
యాదాద్రి ఆలయ అధికారులకు బంగారం అందజేస్తున్న హరీశ్ దంపతులు. చిత్రంలో ప్రభుత్వ విప్ సునీత
యాదగిరిగుట్ట: కేంద్రంలో ఖాళీగా ఉన్న 15 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని ఢిల్లీలో బిలియన్ మార్చ్ చేస్తే తామూ వస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను ఉద్దేశించి రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. కేంద్రంలో 7 లక్షల ఉద్యోగాలే ఖాళీగా ఉన్నాయని బండి సంజయ్ ఒప్పుకున్నందుకు సంతోషమని, కానీ.. రైల్వేలో 3 లక్షలు, డిఫెన్స్, ఆర్మీలో 2 లక్షలు, బ్యాంకింగ్‌లో 50 వేలు, ప్రభుత్వరంగ సంస్థల్లో 2 లక్షల ఖాళీలు ఉన్నాయని, ఇవన్నీ కలిపితే 15లక్షలు అవుతాయని, వీటిని కేంద్రం ఎప్పుడు భర్తీ చేస్తుం దో చెప్పాలన్నారు.
గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో జరిగిన ఆలేరు నియోజకవర్గ స్థాయి యువజన, విద్యార్థి విభాగం, సోషల్ మీడియా కార్యకర్తల సమావే శంలో మంత్రి మాట్లాడారు. అంబేడ్కర్‌పై సీఎం కేసీఆర్ తప్పుగా ఏమీ మాట్లాడలేదని, రాజ్యాంగ స్ఫూర్తి దెబ్బతిం టోంది.. దానికి న్యాయం చేయాలని మాత్రమే అడిగారని పేర్కొన్నారు. రాజ్యాంగంలో చిన్న మార్పు తెస్తేనే ఎస్సీలకు విద్య, ఉద్యోగంలో 15 శాతం నుంచి 19 శాతం రిజర్వేషన్ దొరుకుతుం దని, గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ వస్తుందని సీఎం కేసీఆర్ అంటే అది తప్పెలా అవుతుందన్నా రు.
తెలంగాణ నంబర్ వన్ స్థానంలో ఉందనే వి షయాన్ని సోషల్ మీడియాలో టీఆర్‌ఎస్ ప్రచారం చేయాలన్నారు. మన రాష్ట్రం పేద ప్రజలకు మంచి వైద్యం అందిస్తోందని దేశంలోనే టాప్ 3లో ఉందని కేంద్ర ప్రభుత్వ సంస్థ నీతి ఆయోగ్ తెలిపిందని, అదే ప్రధాని నరేంద్రమోదీ, సీఎం యోగి ప్రాతి నిథ్యం వహిస్తున్న ఉత్తరప్రదేశ్ ప్రజారోగ్యం విష యంలో చిట్ట చివరి రాష్ట్రంగా ఉందని తెలిపారు.
యాదాద్రికి కిలో బంగారం..
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న హరీశ్‌రావు దంపతులు ప్రధానాలయ విమాన గోపురానికి స్వర్ణ తాపడం కోసం సిద్దిపేట నియోజ కవర్గం తరఫున కిలో బంగారం అందజేశారు. ఆయన వెంట ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు కె.రామకృష్ణారెడ్డి, కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ, వైద్య, ఆరోగ్య శాఖ జిల్లా అధికారి తదితరులున్నారు.