సాక్షి, హైదరాబాద్: ఎన్నో పోషక విలువలకు నెలవై.. పల్లె ప్రాంతాలకే అలవాలమై ‘నీరా’ జనాలు అందుకున్న అత్యుత్తమ పానీయం. తాటి, ఈత చెట్ల నుంచి లభించే ప్రకృతి సిద్ధమైన నీరాను.. నగరవాసులకు చేరువ చేసేందుకు రంగం సిద్ధమైంది.
హుస్సేన్ సాగర్ తీరాన నెక్లెస్‌రోడ్డులోని పీపుల్స్ ప్లాజా వద్ద సుమారు 20 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించిన నీరా కేఫ్ ఇవాళ(బుధవారం) ప్రారంభం కానుంది. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, ఎక్సైజ్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ బుధవారం నీరాకేఫ్‌ను ప్రారంభించనున్నారు. ఈ పానీయాన్ని ఆస్వాదించేందుకు తరలివచ్చే జనాల కోసం ప్రభుత్వం ఇక్కడ అన్ని వసతులు కల్పించింది. అదే సమయంలో.. ఇక్కడ ఏర్పాటు చేసిన పలు చిత్రాలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి.
👉 నెక్లెస్ రోడ్డులో 2020 జులై 23న నీరాకేఫ్‌ను శంకుస్థాపన చేశారు. దాదాపు రెండున్నరేళ్ల తర్వాత నిర్మాణం పూర్తయింది. ఇది పూర్తిగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నడుస్తుంది. నీరా కేఫ్‌లో మొత్తం 7 స్టాళ్లు ఉంటాయి. 500 మంది కూర్చునేందుకు వీలుంటుంది. రేట్లు ఎలా ఉంటాయన్నది ఇంకా తెలియాల్సి ఉంది.
👉 నగర శివారు నందన వనంలోని పదెకరాల్లో ఉన్న తాటి చెట్ల నుంచి నీరా సేకరిస్తారు. నీరా నాలుగు డిగ్రీల వద్ద సురక్షితంగా నిల్వ ఉంటుంది. తాటి, ఈత నీరా సేకరించాక దాన్ని సీసాల్లో పోసి.. ఐస్ బాక్సుల్లో నగరానికి తీసుకొస్తారు. నీరా కేఫ్‌లో శుద్ధి చేసి.. ప్యాకింగ్ చేసి.. విక్రయిస్తారు.
👉 నీరా కేఫ్‌ను.. పోష్ రెస్టారెంట్ తరహాలో తీర్చిదిద్దారు. తియ్యటి నీరాతో పాటు నోరూరించే అనేక ఆహార పదార్థాలు కూడా లభిస్తాయి. గ్రౌండ్ ఫ్లోర్‌లో ఫుడ్ కోర్టు ఉంటుంది. మొదటి అంతస్తులో నీరాను అమ్ముతారు. నీరాను అక్కడే కూర్చుని తాగవచ్చు. లేదంటే టేక్ అవే సౌకర్యం కూడా ఉంది.
👉 పల్లెల్లో తాళ్లు, ఈదుల మధ్య కూర్చున్న అనుభూతి కలిగేలా... కేఫ్ చుట్టూ తాటి చెట్ల ఆకృతులు, పైకప్పును తాటాకు ఆకృతిలో రూపొందించారు.
👉 నీరా కేఫ్ నుంచి ట్యాంక్‌బండ్‌లోని బుద్ధ విగ్రహం వరకు బోటింగ్ సౌకర్యాన్ని కూడా అందుబాటులోకి తెచ్చారు.
కల్లుకు, నీరాకు ఎంతో తేడా ఉంది. కల్లులో ఆల్కాహాల్ శాతం ఉంటుంది. కానీ నీరాలో ఆల్కాహాల్ ఉండదు. నీరా రుచి తియ్యగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి మంచిది.
Comments
Please login to add a commentAdd a comment