గ్రేటర్‌లో వానొస్తే వణుకుతున్న కాలనీలు.. కాస్త గట్టివాన పడితే నీట మునిగే పరిస్థితి
ఎస్‌ఎన్‌డీపీ కింద నాలాల నిర్మాణం చేపట్టినా పూర్తికాని పనులు
నాలాలు ఉన్నచోటా చెత్తాచెదారం, పూడికతో రోడ్లపైనే నీళ్లు
కబ్జాలు, ఆక్రమణలతోనూ సమస్యలు.. పరిష్కారానికి చేపట్టాల్సిన చర్యలు ఎన్నో..
సాక్షి, హైదరాబాద్: మళ్లీ వానాకాలం వచ్చేసింది. మెల్లగా వర్షాలు ఊపందుకుంటున్నాయి. ఇప్పుడుగానీ భారీ వర్షం పడితే మళ్లీ ఈ ప్రాంతం నీట మునగడం తప్పని పరిస్థితి. ఈ ఒక్కచోట మాత్రమే కాదు.. గ్రేటర్ హైదరాబాద్ నగరవ్యాప్తంగా చాలా చోట్ల ఇదే పరిస్థితి. అయితే నాలాలు లేకపోవడం, ఉన్నా ఆక్రమణలు, చెత్తాచెదారం, పూడిక చేరి.. వరద అంతా కాలనీలు, రోడ్లపైకి చేరడం పరిపాటిగా మారిపోయింది. గట్టి వాన కురిస్తే.. చాలా కాలనీలు అతలాకుతలం అవుతున్నాయి.
వందల కాలనీలు నీట మునగడంతో..
⇒ నగరంలో 2020లో కురిసిన భారీ వర్షాలకు వందల కాలనీలు నీట మునిగాయి. ఇళ్లు కూలి, విద్యుత్ షాక్ తగిలి, నీట మునిగి 17 మంది మృతి చెందారు. కొన్ని కాలనీలు చెరువుల్లా మారిపోవడంతో.. పడవల్లో ప్రజలను బయటికి తీసుకు రావాల్సి వచ్చింది. వరద నీరు సాఫీగా వెళ్లలేకపోవడం, నాలాలు సరిగా లేకపోవడమే సమస్యకు కారణమని గుర్తించారు. వాటితో ఎప్పటికీ ప్రమాదమేనని గుర్తించి పరిష్కార చర్యలకు సిద్ధమయ్యారు. ‘వ్యూహాత్మక నాలాల అభివృద్ధి ప్రాజెక్టు (ఎస్‌ఎన్‌డీపీ)’ను చేపట్టారు.
నగరంలో ఏడాది సగటు వర్షపాతం, వరద నీరు వెళ్లే నాలాల పరిమాణం, క్షేత్రస్థాయి పరిస్థితు లు.. ఇలా అన్ని అంశాలను పరిశీలించారు. వరద కాలువలను విస్తరించాలని తొలుత నిర్ణయించారు. కానీ అందుకు ఆస్తుల సేకరణ కష్టంతో కూడుకున్నదని, భారీగా నిధులు అవసరమని భావించి.. ప్రత్యామ్నాయంగా ప్రస్తుతమున్న నాలాలకు సమాంతరంగా వరద నీరు పోయేలా ఏర్పాట్లు చేపట్టారు. ఉన్న రోడ్లకు ఎలాంటి ఆటంకం కలగకుండా అందుబాటులో ఉన్న స్థలాల్లో బాక్స్ డ్రెయిన్లు, ఇతర ఏర్పాట్లు చేపట్టారు.
సగం దాకా పనులు కొనసాగుతూనే..
⇒ నగరంతో పాటు శివార్లలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలోనూ పనులు చేపట్టాలని అప్పటి ప్రభుత్వం ఆదేశించింది. వర్షాలతో తీవ్రంగా ప్రభావితమయ్యే ప్రాంతాల్లో తొలిదశ కింద రూ.985.45 కోట్లతో పనులు చేపట్టారు. నాలాల ప్రాజెక్టులను విభజించి 58 పనులుగా చేపట్టగా.. 35 పనులు పూర్తయ్యాయి. రెండు పనులు కోర్టు కేసులతో ఆగిపోయాయి. స్థానిక ఇబ్బందులతో ఒక పని పెండింగ్‌లో ఉంది. మిగతావి తుదిదశలో ఉన్నాయి.
తాత్కాలిక చర్యలతో..
ప్రస్తుతం తాత్కాలిక ఉపశమనంగా కాలనీలతోపాటు రోడ్లపై నిలిచిపోయే నీటిని వెంటనే తోడి పోసేందుకు మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్‌ల పేరిట కారి్మకులను నియమించారు. నీళ్లు ఎక్కువగా నిలిచిన ప్రాంతాల్లో మోటార్లతో తోడిపోస్తున్నారు.
ఇలా చెత్త వేయడమూ కారణమే!
⇒ నాలాలు లేని ప్రాంతాల్లో వరద నీరు వెళ్లే మార్గం లేక సమస్యగా మారుతుంటే.. నాలాలున్న చోట కూడా వివిధ రకాల వ్యర్థాలు, చెత్తా చెదారం వేస్తుండటంతో పూడుకుపోయి సమస్య తలెత్తుతోంది. చాలా ప్రాంతాల్లో వరదనీరు, మురుగునీరు కలిసి వ్యాధులకు కారణమవుతున్నాయి.
ఆ పనులు మొదలయ్యేదెన్నడు?
⇒ ఎస్‌ఎన్‌డీపీ తొలిదశ పనులు కొలిక్కి వస్తుండటంతో.. రెండో దశలో వచ్చే రెండేళ్లలో రూ.2,141.22 కోట్లతో 176 కిలోమీటర్ల నాలాల పనులు చేసేందుకు ప్రతిపాదనలు రూపొందించారు. నిధుల సమస్యతో వాటిలో ప్రాధాన్యమున్నవి ఎంపిక చేసి.. అంచనా నిధులను రూ.495 కోట్లకు కుదించారు. ఈ పనులెప్పుడు ప్రారంభం అవుతాయో తెలియదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఈ పథకం పేరును హెచ్–సిటీ (హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్‌ఫర్మేటివ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్– నాలా కాంపొనెంట్)గా మార్చింది.
పనులు చేపట్టిన చోట కూడా..
ఎస్‌ఎన్‌డీపీ కింద పనులు చేపట్టిన ప్రాంతాల్లోనూ వరద ముప్పు తప్పని పరిస్థితి కనిపిస్తోందన్న విమర్శలు ఉన్నాయి. బండ్లగూడ చెరువులోకి చేరే వరద నీటితో.. పక్కనే ఉన్న అయ్యప్ప కాలనీ, మల్లికార్జుననగర్ నీట మునిగేవి. పరిష్కారం కోసం అధికారులు ట్రంక్‌లైన్ ఏర్పాటు చేశారు. కానీ భారీ వర్షం వస్తే.. దానితో ప్రయోజనం ఉండదని, ముంపు తప్పదని స్థానికులు వాపోతున్నారు.
ఉదాహరణకు సరూర్‌నగర్ చెరువు లోతట్టు ప్రాంతాలైన కోదండరాంనగర్, సీసాలబస్తీ, శారదానగర్, కమలానగర్, న్యూగడ్డి అన్నారం కాలనీలు గట్టి వానపడినప్పుడల్లా నీట మునిగేవి. వరద నీరు తగ్గేందుకు మూడు నాలుగు రోజులు పట్టేది. ఈ సమస్య పరిష్కారానికి బాక్స్ డ్రెయిన్, అదనంగా ట్రంక్‌లైన్ ఏర్పాటు చేశారు. కానీ న్యూ గడ్డిఅన్నారం, కమలానగర్ ప్రాంతాల్లో వరద నీటి సమస్య అలాగే ఉందని స్థానికులు చెప్తున్నారు.
భారీ వర్షాలు వస్తే మునగడమే..
⇒ అయ్యప్ప కాలనీలోకి పైకాలనీల నుంచి వరద నీరు రాకుండా ట్రంక్‌లైన్ వేశారు. కానీ భారీ వర్షాలు వచి్చనప్పుడల్లా అయ్యప్ప కాలనీ నీట మునుగుతూనే ఉంది. అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ అంశంపై తగిన శ్రద్ధ చూపి వరద నీరు రాకుండా చర్యలు చేపట్టాలి. శాశ్వత పరిష్కార చర్యలు తీసుకోవాలి. – శ్రీనివాస్, అయ్యప్ప కాలనీ గతంలో వరదనీటితో మునిగిన అయ్యప్ప కాలనీ
Comments
Please login to add a commentAdd a comment