సాక్షి,హైదరాబాద్ : రాష్ట్రంలోని గౌడ సామాజికవర్గ అస్తిత్వానికి ప్రతీకగా నీరా కేఫ్ ఉంటుందని రాష్ట్ర పురపాలక, పరిశ్రమలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి కె.తారకరామారావు చెప్పారు. రాష్ట్రంలో స్కిల్ డెవలప్‌మెంట్‌ను ప్రోత్సహించడంతో పాటు వృత్తి నైపుణ్యాలు మరుగున పడిపోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని ఆయన అన్నా రు. గురువారం హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్డులో నీరా కేఫ్ నిర్మాణానికి రాష్ట్ర మంత్రులు వి.శ్రీనివాస్‌గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, గౌడ సంఘాల ప్రతినిధులతో కలిసి కేటీఆర్ శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా జరిగిన సభలో కేటీఆర్ మాట్లాడుతూ, గీత వృత్తిపై రాష్ట్రంలో రెండులక్షలకు పైగా ఆధారపడి ఉన్నారని, ఈ వృత్తిపై ఉన్న రూ.16 కోట్ల పన్నును రద్దు చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదే అని అన్నారు. ఈ నీరా కేఫ్ ఆరంభం మాత్రమేనని, భవిష్యత్తులో పాపులర్ డ్రింక్‌గా నీరా ఉండబోతోందని చెప్పారు. ప్రతి వృత్తిలో అందరూ సంతోషంగా ఉండాలన్నదే సీఎం కేసీఆర్ ఆలోచన అని, నేత, గీత, గొల్ల, ముదిరాజ్ ఇలా ప్రతి వృత్తిని కాపాడుకోవడమే లక్ష్యంగా ఈ ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. అన్ని కుల వృత్తుల సంక్షేమమే ధ్యేయం గా పనిచేస్తామని అన్నారు.
ఎక్సైజ్ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ, ఎన్నో కులాలకు గీత వృత్తి మూలాధారంగా ఉందని, ఈ వృత్తిపై గత ప్రభుత్వాలు పన్ను వసూలు చేసి గీత కార్మికులను జెండాలు మోసే వారిగానే చూశాయని అన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న పోరాడినా రద్దు కాని వృత్తి పన్నును తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రద్దు చేశారని గుర్తు చేశారు. దశాబ్దాల నుంచి గీత వృత్తిపై ప్రభుత్వాలు పన్ను వసూలు చేస్తే గీత వృత్తికి పన్నుతో పాటు బకాయిలను రద్దు చేసిన ఘనత కేసీఆర్‌కు దక్కుతుందన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణ ప్రభుత్వం నీరా పాలసీ తెచ్చిందన్నారు. కేసీఆర్ తర్వాత మనసున్న నాయకుడు కేటీఆర్ అని, వందల కోట్ల విలువైన భూమి నీరా కేఫ్ స్టాల్‌కు ఇచ్చారని చెప్పారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి పువ్వా డ అజయ్ కుమార్, సీఎస్ సోమేశ్‌కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే దానం నాగేందర్, జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, తెలంగాణ గౌడ సంఘం అధ్యక్షుడు పల్లె లక్ష్మణ్‌రావు గౌడ్‌ల తో పాటు పలువురు గౌడ సంఘాల ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్‌గౌడ్, తలసాని, ఇతర ప్రజా ప్రతి నిధులు నీరా పానీయాన్ని సేవించారు.
Comments
Please login to add a commentAdd a comment