లాక్‌డౌన్‌కు ముందు రోజుకు సగటున లక్ష రూపాయల వ్యాపారం జరిగేది. ఇందులో డొమెస్టిక్ సేల్స్ కంటే కమర్షియల్ సేల్సే ఎక్కువ. ప్రస్తుతం ఫంక్షన్లు తగ్గిపోయాయి. హోటళ్లు, రెస్టారెంట్లు తెరిచినా కస్టమర్లు ఆసక్తి చూపడం లేదు. దీంతో మా కిరాణాషాపులో వ్యాపారం భారీగా తగ్గింది. ప్రస్తుతం డొమెస్టిక్ కస్టమర్లే ఎక్కువ వస్తున్నారు. చిల్లర వ్యాపారం ఉన్నప్పటికీ పెద్దగా ప్రయోజనం ఉండదు. గతంతో పోలిస్తే ప్రస్తుతం మా కౌంటర్ రూ.40 వేలు దాటడం లేదు.
– ఎల్‌బీనగర్‌లోని ఓ హోల్‌సేల్ కిరాణా వ్యాపారి ఆవేదన ఇది
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ మహమ్మారి విజృంభించినకొద్దీ విక్రయాలు నీరసిస్తున్నాయి. కరోనా ప్రభావం పెరిగినకొద్దీ కిరాణా వ్యాపారం హైరానా పడుతోంది. గిరాకీ లేక వ్యాపారం గిరికీలు కొడుతోంది. శుభకార్యాలు భారీగా తగ్గిపోయాయి. అక్కడక్కడా దావత్‌లు జరుగుతున్నా బంధుమిత్రులు పరిమిత సంఖ్యలోనే వచ్చేస్తున్నారు. దావత్‌లకు పోయేవాళ్లల్లో కొంతమంది మొహం చూపించి రావడం తప్ప భోజనం సైతం చేయడం లేదు. మరోవైపు రెస్టారెంట్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు తెరిచినప్పటికీ గిరాకీ పూర్తిగా తగ్గింది.
ఈ ప్రభావం హోల్‌సేల్(టోకు) కిరాణా దుకాణాలపై తీవ్రంగా పడింది. నిత్యావసర సరుకుల వ్యాపారానికి ఢోకా లేదని భావించినా హోల్‌సేల్ వ్యాపారులకు మాత్రం ప్రస్తుత పరిస్థితి మింగుడుపడడం లేదు. సాధారణరోజుల్లో జరిగే వ్యాపారంలో ప్రస్తుతం 40 శాతం మించడం లేదనే ఆందోళన హోల్‌సేల్ వ్యాపారుల్లో వ్యక్తమవుతోంది. లాక్‌డౌన్.. ఆ తర్వాత పరిస్థితులు క్రమంగా అన్ని రంగాలపైనా తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. సాధారణ గృహావసరాలకు జరిగే విక్రయాలతో పోలిస్తే కమర్షియల్ విక్రయాల పరిమాణమే ఎక్కువ. యాభైమంది డొమెస్టిక్ కస్టమర్లకు సరిపడా సరుకులు ఒక కమర్షియల్ కస్టమర్ కొనుగోలు చేస్తాడు. ఈ క్రమంలో కమర్షియల్ సేల్స్ పడిపోవడంతో వ్యాపారులకు నష్టాలు మొదలయ్యాయి.
రెండింటిలో తేడా ఏంటంటే...
సాధారణంగా ఒక డొమెస్టిక్ కస్టమర్ కొనుగోలు చేసే సరుకులు ఎక్కువగా ఉన్నప్పటికీ వాటిని ప్యాకింగ్ చేసేందుకు రిస్క్‌తోపాటు మ్యాన్‌పవర్ అవసరం ఎక్కువ. సరుకులు తూచే క్రమంలో నిర్ణీత పరిమాణం కంటే కాస్త కొసరు వేయడంతో లాభాలు అక్కడే హరించుకుపోతాయని వ్యాపారులు చెబుతున్నారు. కస్టమర్లను ఆకర్షించేందుకే ఈ ఎత్తుగడ అని, వ్యాపారం రొటేషన్ కోసం మాత్రమే డొమెస్టిక్ సేల్స్ పాత్ర పోషిస్తామని అభిప్రాయపడుతున్నారు. కమర్షియల్ కస్టమర్‌కు పెద్దమొత్తంలో సరుకులు ఇవ్వడంతోపాటు ప్యాకేజీ సమస్య కూడా పెద్దగా ఉండదు. కాస్త తక్కువ రేటుకు సరుకులు విక్రయించినా డొమెస్టిక్ సేల్స్‌తో పోలిస్తే ఎక్కువ వ్యాపారం, ఎక్కువ లాభసాటిగా ఉంటుందని వ్యాపారులు చెబుతున్నారు. లాక్‌డౌన్ తర్వాతి పరిస్థితులతో కమర్షియల్ సేల్స్ బాగా పడిపోవడంతో హోల్‌సేల్ వ్యాపారంతోపాటు లాభాలు తగ్గినట్లు వ్యాపారులు చెబుతున్నారు. దీంతో నిర్వహణభారం ఆందోళన కలిగిస్తోందని చెబుతున్నారు.
సూపర్‌మార్కెట్లు కాస్త మెరుగే...
హోల్‌సేల్ వ్యాపారంతో పోలిస్తే సూపర్‌మార్కెట్లలో వ్యాపారం ఆశాజనకంగా ఉన్నట్లు పలు మార్కెటింగ్ రీసెర్చ్‌లు చెబుతున్నాయి. సూపర్ మార్కెట్లలో సరుకులను ఎక్కువగా డొమెస్టిక్ కస్టమర్లే కొనుగోలు చేస్తారు. ఇక్కడ ప్యాకేజింగ్‌కు ప్రత్యేక వ్యవస్థ ఉంటుంది. సేల్స్ బాయ్స్ కూడా అందుబాటులో ఉండడంతో కస్టమర్ల రాకపోకలు సాఫీగా, వేగంగా సాగుతాయి. ఈ క్రమంలో ఎక్కువ సేల్స్‌తోపాటు ప్యాకేజింగ్ చార్జీలు, సరుకుల కొలత పక్కాగా ఉండడం వ్యాపారికి కలిసొచ్చే అంశం. దీంతో వచ్చే లాభాల్లో ఏమాత్రం తేడా ఉండదు. లాక్‌డౌన్ కంటే ముందు జరిగే వ్యాపారంతో పోలిస్తే ప్రస్తుతం 65 శాతం పెరిగినట్లు బీఎన్‌రెడ్డి నగర్‌లోని ఓ సూపర్ మార్కెట్ నిర్వాహకుడు ‘సాక్షి’తో అన్నారు.
మరో నాలుగు నెలలు ఇంతే...
ప్రస్తుతం కోవిడ్–19 వ్యాప్తి తీవ్రమవుతోంది. కరోనా వైరస్ బారిన పడుతున్నవారి సంఖ్య భారీగా పెరుగుతోంది. దీంతో ఇప్పటివరకు నడిచిన వ్యాపారంపై మరింత ప్రభావం పడనుంది. ఉపాధి అవకాశాలు తగ్గుతుండడంతో పేద, మధ్యతరగతి వర్గాలు ఆచితూచి ఖర్చులు పెడుతున్నాయి. వైరస్ ప్రభావం మరో నాలుగు నెలల వరకు ఉంటుందని, అప్పటి వరకు కిరాణా వ్యాపారానికి ఒడిదుడుకులు తప్పకపోవచ్చని వ్యాపారవర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. డిసెంబర్ వరకు పరిస్థితి ఇలాగే ఉంటుందని, ఆ తర్వాత క్రమంగా కోలుకుంటుందని ఆశిస్తున్నట్లు హోల్‌సేల్ కిరాణా మర్చంట్స్ అసోసియేషన్ గ్రేటర్ హైదరాబాద్ ప్రతినిధి గణేష్‌గుప్తా అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment