
హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్ట్‌గా ‘తెలంగాణ దళితబంధు’పథకం అమలుకు సర్వం సిద్ధమవుతోంది.
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్ట్‌గా ‘తెలంగాణ దళితబంధు’పథకం అమలుకు సర్వం సిద్ధమవుతోంది. నియోజకవర్గంలోని 5 మండలాల్లో 20,929 దళిత కుటుంబాలు ఉన్నాయి. 2014–15 నాటి కుటుంబ సర్వే ప్రకారం ఈ లెక్క ఉండగా, మరిన్ని కుటుంబాలు పెరిగే అవకాశం ఉంది. ఈ లెక్కన హుజూరాబాద్ నియోజవకర్గంలోనే దాదాపు రూ.2 వేల కోట్లకుపైగా దళిత సాధికారత కింద ఖర్చు చేయనున్నారు. ఈ క్రమంలో నియోజకవర్గంలో దళితబంధు లబ్ధిదారుల ఎంపికకు రెండ్రోజుల్లో సర్వే ప్రారంభం కానుంది. బుధవారం కరీంనగర్‌లో జిల్లా కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్ అధ్యక్షతన నియోజకవర్గంలోని ఐదు మండలాల అధికారులు సమావేశం కానున్నారు. లబ్ధిదారుల గుర్తింపునకు అనుసరించాల్సిన విధివిధానాలను ఇందులో నిర్దేశిస్తారు.
గురువారం నుంచి క్షేత్రస్థాయిలో సర్వే ప్రక్రియ ప్రారంభమవుతుంది. మండలాల్లో సాగే సర్వేలో ప్రతీ గ్రామం, మున్సిపల్ వార్డు నుంచి ఎంపిక చేసిన ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులతో కూడిన 412 మంది దళిత ప్రతినిధులతోపాటు 15 మంది రిసోర్స్‌పర్సన్లు అధికారులకు సహకరిస్తారు. సర్వే పూర్తయ్యాక జిల్లా కలెక్టర్ నేతృత్వంలో అర్హులను ఎంపిక చేసి, ఒకే విడతలో అందరికీ రూ.10 లక్షల చొప్పున బ్యాంకు ఖాతాల్లో జమచేస్తారు. హుజూరాబాద్ ఉపఎన్నిక నోటిఫికేషన్‌కు ముందే ఆగస్టు తొలివారంలో లబ్ధిదారుల ఖాతాల్లో రూ.10 లక్షల చొప్పున జమ చేయడం ద్వారా పథకాన్ని ప్రారంభించాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. కాగా, దళిత వర్గాల్లో ఆదాయపన్ను చెల్లిస్తున్న కుటుంబాలు, ప్రభుత్వోద్యోగం చేస్తున్న కుటుంబాలకు దళితబంధు వర్తించదు.
ఖాతాలపై పర్యవేక్షణ
దళితబంధు లబ్ధిదారులకు ప్రభుత్వం నుంచి గుర్తింపుకార్డు అందజేస్తారు. ఏటీఎం కార్డు తరహాలో బార్‌కోడ్‌తో కూడిన ఎలక్ట్రానిక్ చిప్‌ను ఈ కార్డుకు అనుసంధానిస్తారు. ఖాతాలో పడిన రూ.10 లక్షలను విచ్చలవిడిగా డ్రా చేసుకొని ఖర్చుచేసే వీలుండదు. మండల దళితబంధు అమలు అధికారికి, జిల్లాలో కలెక్టర్‌కు తెలియకుండా పెట్టుబడి పెట్టే పరిస్థితి ఉండదు. ప్రతిపైసాకు జవాబుదారీతనం ఉండేలా పర్యవేక్షణ కొనసాగనుంది. పైలట్ ప్రాజెక్టు హుజూరాబాద్‌లో కాబట్టి.. రాష్ట్రంలోని అధికార యంత్రాంగాన్ని కూడా ఇక్కడికి డిప్యూటేషన్ మీద పంపించి అమలు చేయనున్నారని సమాచారం.