సర్వీసు క్రమబద్ధీకరణ రాజ్యాంగ హక్కు | high court judgment on GHMC Contract Employees | Sakshi
Sakshi News home page

సర్వీసు క్రమబద్ధీకరణ రాజ్యాంగ హక్కు

Published Thu, Aug 13 2020 1:24 AM | Last Updated on Thu, Aug 13 2020 4:00 AM

high court judgment on GHMC Contract Employees - Sakshi

సాక్షి, హైదరాబాద్ ‌: రెగ్యులర్‌ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్నా.. ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు సమాన వేతనం, ఇతర అలవెన్స్‌లు, పదోన్నతులు ఇవ్వకుండా చేసే కుట్ర, కుతంత్రం, దోపిడీకి గురిచేయడానికే ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలో నియామకాలు చేపడుతున్నారని హైకోర్టు మండిపడింది. సర్వీసు క్రమబద్ధీకరణ రాజ్యాంగం కల్పించిన హక్కు అని స్పష్టంచేసింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) వం టి చట్టబద్ధ సంస్థలో రెగ్యులర్‌ నియామకాలు చేపట్టకుండా చట్టవిరుద్ధంగా వ్యవహరిం చడం సరికాదని పేర్కొంది. జీహెచ్‌ఎంసీలో గత పదేళ్లకుపైగా విధులు నిర్వహిస్తున్న 98 మంది శానిటేషన్, ఎంటమాలజీ వర్కర్స్, శానిటరీ, ఎంటమాలజీ ఫీల్డ్‌ అసిస్టెంట్స్‌ సర్వీసును 2 నెలల్లో క్రమబద్ధీకరించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. సర్వీసు క్రమబద్ధీ కరించే వరకు రెగ్యులర్‌ ఉద్యోగులతో సమా నంగా పిటిషనర్లకు వేతనం, ఇతర అలవెన్స్‌ లు వర్తింపజేయాలని స్పష్టంచేసింది. జీహెచ్‌ ఎంసీలో ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలో విధులు నిర్వహిస్తున్న జి.శ్రీనివాసచారితో పాటు మరో 97 మంది దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి జస్టిస్‌ ఎంఎస్‌ రామచందర్‌రావు ఈ మేరకు ఇటీవల తీర్పునిచ్చారు. అలాగే సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఖాళీలను ఎప్పటికప్పుడు రెగ్యులర్‌ పద్ధతిలో భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు.
 
పిటిషనర్ల వాదన ఇదీ..
‘‘పత్రికల్లో నోటిఫికేషన్‌ ఇచ్చి 2008–11 మధ్య పిటిషనర్లను ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలో జీహెచ్‌ఎంసీ నియమించుకుంది. ఎటువంటి ఆరోపణలు లేకుండా పదేళ్లకుపైగా సర్వీసు పూర్తి చేశారు. స్టేట్‌ ఆఫ్‌ కర్ణాటక వర్సెస్‌ ఉమాదేవి కేసులో సుప్రీంకోర్టు తీర్పు మేరకు మా సర్వీసును రెగ్యులరైజ్‌ చేయాలని కోరాం. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని స్టేట్‌ ఆఫ్‌ పంజాబ్‌ వర్సెస్‌ జగ్జీత్‌ సింగ్‌ కేసులో సుప్రీంకోర్టు తీర్పు మేరకు విన్నవించాం. ఈ రెండు తీర్పులను జీహెచ్‌ఎంసీ ఉల్లంఘించింది. మేం బానిసల్లాగా పనిచేయాలని భావిస్తోంది. మాకు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులకు చట్టబద్ధ సంస్థ విఘాతం కల్గిస్తోంది. 2009, 2018లో మా సర్వీసును రెగ్యులరైజ్‌ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని జీహెచ్‌ఎంసీకి వినతిపత్రం సమర్పించాం. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో మా సర్వీసును క్రమబద్ధీకరించేలా ఆదేశించండి’’అని పిటిషనర్ల తరఫున న్యాయవాది చిక్కుడు ప్రభాకర్‌ వాదనలు వినిపించారు.

తీర్పులో ఏమన్నారంటే..
‘ఔట్‌సోర్సింగ్‌ విధానమంటేనే వారి సర్వీసులను ఎక్కువ కాలం కొనసాగించకుండా, వారికి రెగ్యులర్‌ ఉద్యోగులతో సమానంగా జీతభత్యాలు అందకుండా చేసే కుట్ర, కుతంత్రంలో భాగమే. ఉమాదేవి కేసులో సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చినా.. 14 ఏళ్లుగా రెగ్యులర్‌ నియామకాలు చేపట్టకుండా ఔట్‌ సోర్సింగ్‌ విధానంలో నియామకాలు చేప ట్టడం రాజ్యాంగ విరుద్ధం. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రెగ్యులర్‌ నియామకాలు చేపట్టాలి. పదేళ్లకుపైగా వీరు సేవలు అందిస్తున్న నేపథ్యంలో రెగ్యులర్‌ పద్ధతిలో వీరి నియామకం చేపట్టలేదు కాబట్టి వీరి సర్వీసు క్రమబద్దీకరించడానికి వీల్లేదన్న వాదన సరికాదు. పిటిషనర్లు ఏ పోస్టులో పనిచేస్తుంటే ఆ పోస్టుకు వీరి సర్వీసును 2 నెలల్లో క్రమబద్ధీకరించాలి. నియామకం ఏదైనా రెగ్యులర్‌ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్నారా లేదా అన్నది మాత్రమే చూడాలని ఇదే హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో పిటిషనర్లకు రెగ్యులర్‌ ఉద్యోగులతో సమానంగా వేతనం ఇవ్వాల్సిందే. పిటిషనర్లకు చెల్లించాల్సిన అదనపు వేతనాన్ని ఈ పిటిషన్‌ ఫైల్‌ చేసినప్పటి నుంచి జూలై 31 వరకు పిటిషనర్ల ఖాతాల్లో నేరుగా జమ చేయాలి. ఈ ప్రక్రియను సెప్టెంబర్‌ 15 లోగా పూర్తి చేయాలి’’అని తీర్పులో పేర్కొన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలంటూ గతంలో ఇచ్చిన ఉత్తర్వులను తొలగించాలంటూ జీహెచ్‌ఎంసీ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ను కొట్టేశారు.

జీహెచ్‌ఎంసీ ఏమందంటే..
‘‘పిటిషనర్లను జీహెచ్‌ఎంసీ నేరుగా నియమించుకోలేదు. ఔట్‌సోర్సింగ్‌ ఏజెన్సీల ద్వారా వారిని నియమించుకున్నాం. వారికి వేతనాలు ఎంత ఇవ్వాలన్నది సదరు ఔట్‌ సోర్సింగ్‌ ఏజెన్సీలు చూస్తాయి. వారి జీతభత్యాలతో జీహెచ్‌ఎంసీకి సంబంధం ఉండదు. వీరి ఎంపిక ప్రక్రియ కూడా వేరుగా ఉంటుంది. వీరిని నియమించుకున్న ఏజెన్సీలను ఈ పిటిషన్‌లో ప్రతివాదిగా చేర్చలేదు. శానిటేషన్‌ వర్కర్స్, ఎంటమాలజీ వర్కర్స్‌ వేతనాన్ని రూ.12,500 నుంచి రూ.14 వేలకు, శానిటరీ ఫీల్డ్‌ అసిస్టెంట్, ఎంటమాలజీ ఫీల్డ్‌ అసిస్టెంట్స్‌కు రూ.12 వేల నుంచి రూ.14,500కు పెంచుతూ మునిసిపల్‌ శాఖ 2017లో ఉత్తర్వులు జారీచేసింది. వీరి నియామకానికి మేం ఎటువంటి నోటిఫికేషన్‌ జారీచేయలేదు. వీరి నియామకం రాజ్యాంగ విరుద్ధంగా జరిగింది. కాబట్టి వీరికి ఉమాదేవి కేసు వర్తించదు. ఎన్‌ఎంఆర్‌/డైలీ వేజ్‌/కంటింజెంట్‌ ఎంప్లాయిగా పిటిషనర్లను జీహెచ్‌ఎంసీ నేరుగా నియమించుకోలేదు. వీరికి ఏజెన్సీ/కాంట్రాక్టర్‌ వేతనాలు ఇచ్చారు. వీరి సర్వీసును క్రమబద్ధీకరించేందుకు నిబంధనలు అనుమతించవు’’అని జీహెచ్‌ఎంసీ తరఫు న్యాయవాది నివేదించారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement