కరోనా కన్ఫ్యూజన్‌ | Implications in Corona vaccine distribution | Sakshi
Sakshi News home page

కరోనా కన్ఫ్యూజన్‌

Published Sat, Jan 2 2021 5:35 AM | Last Updated on Sat, Jan 2 2021 1:41 PM

Implications in Corona vaccine distribution - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కరోనా టీకా పంపిణీలో అనేక చిక్కుముడులున్నాయి. వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చాక వేయాల్సిన నిర్దేశిత లబ్ధిదారుల గుర్తింపు ఇప్పుడు సర్కారుకు సవాల్‌గా మారింది. రాష్ట్రంలో దాదాపు 75 లక్షల మంది వరకు మొదటి విడత టీకా వేయాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అందులో ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రుల్లోని డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది 2.88 లక్షల మందిని గుర్తించారు. వారి జాబితాను కేంద్ర ప్రభుత్వానికి కూడా పంపించారు. ఇక పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు, ఇతర ఫ్రంట్‌లైన్‌ కార్మికులు దాదాపు 2 లక్షల మంది ఉంటారు. వారిని గుర్తించే పనిలో యంత్రాంగం నిమగ్నమైంది. వారి జాబితా ఇంకా తయారు ప్రక్రియలోనే ఉంది. మరి 50 ఏళ్లు పైబడిన వారు, ఆ లోపు వయసున్న ఇతర అనారోగ్యమున్న వారి జాబితా తయారీపై ఇప్పటివరకు ప్రభుత్వ యంత్రాంగం దృష్టి సారించలేదు. దానికి సంబంధించి మార్గదర్శకాలను కూడా కేంద్రం పంపించలేదు. వాస్తవంగా ఈ రెండు వర్గాలకు చెందిన లబ్ధిదారులే ఎక్కువగా ఉంటారు. దీంతో వీరి జాబితా తయారీ గందరగోళంగా మారింది.  

ఈ నెలలోనే వ్యాక్సిన్‌.. 
దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్‌ ఈ నెలలోనే అందుబాటులోకి రానుంది. అందుకు సంబంధించి ఓ వ్యాక్సిన్‌కు ఆమోద ప్రక్రియ శుక్రవారం మొదలైంది. ఆమోదం పొందిన మరుసటి రోజే వ్యాక్సిన్‌ను దేశవ్యాప్తంగా సరఫరా చేసేలా కంపెనీలు అన్ని ఏర్పాట్లు చేసుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా దేశంలో 30 కోట్ల మందికి వ్యాక్సిన్‌ వేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ నెల ఎప్పుడైనా వ్యాక్సిన్‌ రాష్ట్రాలకు సరఫరా కానుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో వ్యాక్సిన్‌ వేయించుకునే లబ్ధిదారుల జాబితా తయారు, ఇంకా సిద్ధం చేయాల్సిన జాబితా తదితర అంశాలపై తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ ప్రత్యేకంగా సమావేశమైంది. బ్రిటన్‌ వేరియంట్‌ కొత్త కరోనా వైరస్‌ దూసుకొస్తుండటంతో వ్యాక్సిన్‌ను వేగంగా వేయాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. పైగా వ్యాక్సిన్‌ రెండు డోసుల కాలం, శరీరంలో యాంటీబాడీస్‌ తయారీ కాలం మొత్తం కలిపి కరోనా నుంచి రక్షణ పొందేందుకు 42 రోజుల సమయం పడుతుంది.

ఈ పరిస్థితుల్లో వేగంగా వ్యాక్సిన్‌ను ప్రమాదకర స్థితిలో ఉన్నవారికి వేయాల్సి ఉంది. అయితే వైద్య సిబ్బంది జాబితా పూర్తికాగా, ఫ్రంట్‌లైన్‌ వర్కర్ల జాబితా తయారు ప్రక్రియ నడుస్తుంది. అయితే 50 ఏళ్లు పైబడినవారు, ఆలోపు వయసున్న అనారోగ్యమున్న వ్యక్తులను గుర్తించడమే ఇప్పుడు అసలు సమస్యగా మారింది. రాష్ట్రంలో 50 ఏళ్ల పైబడిన వయసున్న వ్యక్తులు దాదాపు 64 లక్షల మంది ఉంటారని అంచనా వేశారు. వారిని ఓటర్‌ ఐడీ కార్డులతో గుర్తించాలని అనుకున్నారు. లబ్ధిదారులు తమ వివరాలను కోవిన్‌ యాప్‌లో అప్‌లోడ్‌ చేసుకోవాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాలు, పెద్దగా అవగాహనలేని వారు తమ వివరాలను కోవిన్‌ యాప్‌లో ఎలా అప్‌లోడ్‌ చేస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది. అన్ని లక్షల మంది ఇంత తక్కువ కాలంలో అప్‌లోడ్‌ చేసుకోగలరా? పోనీ దానికి సంబంధించిన ప్రక్రియ అయినా మొదలైందా అంటే అదీ లేదు.. ఒక రకంగా ఇది లబి్ధదారుల ఇష్టానికే వదిలేశారన్న విమర్శలూ లేకపోలేదు.  

అనారోగ్య వ్యక్తులను గుర్తించడం కష్టమే.. 
ఇక 50 ఏళ్లలోపు వ్యక్తుల్లో బీపీ, షుగర్, ఇతరత్రా అనారోగ్య బాధితులకు కరోనా టీకా ఇవ్వాల్సి ఉంది. వీరిని గుర్తించడం అత్యంత సంక్లిష్టమైన వ్యవహారమని వైద్య, ఆరోగ్య వర్గాలు అంటున్నాయి. రాష్ట్రంలో చాలా మందికి తమకు కనీసం బీపీ, షుగర్‌ ఉందన్న విషయం కూడా తెలియదు. ఒకవేళ ఎవరికైనా అనారోగ్యమున్నా అందులో చాలామందికి కోవిన్‌ యాప్‌లో ఎలా అప్‌లోడ్‌ చేసుకోవాలో తెలియదు. ఈ సమస్యలను అధిగమించి జాబితా ఎలా తయారు చేయాలో కూడా అధికారులకు స్పష్టత లేదు. 50 ఏళ్ల లోపున్న అనారోగ్య బాధితులు 6 లక్షల మంది వరకు ఉండొచ్చని ఓ అంచనా. అయితే 50 ఏళ్లు పైబడినవారు, ఆలోపులో ఆరోగ్య సమస్యలున్న వారి జాబితా తయారీపై స్పష్టత లేదు. దీనికి సంబంధించి ఎలాంటి మార్గదర్శకాలు రాలేదని అధికారులు అంటున్నారు. ఒకవేళ గ్రామాల్లో, పట్టణాల్లో ఏఎన్‌ఎంలు, ఆశ కార్యకర్తలు, ఇతర వైద్య సిబ్బందితో ఇంటింటికీ తిరిగి వారి వివరాలు సేకరించాలన్న ఇంత తక్కువ సమయంలో చేయగలరా అన్నది అనుమానమేనని చెబుతున్నారు.  

సక్సెస్‌ అయ్యేనా..? 
యాప్‌లో రిజిస్ట్రేషన్‌.. క్యూలో నిలబడి వ్యాక్సిన్‌ వేయించుకోవడం.. సుదూర ప్రాంతాలకు వెళ్లి టీకా పొందడం.. ఇలాంటి సంక్లిష్టతలుంటే వ్యాక్సిన్‌ లబ్ధిదారులు ముందుకురారన్నది ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు జరుగుతున్న చర్చ. పైగా కరోనా వ్యాక్సిన్‌పై ఇప్పుడు సోషల్‌ మీడియాలో వ్యతిరేక ప్రచారం జరుగుతోంది. దేశంలో 53 శాతం మంది వ్యాక్సిన్‌ను వేసుకోబోమని ఇటీవల ఒక ఆన్‌లైన్‌ హెల్త్‌ పోర్టల్‌ నిర్వహించిన సర్వేలో తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ప్రజల్లో ఎలాంటి అనుమానాలుంటాయో, వాటిని ఎలా నివృత్తి చేయాలో కూడా చెప్పింది. ఈ నేపథ్యంలో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను లబ్ధిదారుల ఇష్టానికే వదిలేస్తే అది సక్సెస్‌ కాదని నిపుణులు అంటున్నారు. వ్యాక్సిన్‌కు ఒప్పించడమే సమస్యగా మారుతున్న నేపథ్యంలో ఇలాంటి సంక్లిష్టతలు వ్యాక్సినేషన్‌ ప్రక్రియకు అడ్డుగా మారుతాయని వైద్య వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై వైద్య, ఆరోగ్యశాఖ మేధోమథనం చేస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement