I Don't Know Conman Sukesh Chandrashekhar Says Kalvakuntla Kavitha - Sakshi
Sakshi News home page

‘సుఖేష్‌ ఎవరో కూడా నాకు తెలియదు.. మా కుటుంబాన్ని బద్నాం చేసే కుట్ర ఇది’

Published Thu, Apr 13 2023 3:14 PM | Last Updated on Thu, Apr 13 2023 4:57 PM

I Dont know Conman Sukesh Chandrashekhar says Kalvakuntla Kavitha - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సుఖేష్‌ చంద్రశేఖర్‌ వాట్సాప్‌ ఛాటింగ్‌ ప్రచారంపై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు.  బీఆర్‌ఎస్‌పై ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం జరుగుతోందని, కేసీఆర్‌ను ఎదుర్కొనే ధైర్యం లేకే తనపై దాడికి దిగారని కవిత ట్విటర్‌ ద్వారా కౌంటర్‌ఎటాక్‌కి దిగారు. 


గత కొన్ని రోజులుగా తెలంగాణ ప్రభుత్వం మీద, బీఆర్ఎస్ పార్టీ మీద, మరీ ముఖ్యంగా నా మీద ఉద్దేశపూర్వకంగా కొన్ని మీడియా సంస్థలు తప్పుడు వార్తలు, తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయి.. 

బిఆర్ఎస్ పార్టీ పొందుతున్న ప్రజాదరణను, కెసిఆర్ గారి జాతీయ స్థాయి కార్యాచరణను రాజకీయంగా ఎదుర్కునే ధైర్యం లేక తెలంగాణ వ్యతిరేకులు మీడియా సంస్థలను గుప్పిట్లో పెట్టుకొని  పేపర్లు, టీవి ఛానెళ్లు, యూ ట్యూబ్ మీడియాల ద్వారా పనిగట్టుకొని బిఆర్ఎస్ పార్టీ మీద ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నాయి. 

ఒక ఆర్థిక నేరగాడు, ఒక అనామక లేఖను విడుదల చేయడం, దాని వెంటనే బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాయడం, దాని తదనంతరమే ఎంపీ అరవింద్ బీజేపీ టూల్ కిట్ లో భాగంగా పనిగట్టుకుని సామాజిక మాధ్యమాల్లో బురదజల్లే కార్యక్రమాన్ని ఒక ప్రణాళిక ప్రకారం చేస్తున్నారు.

అసలు సుఖేష్ చంద్రశేఖర్ అనే వ్యక్తితో నాకు పరిచయం కూడా లేదు. అతనెవరో కూడా నాకు తెలియదు. కానీ వాస్తవాలను ఏవి పట్టించుకోకుండా, కొన్ని మీడియా సంస్థలు అత్యుత్సాహంతో, పనిగట్టుకొని తప్పుడు వార్తలు ప్రచురించాయి. ఇదివరకు నా మొబైల్ ఫోన్ల విషయంలో కూడా ఇలాగే తొందరపడి వార్తలు రాసి తరువాత తోక ముడిచారు. మళ్లీ ఇప్పుడు క్రిమినల్ సుఖేష్ ను పావుగా వాడుకొని తెలంగాణ ప్రభుత్వాన్ని, టిఆర్ఎస్ పార్టీని,కేసీఆర్ గారిని వారి కుటుంబ సభ్యులను బద్నాం చేయాలని ప్రయత్నిస్తున్నాయి. 

దున్నపోతు ఈనిందంటే దుడ్డెను కట్టేయమన్న చందంగా, అదుగో పులి అంటే ఇదిగో తోక అన్నట్లు తయారైంది ప్రస్తుతం కొన్ని మీడియా సంస్థల తీరు. ఇది అత్యంత దురదృష్టకరం. పాత్రికేయులు కనీస విలువలు పాటించకపోవడం అత్యంత బాధాకరం. రాజకీయ ఎజెండాలో మీడియా సంస్థలు కూడా పావుగా మారడం, బి ఆర్ యస్ పార్టీ పై అడ్డగోలుగా తప్పుడు ప్రచారం చేయడం చూస్తే ఎన్నికల ఏడాదిలో మరెంతో దిగజారి వార్తలు ప్రసారం చేస్తారు అని తెలంగాణ సమాజం గ్రహించాలి..జాగ్రత్త పడాలి.  

తెలంగాణ ప్రజలు విజ్ఞులు.. పాలు ఎంటో, నీళ్లేంటో తెలిసిన చైతన్య జీవులు. నిజం నిలకడ మీద తెలుస్తుంది. కేసీఆర్ గారి మీద కక్ష్యతో, అన్ని రంగాల్లో తెలంగాణను దేశంలో ముందు వరుసలో నిలిపిన బీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఈర్శ్యతో తప్పుడు ప్రచారం చేస్తున్న వారిని తెలంగాణ సమాజం తప్పకుండా తరిమి కొడుతుంది. 

నా మీద బురద జల్లే వార్తలకు కొన్ని మీడియా సంస్థలు ఇచ్చిన అగ్ర ప్రాధాన్యత,  దమ్ముంటే, నిజాయితీ ఉంటే నా వివరణకి కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాలి.

తెలంగాణ బిడ్డలం తలవంచం.. తెగించి కొట్లాడుతాం..!

జై తెలంగాణ... జై భారత్
                                                                                      కల్వకుంట్ల కవిత
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement