సాక్షి, హైదరాబాద్: కొత్త సంవత్సరానికి స్వాగతం పలికే వేడుకలకు నగరవాసులు సిద్ధం అవుతున్నారు. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తప్పవని ఇదివరకే హెచ్చరించారు కూడా.
డిసెంబర్ 31వ తేదీ శనివారం రాత్రి 10 నుంచి ఆదివారం తెల్లవారుజామున 2 గంటల వరకు పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నగర వ్యాప్తంగా ఉన్న అన్ని ఫ్లై ఓవర్లను మూసివేస్తున్నట్లు ప్రకటించారు. బేగంపేట్, లంగర్ హౌజ్ ఫ్లై ఓవర్లకు మాత్రం మినహాయింపు ఉంటుందని ప్రకటించారు.
న్యూఇయర్ వేడుకలకు ఎక్కువ కోలాహలం కనిపించే.. హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు. ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్డు, అప్పర్ ట్యాంక్‌బండ్ వైపు వాహనాలను అనుమతించమని చెప్పారు. ట్రక్కులతో పాటు ఇతర భారీ వాహనాలను రాత్రి 2 గంటల వరకు హైదరాబాద్‌లోకి అనుమతించరు. ఇక నగర వ్యాప్తంగా కఠినంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు జరుగుతాయని పోలీసులు తెలిపారు.
వీవీ స్టాచ్యూ, ఎన్టీఆర్ మార్గ్, రాజ్ భవన్ రోడ్, బీఆర్కే భవన్, తెలుగు తల్లి జంక్షన్, ఇక్బాల్ మినార్, లక్డీకాపూల్, లిబర్టీ జంక్షన్, అప్పర్ ట్యాంక్ బండ్, అంబేద్కర్ స్టాచ్యూ, రవీంద్ర భారతి, ఖైరతాబాద్ మార్కెట్, నెక్లెస్ రోటరీ, సెన్‌సెషన్ థియేటర్, రాజ్‌దూత్ లేన్, నల్లగుట్ట రైల్వే బ్రిడ్జి, సంజీవయ్య పార్క్, పీవీఎన్ఆర్ మార్గ్, మినిస్టర్ రోడ్, సైలింగ్ క్లబ్, కవాడిగూడ ఎక్స్ రోడ్, లోయర్ ల్యాంక్ బండ్, కట్టమైసమ్మ టెంపుల్, అశోక్ నగర్, ఆర్టీసీ ఎక్స్‌రోడ్డులో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు స్పష్టం చేశారు. మింట్ కంపౌండ్ రహదారిని కూడా మూసివేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment