మార్కులకు అటుఇటుగా కటాఫ్ ఉండే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment