సాక్షి, హైదరాబాద్: కొన్ని ప్రైవేటు జూనియర్ కళాశాలలకు ‘ఇంటర్ బోర్డు గుర్తింపు’ ఇప్పటికీ లభించకపోవడంతో ఆయా కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఓ వైపు పరీక్షలు సమీపిస్తుండగా..మరోవైపు గుర్తింపు రాకపోతే ఏమి చేయాలో తెలియక అయోమయానికి గురవుతున్నారు. తాజాగా మహానగర పరిధిలోని సుమారు 20కిపైగా ప్రైవేటు జూనియర్ కళాశాలకు ప్రస్తుత 2022–23 విద్యా సంవత్సరానికి గుర్తింపు లభించలేదు. ఆయా కళాశాలల యాజమాన్యాలు అనుబంధ గుర్తింపునకు అవసరమైన ధ్రువపత్రాలు సమర్పించక పోవడం, మరి కొన్ని యాజమాన్యాలు నిర్లక్ష్యం వహించడంతో గుర్తింపు లభించలేదు.
దీంతో ఆయా కళాశాలల విద్యార్థులు మరో కళాశాలలో చేరి పరీక్షలు రాయాల్సిన పరిస్ధితి నెలకొంది. అయితే కొన్ని విద్యాసంస్థలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో సైతం నిర్లక్ష్యం వహిస్తున్నట్లు తెలుస్తోంది. నిబంధల ప్రకారం విద్యార్ధులు పరీక్ష ఫీజు ఎక్కడి నుంచి చెల్లిస్తే అక్కడి నుంచే పరీక్షలకు హాజరై ధ్రువీకరణ పత్రాలను పొందాల్సి ఉంటుంది. ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు దాదాపు 70 శాతం చదువు ఒక చోట...30 శాతం మరో కళాశాలలో చదువుకోవడం ఇబ్బందికరంగా తయారు కానుంది. మరోవైపు ప్రయోగ పరీక్షలకు గడువు సమీపిస్తుండటంతో విద్యార్థుల్లో అయోమయ పరిస్థితి నెలకొంది.
గుర్తింపు ఇలా..
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో సుమారు 891 జూనియర్ కళాశాలలు ఉండగా అందులో సుమారు 671 ప్రైవేటు జూనియర్ కాలేజీలు ఉన్నాయి. ఈ విద్యా సంవత్సరం సుమారు 651 ప్రైవేటు కళాశాలకు మాత్రమే గుర్తింపు లభించింది. మొత్తం మీద హైదరాబాద్ పరిధిలో 249, రంగారెడ్డి జిల్లాలో 204, మేడ్చల్ జిల్లాలో 198 కళాశాలలకు మాత్రమే గుర్తింపు ఉన్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
వివాదాస్పదమే..
ప్రతి విద్యా సంవత్సరం ప్రైవేటు కాలేజీలకు అనుబంధ గుర్తింపు అంశం వివాదాస్పదమవుతోంది. ప్రతి విద్యా సంవత్సరం అనుమతుల కోసం వచ్చిన దరఖాస్తులు కొన్ని తిరస్కరించడం, ఆ తర్వాత విద్యార్థుల భవిష్యతు దృష్ట్యా గుర్తింపు ఇవ్వడం ప్రహసనంగా తయారైంది. తాజాగా ఈ విద్యా సంవత్సరం ప్రైవేటు జూనియర్ కాలేజీలు అనుబంధ గుర్తింపు ప్రక్రియ కఠినంగా సాగింది. వాస్తవంగా మహానగరంలో ప్రైవేట్ కళాశాలలు అధిక శాతం వాణిజ్య సముదాయాల్లో కొనసాగుతున్నాయి. అయినప్పటికి కొన్ని నిబంధలకు ప్రభుత్వం మినహాయింపు ఇస్తూ వస్తోంది. మిగిలిన మరికొన్ని నిబంధనలు, అంశాలకు సంబంధించి పత్రాలు సైతం సమర్పించడంలో కొన్ని యాజమాన్యాలు విఫలం కావడంతో అనుబంధ గుర్తింపుకు సమస్యగా తయారైంది.
అధికారుల నిర్లక్ష్యమే...
ప్రతియేటా జూనియర్ కళాశాలల గుర్తింపు ప్రక్రియలో అధికారుల నిర్లక్ష్య వైఖరి కనిపిస్తోంది. నిబంధనల ఉల్లంఘన, అక్రమాలను అడ్డుకోవాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంతో కొంతమంది ప్రైవేటు వ్యక్తుల పరీక్షలకు ముందు లంచాలు సమర్పించి గుర్తింపు దక్కించుకుంటున్నారు. ప్రైవేటు కాలేజీలు అఫిలియేష న్ రాకుండానే విద్యార్థుల తల్లిదండ్రులను మభ్యపెట్టి ప్రవేశాలు కల్పిస్తూ వస్తున్నాయి. వాస్తవంగా కాలేజీలు ప్రారంభంకావడానికి ముందే అనుబంధ గుర్తింపు ప్రక్రియ అంశాన్ని పూర్తి చేస్తే ఫలితం ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment