సాక్షి, హైదరాబాద్: కొత్త ఆరోగ్యశ్రీ డిజిటల్ కార్డులను రూపొందించి స్థానిక ప్రజాప్రతినిధుల ద్వారా జిల్లాల్లోని లబ్దిదారులకు అందజేయాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. మంగళవారం ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ కార్యాలయంలో ఆరోగ్యశ్రీ బోర్డు సమావేశం జరిగింది. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ పరిమితి రూ.2లక్షల నుంచి రూ.5లక్షలకు పెంచినందున కొత్త ఆరోగ్యశ్రీ డిజిటల్ కార్డులను రూపొందిస్తున్నామని చెప్పారు. అందుకోసం లబ్దిదారుల ఈ–కేవైసీ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. నిమ్స్ స్పెషలిస్టు డాక్టర్ల ద్వారా ఆరోగ్యశ్రీ కేసుల మెడికల్ ఆడిట్ నిర్వహించాలని సూచించారు.
కోఠి ఈఎన్టీ ఆసుపత్రికి రూ.1.30 కోట్ల ప్రోత్సాహకం
కోవిడ్ సమయంలో ఎక్కడా చేయని విధంగా రికార్డు స్థాయిలో 856 బ్లాక్ ఫంగస్ సర్జరీలు విజయవంతంగా నిర్వహించిన కోఠి ఈఎన్టీ ఆసుపత్రికి రూ.1.30 కోట్ల అదనపు ప్రోత్సాహకం ఇవ్వనున్నట్టు మంత్రి వెల్లడించారు. మూగ, చెవిటి పిల్లలకు చికిత్స అందించి బాగు చేసే కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీలు ప్రస్తుతం కోఠి ఈఎన్టీ ఆసుపత్రిలో ప్రభుత్వం ఉచితంగా అందిస్తోందన్నారు.
ఈ తరహా సేవలను వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలోనూ అందుబాటులోకి తెచ్చేందుకు కమిటీ ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. కిడ్నీ బాధితులకు మరింత నాణ్యంగా డయాలిసిస్ సేవలు అందించేందుకు ఆన్‌లైన్ పర్యవేక్షణ చేసే విధంగా ప్రత్యేక సాఫ్ట్ వేర్ రూపొందించి, వినియోగించడానికి ఆరోగ్యశ్రీ బోర్డు అనుమతి ఇచ్చిందన్నారు. దీంతోపాటు ఆరోగ్యశ్రీ రోగులకు ఫేస్ రెకగ్నిషన్ సాఫ్ట్ వేర్ వినియోగానికి కూడా అనుమతి ఇచ్చిందని వెల్లడించారు.
బయోమెట్రిక్ విధానం వల్ల కొంత ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో మరింత పారదర్శకంగా ప్రజలకు సేవలు అందించేందుకు ఈ విధానం తేవాలని నిర్ణయించిందని తెలిపారు. ఆరోగ్యశ్రీ ప్యానెల్ బృందంలో ఉన్న కాంట్రాక్టు డాక్టర్ల వయోపరిమితిని 65 ఏళ్ల నుంచి 70 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్టు హరీశ్ రావు వెల్లడించారు. సమావేశంలో ఆ శాఖ కార్యదర్శి రిజ్వీ, ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సీఈవో విశాలాచ్చి, సీఎం ఓఎస్డీ గంగాధర్, డీఎంఈ రమేష్ రెడ్డి, ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ గడల శ్రీనివాసరావు, టీవీవీపీ కమిషనర్ అజయ్ కుమార్, నిమ్స్ డైరెక్టర్ బీరప్ప పాల్గొన్నారు.
Aarogyasri Digital Cards: ఇక ఆరోగ్యశ్రీ డిజిటల్ కార్డులు
Published Wed, Jul 19 2023 2:36 AM | Last Updated on Wed, Jul 19 2023 9:26 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment