హైదరాబాద్, రంగారెడ్డి, నాగర్ కర్నూలు జిల్లాల్లో భారీ వర్షాలు
వారం రోజులు ఎల్లో అలెర్ట్ జారీ... మోస్తరు వర్షాలు కురిసే అవకాశం
చిగురుమామిడిలో 17.1 సెం.మీ., మెదక్‌లో 12.9 సెం.మీ., కొయ్యూరులో 10.9 సెం.మీ.ల వర్షం
సాక్షి, హైదరాబాద్: వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూలు, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో శనివారం అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. వచ్చే వారం రోజులు రాష్ట్రానికి ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదివారం ఆదిలాబాద్, కొమురంభీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
ఇదిలా ఉండగా, శుక్రవారం రాత్రి వరకు కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలో ఏకంగా 17.1 సెంటీమీటర్ల కుండపోత వర్షం కురిసింది. మెదక్‌లో 12.9 సెంటీమీటర్లు, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కొయ్యూరులో 10.9, కామారెడ్డి జిల్లా పాత రాజంపేటలో 10.8 సెంటీమీటర్లు, సిద్దిపేట జిల్లా శనిగరంలో 10.1 సెంటీమీటర్లు, మెదక్ జిల్లా పాతూరులో 9.4 సెంటీమీటర్లు, జగిత్యాల జిల్లా పూదూరులో 9.2 సెంటీమీటర్లు, కామారెడ్డి జిల్లా బిక్నూరులో 8.8 సెంటీమీటర్లు చొప్పున వర్షపాతం నమోదైంది.
జడ్చర్ల పట్టణంలో శుక్రవారం రాత్రి వాన దంచికొట్ట డంతో రోడ్లన్నీ జలమయంగా మారాయి. సిగ్నల్‌గడ్డ – నేతా జీ చౌరస్తా ప్రధాన రహదారిపై వరద పారడంతో రాకపో కలకు అంతరాయం కలిగింది. హైదరాబాద్‌లోని పలు లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపునీరు చేరింది. ప్రధాన రహదా రులన్నీ జలమయమయ్యాయి. దీంతో గంటల కొద్దీ వాహ నాలకు రోడ్లపై నిరీక్షణ తప్పలేదు.
మెదక్‌లో భారీ వర్షం
మెదక్‌లో గంటన్నరపాటు ఏకధాటిగా వాన దంచికొట్టడంతో జనజీవనం అతలాకుతలమైంది. పట్టణంలోని ఇండియ న్ బ్యాంకు సమీపం, వెంకట్రావునగర్ కాలనీలో రోడ్డుపై రెండు అడుగుల ఎత్తులో వరదనీరు ప్రవహించింది. డ్రైనేజీలు ఉప్పొంగి మురుగు నీరు షాపుల్లోకి చేరింది. బయట నిలిపి ఉంచిన బైకులు వరద ఉధృతికి కొట్టుకుపోయాయి. మెదక్ జిల్లా కేంద్రంలో 12.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు వాతావరణశాఖ అధికారులు చెప్పారు.
పిడుగుపాటుకు ఇద్దరు మృతి
కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పిడుగుపాటుతో ఇద్దరు మృతి చెందారు. కెరమెరి మండల కేంద్రంలోని బారేవాడకు చెందిన చౌదరి రమేశ్(30) వ్యవసాయ పనులు చేస్తున్న క్రమంలో, ఆసిఫాబాద్ మండలం నందుప గ్రామానికి చెందిన గౌత్రే అంజన్న(20) వ్యవసాయ పనులకు వెళ్లి వస్తుండగా పిడుగుపాటుకు మృతి చెందారు.
Comments
Please login to add a commentAdd a comment