ఫార్ములా–ఈ రేసింగ్‌ రద్దు | Formula E racing is cancelled | Sakshi
Sakshi News home page

ఫార్ములా–ఈ రేసింగ్‌ రద్దు

Published Sun, Jan 7 2024 4:37 AM | Last Updated on Sun, Jan 7 2024 4:37 AM

Formula E racing is cancelled - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌లో ఫార్ములా– ఈ కార్‌ రేసింగ్‌ పోటీలను (రేస్‌ రౌండ్‌ –4) రద్దు చేసినట్లు ఫార్ములా–ఈ ఆపరేషన్స్‌ (ఎఫ్‌ ఈఓ) ప్రకటించింది. వచ్చే ఫిబ్రవరి 10వ తేదీన నెక్లెస్‌రోడ్డు స్ట్రీట్‌ సర్క్యూట్‌లో నిర్వహించవల సిన ఈ  అంతర్జాతీయ పోటీలపై తెలంగాణ ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్న ట్లు పేర్కొంది. ఫార్ములా–ఈ పోటీలపై గతేడాది అక్టోబర్‌ 30వ తేదీన ఏర్పాటు చేసుకున్న ఒప్పందాన్ని ప్రభుత్వం ఉల్లంఘించిందని ఆరోపించింది.

ఈ మేరకు తెలంగాణ పురపాలన, పట్టణా భివృద్ధి (ఎంఏయూడీ) విభాగానికి నోటీసులు ఇవ్వను న్నట్లు ఎఫ్‌ఈఓ తెలిపింది. తెలంగాణ సర్కా ర్‌ వైఖరి తమను తీవ్ర నిరుత్సాహానికి గురి చేసిందని ఎఫ్‌ఈఓ కో–ఫౌండర్, చీఫ్‌ చాంపియన్‌షిప్‌ ఆఫీసర్‌ ఆల్బర్ట్‌ లొంగో అన్నారు. తదుపరి పోటీలను హాంకాంగ్‌లో నిర్వహించను న్నట్లు తెలిపారు.

ఫార్ములా–ఈ పోటీల వల్ల ఎలాంటి ప్రయోజ నం లేదని భావించడం వల్లే ప్రభుత్వం  విముఖతతో ఉన్నట్లు తెలిసింది. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తరువాత ఈ పోటీల నిర్వహణపై ప్రభుత్వ ఉన్నతాధికారు లతో చర్చించేందుకు నిర్వాహ కులు ప్రయత్నించినప్పటికీ ఎలాంటి సానుకూలత వ్యక్తం కాలేదని ఈ నేపథ్యంలో పోటీలను రద్దు చేసినట్లు సమాచారం. 

గత ఏడాది భారీ ఏర్పాట్లు
ప్రపంచవ్యాప్తంగా మోటార్‌ స్పోర్ట్స్‌ ప్రియు­ల­ను విశేషంగా ఆకట్టుకొనే  ఫార్ములా–ఈ పోటీలు గత సంవత్సరం ఫిబ్రవరి 10, 11 తేదీల్లో హైద రాబాద్‌ నెక్లెస్‌ రోడ్డులో జరి­గాయి. ఈ పోటీల కోసం హెచ్‌ఎండీఏ  సుమారు రూ.100 కోట్లకు పైగా వెచ్చించి  స్ట్రీట్‌ సర్క్యూట్‌ నిర్మాణంతో పాటు అన్ని ఏర్పాట్లు చేసింది. భారతదేశంలోనే మొట్టమొదటిసారి ఈ పోటీలు జరగడంతో దేశవ్యాప్తంగా భారీఎత్తున ప్రచార కార్య­క్రమాలు నిర్వహించారు. మరోవైపు వేలా దిమంది మోటార్‌ స్పోర్ట్స్‌ ప్రియులు, రేసింగ్‌ డ్రైవర్‌లు హైదరాబాద్‌ను సందర్శించారు.

ట్రాఫిక్‌ జామ్‌తో ఇబ్బందులు
ఫార్ములా–ఈ పోటీలతో పాటు అంతకంటే రెండు నెలల ముందు జరిగిన ఒక రోజు ఇండియన్‌ రేసింగ్‌ కార్‌ పోటీల సందర్భంగా నగ రంలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. నెక్లెస్‌రోడ్డు వైపు వచ్చే వాహనాలను నిలిపివేశారు. దీంతో  ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, హిమాయత్‌నగర్‌ మార్గాల్లో ఖైరతాబాద్‌ వైపు ట్రాఫిక్‌ స్తంభించింది. అమీర్‌పేట్‌ వైపు నుంచి లక్డీకాపూల్‌ వైపు వచ్చే వాహనాల రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది.

ఐదు రోజుల ముందు నుంచే ట్రాఫిక్‌ ఆంక్షలు విధించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. పోటీలపై సామాజిక మాధ్యమాల్లో పెద్దయెత్తున వ్యతిరేకత వ్యక్తమైంది. ప్రజలకు ట్రాఫిక్‌ నరకాన్ని చూపుతూ ఎవరి కోసం ఈ పోటీలు అంటూ నెటిజన్‌లు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ పరిస్థితిని కూడా దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్‌ ప్రభుత్వం  వెనుకడుగు వేసిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఇది దుర్మార్గమైన తిరోగమన చర్య: కేటీఆర్‌
ఫార్ములా –ఈ రేస్‌కు ప్రభుత్వం వెనుక­డుగు వేయడంపై బీఆర్‌ఎస్‌ కార్య­నిర్వాహక అధ్య క్షుడు కేటీఆర్‌ తీవ్రంగా మండిపడ్డారు. ఇది కాంగ్రెస్‌ ప్రభుత్వ దుర్మార్గమైన, తిరోగ మన నిర్ణయమని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. ‘హైదరాబాద్‌ ఇ– ప్రిక్స్‌ వంటివి ప్రపంచవ్యాప్తంగా మన నగరం, దేశం బ్రాండ్‌ ఇమేజ్‌ను పెంచుతాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో హైదరాబాద్‌ నగరాన్ని ఆకర్షణీయమైన పెట్టుబడులకు గమ్యస్థానంగా ప్రపంచానికి చాటేందుకు  ఉపకరిస్తాయి.

ఎలక్ట్రానిక్‌ వాహన రంగానికి చెందిన  ఔత్సాహికులు, తయారీ­దారులు, స్టార్టప్‌లను ఆకర్షిస్తూ ఒక వారం పాటు ఈవీ సమ్మిట్‌ను నిర్వ హించేందుకు ఫార్ములా–ఈ  రేస్‌ను ఒక సందర్భంగా కేసీఆర్‌ ప్రభుత్వం ఉపయోగించుకుంది..’ అని కేటీఆర్‌ పేర్కొన్నారు. సస్టైనబుల్‌ మొబిలిటీ సొల్యూషన్స్‌కు కేంద్రంగా రాష్ట్రాన్ని ప్రమోట్‌ చేయ­డానికి తాము  తెలంగాణ మొబిలిటీ వ్యాలీని కూడా ప్రారంభించినట్లు తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement