సాక్షి, రంగారెడ్డి: భార్య నుంచి వేరుగా ఉంటున్న భర్త.. ఆమె ఇంట్లో లేని సమయంలో నగలు, నగదు ఎత్తుకెళ్లిన ఘటన శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో జరిగింది. ఇన్‌స్పెక్టర్ ఎ.శ్రీధర్‌కుమార్ కథనం ప్రకారం.. ఊట్‌పల్లిలో నివాసముంటున్న ఉపాధ్యాయురాలు రావుల అనురాధతో ఫరూక్‌నగర్ మండలం షాద్‌నగర్ వాసి తీగలపల్లి మధుసూదనాచారితో 17 ఏళ్ల కిందట పెళ్లైంది. సంతానం లేకపోవడంతో పాటు అనురాధకు అనారోగ్యం కారణంగా వీరు వేర్వేరుగా ఉంటున్నారు. అనురాధ తన దత్తపుత్రుడు అనిరుధ్‌తో కలిసి ఊట్‌పల్లిలో ఉంటోంది. జూన్ ఒకటో తేదీన ఇంటికి తాళం వేసి అనిరుధ్‌తో కలిసి బీరమ్మగూడలోని బంధువుల ఇంటికి వెళ్లింది.
తిరిగి జూన్ 7న ఇంటికి వచ్చి చూడగా.. ఇంటి తలుపు తాళం విరగొట్టి ఉంది. బీరువా కూడా తెరిచి ఉంది. బీరువాలోని 10 తులాల బంగారు నగలు, రూ.5 లక్షల నగదు కనిపించలేదు. చుట్టుపక్కల వారిని ఆరా తీయగా.. జూన్ 4న అర్ధరాత్రి సమయంలో అనురాధ భర్త మధుసూదనాచారి ఇంటికి వచ్చాడని చెప్పారు. దీంతో భర్తే తన నగలు, నగదు తీసుకెళ్లి ఉంటాడని భావించి.. వాటిని తిరిగి ఇవ్వాలని కోరింది. ఎంతకూ అతడి నుంచి స్పందన లేకపోవడంతో గురువారం బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment