
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఆస్పత్రులను ఆకస్మికంగా తనిఖీలు చేయనున్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు స్పష్టం చేశారు. సమయపాలన పాటించని, విధినిర్వహణలో అలసత్వం వ హించే వైద్యులు, ఉద్యోగులపట్ల కఠిన చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందించాలని, అన్ని విభా గాల్లో ఆరోగ్యశ్రీ రిజిస్ట్రేషన్లు పెంచాలని సూచించా రు. శనివారం ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రసూతి, ఆర్థోపెడిక్, జనరల్ సర్జరీ సహా అన్ని విభాగాల్లో ఆరోగ్యశ్రీ కింద మరింత ఎక్కువగా వైద్య సేవలు అందించాలన్నారు.
సిజేరియన్లను తగ్గించి సాధారణ ప్రసవాలు ఎక్కువ జరిగేలా చూడాలని ఆదేశించారు. ఈఎన్టీ, డెర్మటాలజీ సేవలను మరింత మెరుగుపర్చి, సమీప గ్రామాల్లో ఈఎన్టీ క్యాంపులు ఏర్పాటు చేసి సేవలు అందించాలని సూచించారు. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నందున జిల్లా స్థాయిలోనే అత్యవసర సేవలు అందించేలా చూడాలని, అనవసరంగా హైదరాబాద్ ఆస్పత్రులకు రిఫర్ చేయవద్దన్నారు. అత్యవసర సేవలు అన్ని వేళలా అందించేందుకు వీలుగా అనస్థీషియా విభాగం క్రియాశీలకంగా ఉండాలని, వారానికి ఒక విభాగం వారీగా సూపరింటెండెంట్లు సమీక్షలు నిర్వహించాలన్నారు. పీడియాట్రిక్ విభాగంలోనూ ఆరోగ్యశ్రీ రిజిస్ట్రేషన్లు పెరగాలని చెప్పారు.