రూ. 18.52 కోట్లు జమ అయినట్లు వచ్చిన మెసేజ్
వికారాబాద్ అర్బన్/దస్తురాబాద్/మంథని: అదృష్టలక్ష్మి తలుపు తట్టి అంతలోనే అదృశ్యమైంది. కోటీశ్వరులం అయ్యామనే ఆనందం గంటల వ్యవధిలోనే ఆవిరైంది. వికారాబాద్, నిర్మల్, పెద్దపల్లి జిల్లాల్లోని పలువురు హెచ్‌డీఎఫ్‌సీ ఖాతాదారులకు అకౌంట్లలో అప్పనంగా రూ. కోట్లు జమయ్యాయి. టెక్నికల్ సమస్య వల్లే డబ్బులు జమ అయ్యాయని తెలుసుకున్న బ్యాంకు అధికారులు వెంటనే ఆ ఖాతాలను స్తంభింపజేశారు.
వికారాబాద్‌లోని సెవెన్ హిల్స్ మొబై ల్స్ యజమాని వెంకట్‌రెడ్డికి హెచ్‌డీఎఫ్‌సీ స్థానిక బ్రాంచ్‌లో కరెంట్ అకౌంట్ ఉంది. ఆదివారం రాత్రి తన అకౌంట్‌లో రూ.18.52 కోట్లు జమ అయినట్లు మెసేజ్ వచ్చింది. మరునాడు ఉదయం బ్యాంకు అధికారులకు విషయం చెప్ప డంతో వెంటనే అతడి ఖాతాను స్తంభింపజేశారు. నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ మండలం రేవోజిపేటకి చెందిన వంగల సాయి అనే యువకుడికి నిర్మల్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో ఖాతా ఉంది.
రూ.1,27,07,978 జమ అయినట్లు ఫోన్‌కు సమాచారం రావడంతో ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. నిజమా కాదా అనే అనుమానంతో ఖాతా నుంచి రూ.లక్ష మరో ఖాతాకు బదిలీ చేశాడు. ఆ వెంటనే బ్యాంకు ఖాతా స్తంభించిపోయింది. పెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన ఇల్లందుల సాయి అనే మొబైల్ షాపు నిర్వాహకుడికి స్థానిక హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో ఖాతా ఉంది. ఆయన ఖాతాలో రూ.5.68 కోట్లు జమ అయినట్లు ఆదివారం మెసేజ్ వచ్చింది. 6 గంటల అనంతరం అవి వెనక్కి వెళ్లాయి. పెద్ద మొత్తంలో డబ్బు జమ కావడంతో మొదట ఆనందం వేసినా.. ఆ డబ్బు ఎవరైనా కావాలనే వేశారా..? అని భయపడ్డానని సాయి తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment