సాక్షి, హైదరాబాద్: సర్వ హంగులతో త్వరలో మెట్రో రియల్ ఎస్టేట్ వెంచర్ ఏర్పాటు కానుంది. మెట్రో ప్రాజెక్టు ప్రజా రవాణా సాధనమే కాదు.. నగర పునర్నిర్మాణ ప్రాజెక్టు అని గతంలో ప్రకటించిన నేపథ్యంలో.. తాజాగా హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ రియల్ రంగంలోకి అడుగు పెడుతుండడం విశేషం. మెట్రో నిర్మాణ సమయంలో ఆసియాలో అతిపెద్దదైన ప్రీకాస్ట్ యార్డు (మెట్రో వయాడక్ట్‌లు తయారు చేసిన ప్రాంతం)ను నెలకొల్పిన విషయం విదితమే. ప్రాజెక్టు నిర్మాణం పూర్తికావడంతో సుమారు 42 ఎకరాల స్థలంలో సుమారు లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో రియల్ వెంచర్‌గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది.
ఇప్పటికే ఉప్పల్ రింగ్‌రోడ్డు ప్రాంతంలో ప్రస్తుతం మెట్రో డిపోను సుమారు 104 ఎకరాల్లో ఏర్పాటు చేశారు. ఇందులో భూములు కోల్పోయిన రైతులకు హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో నెలకొల్పిన మెట్రో సిటీలో ప్లాట్లు కేటాయించారు. కానీ ఇప్పుడు ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కేందుకు ప్రీకాస్ట్ యార్డును రియల్ వెంచర్‌గా అభివృద్ధి చేయనున్నారు. ఈ నిధులను ఆర్థిక కష్టాల్లో ఉన్న మెట్రో సంస్థ వివిధ అభివృద్ధి పనులకు వినియోగించనుంది. నూతన రియల్ వెంచర్‌లో 200, 300, 600 చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్లాట్లు ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.
అదే తరహాలో.. రియల్ బూమ్..
ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కోకాపేట్‌లో భూముల వేలం ద్వారా సుమారు రెండు వేల కోట్లకు పైగా రెవెన్యూ ఆదాయాన్ని రాబట్టిన విషయం విదితమే. భూముల వేలంతో గ్రేటర్ పరిధిలో మళ్లీ రియల్ బూమ్‌కు రెక్కలొచ్చాయి. ఇదే తరుణంలో ఉప్పల్ ప్రీకాస్ట్ యార్డ్ ప్రాంగణంలో హెచ్‌ఎంఆర్ సంస్థ ఏ ర్పాటు చేసే రియల్ వెంచర్‌కు కూడా భారీగా డిమాండ్ ఉంటుందని రియల్టీ వర్గాలు అంచనా వే స్తున్నాయి. ఈ వెంచర్ ఏర్పాటు ద్వారా రూ.600 కో ట్లు రాబట్టాలని మెట్రో వర్గాలు ఆదాయ అంచనాలు రూపొందిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.
సదుపాయాలు ఇలా..
► ప్రీకాస్ట్ యార్డు స్థలంలో ఏర్పాటు చేయనున్న వెంచర్‌లో హెచ్‌ఎండీఏ మార్గదర్శకాల ప్రకారం 40, 60, 100 ఫీట్ల వైశాల్యంతో సువిశాలమైన రహదారులు, గ్రీన్ స్పేస్, పబ్లిక్ పార్కులు, తాగునీరు, మురుగునీటి పారుదల వ్యవస్థలను ఏర్పాటు చేయనున్నారు. హెచ్‌ఎండీఏ నిబంధనల మేరకు 30 శాతం విస్తీర్ణంలో రహదారులు మరో 10 శాతం విస్తీర్ణంలో ఇతర సదుపాయాలు కల్పించాల్సి ఉంటుంది.
► మిగతా 55–60 శాతం విస్తీర్ణంలో రియల్ వెంచర్ ఏర్పాటు కానుంది. ఇందులో మార్కెట్ డిమాండ్‌ను బట్టి నివాస, వాణిజ్య సముదాయాలు ఏర్పాటు చేసుకునేందుకు వీలుగా ప్లాట్ల విస్తీర్ణాన్ని నిర్ణయించనున్నారు. మెట్రో ప్రాజెక్టుకు ప్రయాణికుల ఆదాయం ద్వారా 50 శాతం, రియల్టీ, రవాణా ఆధారిత అభివృద్ధి ప్రాజెక్టుల ఏర్పాటు ద్వారా మరో 45 శాతం, వాణిజ్య ప్రకటనల ద్వారా మరో 5 శాతం ఆదాయాన్ని రాబట్టాలని 2011లో కుదిరిన నిర్మాణ ఒప్పందంలో నిర్ణయించిన విషయం విదితమే.
Comments
Please login to add a commentAdd a comment