సాక్షి, హైదరాబాద్: కరోనా నేపథ్యంలో వంద పడకలకు మించి ఉన్న అన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్లను నెలకొల్పాలని వైద్య ఆరోగ్యశాఖ తాజాగా ఉత్తర్వులు జారీచేసింది. కరోనా వైద్య చికిత్సలో ఆక్సిజన్ అనేది అత్యంత కీలకమైన అంశం. ప్రస్తుతం అనేక ప్రైవేట్ ఆసుపత్రులు సిలిండర్లను కొనుగోలు చేస్తూ రోగులకు ఆక్సిజన్ అందిస్తున్నాయి. అయితే నిరాటంకంగా ఆక్సిజన్ అందక రోగులు ఇబ్బందులు పడుతున్న అంశం వైద్య ఆరోగ్యశాఖ దృష్టికి వచ్చింది. అందువల్ల వంద పడకలకు మించిన ప్రతీ ప్రైవేట్ ఆసుపత్రిలోనూ ఆక్సిజన్ ప్లాంటు ఉండాల్సిందేనని స్పష్టం చేసింది.
ఇప్పటికే ప్రభుత్వ ఆసుపత్రుల్లో దాదాపు 27 వేల పడకలకు ఆక్సిజన్ అందించేందుకు వైద్య ఆరోగ్యశాఖ కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే. అన్ని జిల్లా, ఏరియా ఆసుపత్రుల్లోనూ ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లను నెలకొల్పుతోంది. దీనివల్ల ఎక్కడికక్కడ ఆసుపత్రిలోనే ఆక్సిజన్ ఉత్పత్తి జరుగుతుంది. వైద్య ఆరోగ్యశాఖ ఉత్తర్వుల ప్రకారం 100 నుంచి 200 పడకలున్న ఆసుపత్రులు నిమిషానికి 500 లీటర్ల ఆక్సిజన్ ఉత్పత్తి చేసే సామర్థ్యమున్న ప్లాంటును ఏర్పాటు చేయాలి. 200–500 మధ్య పడకలున్న ఆసుపత్రులు నిమిషానికి వెయ్యి లీటర్లు ఉత్పత్తి చేసే ప్లాంటును, 500 పడకలు దాటితే నిమిషానికి 2 వేల లీటర్లను ఉత్పత్తి చేసే ప్లాంటును నెలకొల్పాలని స్పష్టంచేసింది.
రాష్ట్రవ్యాప్తంగా వంద పడకలున్న ప్రైవేట్ ఆసుపత్రులు 500కుపైగా ఉండగా, ఒక్క హైదరాబాద్‌లోనే 300 ఉన్నాయి. ఇతర ప్రాంతాల్లో మరో 200 ఉంటాయని ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. 200 పడకలు దాటిన ప్రైవేటు ఆసుపత్రులు 100 వరకు ఉంటాయని, 500 పడకలు దాటినవి 30 వరకు ఉంటాయని చెప్పాయి. వీటిన్నింటిలోనూ ప్రభుత్వం నిర్దేశించిన విధంగా ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లను నెలకొల్పకుంటే ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఆసుపత్రుల గుర్తింపును, అనుమతులను కూడా రద్దు చేస్తామని ప్రభుత్వం హెచ్చరించింది.
Comments
Please login to add a commentAdd a comment