వంట నూనె ఒంటికి మంచిదా? ఎంతవరకు! ఐఐసీటీ మాజీ శాస్త్రవేత్త క్లారిటీ | Indian Refined Oils Safe For Cooking Which Has FSSAI License | Sakshi
Sakshi News home page

వంట నూనె వాడితే మంచిదా? వాడకపోతే మంచిదా? క్లారిటీ ఇచ్చిన ఐఐసీటీ మాజీ శాస్త్రవేత్త

Published Wed, Feb 22 2023 3:08 AM | Last Updated on Wed, Feb 22 2023 9:28 AM

Indian Refined Oils Safe For Cooking Which Has FSSAI License - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వంట నూనె వినియోగంపై భిన్న వాదనలు ఉన్నాయి. నూనె లేని ఆహార పదార్థాలు తింటేనే ఆరోగ్యకరమని కొందరు అంటారు. అసలు నూనెలే వాడకపోవడం అనారోగ్యానికి దారి తీస్తుందని మరికొందరు చెబుతుంటారు. మూడు, నాలుగు దశాబ్దాల క్రితం వరకు గానుగ (కోల్డ్‌ ప్రెస్‌) నూనెనే ఎక్కువగా వినియోగించేవారు. క్రమంగా రిఫైన్డ్‌ (శుద్ధి చేసిన) ఆయిల్స్‌ మార్కెట్‌ను ఆక్రమించాయి.

ప్యాకేజ్డ్‌ నూనెల వినియోగం పెరిగిపోయింది. కొన్నాళ్లకు శుద్ధి చేసిన నూనెలు మంచివి కావనే వాదన మొదలైంది. దీంతో మళ్లీ గానుగ నూనె వినియోగం మొదలైంది. అయితే గానుగ నూనెలే మంచివని, శుద్ధి చేసిన నూనెలు మంచివి కావన్న ప్రచారం ఏమాత్రం సరికాదని భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ)లోని ఆయిల్స్, ఫ్యాట్స్‌ సైంటిఫిక్‌ ప్యానెల్‌ జాతీయ చైర్మన్, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ (ఐఐసీటీ) మాజీ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ ఆర్‌బీఎన్‌ ప్రసాద్‌ అంటున్నారు.

‘అసలు నూనెలే వాడకపోవడం అనారోగ్యానికి దారితీస్తుంది. సాధారణంగా ప్రతి మనిషికి రోజుకు 2 వేల వరకు కేలరీలు కావాలి. కష్టపడి పని చేసేవారికి 2,500 వరకు కేలరీలు అవసరం. అయితే అందులో 25 నుంచి 30 శాతం నూనెలు, కొవ్వుల ద్వారానే రావాలి..’అని స్పష్టం చేశారు. అయితే ఎలాంటి నూనె మంచిది, ఎంపికలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి తదితర అంశాలపై ఆయన ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. 

85 శాతం శుద్ధి చేసిన వంట నూనెలే.. 
ప్రస్తుతం ప్రపంచంలో వాడుతున్న వంట నూనెల్లో 85 శాతం శుద్ధి చేసినవే. రిఫైన్డ్‌ నూనెల్లో వాడే రసాయనాలు అన్నీ కోడెక్స్‌ (నాణ్యతా ప్రమాణాలు నిర్ధారించే అంతర్జాతీయ సంస్థ) నిర్ధారించినవే. కోడెక్స్‌ సహా మన దేశంలోని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ సిఫారసు చేసిన హాని చేయని రసాయనాల్ని రిఫైనింగ్‌లో వాడుతున్నారు. కాబట్టి ఎలాంటి భయం లేకుండా రిఫైన్డ్‌ ఆయిల్స్‌ వాడుకోవచ్చు.

అందులో విషం ఉంటుందనేది ఏమాత్రం నిజం కాదు. అంతేకాదు కొన్ని గింజల నుంచి గానుగ పద్ధతిలో నూనెను తయారు చేయలేం. వేరుశనగ, నువ్వులు, ఆవాలు, కొబ్బరి, కుసుమ గింజలనే గానుగ చేసి నూనె తీయవచ్చు. కానీ పామాయిల్, సోయాబీన్‌ నూనెలను ఆ పద్ధతిలో తీయలేం. వాటిని రిఫైన్‌ చేయకుండా వాడలేం. ప్రపంచంలో మూడింట రెండో వంతు పామాయిల్, సోయాబీన్‌ నూనెలనే వాడతారు.

మన దేశంలో ఏడాదికి 23 మిలియన్‌ టన్నుల నూనె వాడతారు. కానీ మనం 8 మిలియన్‌ టన్నులే ఉత్పత్తి చేస్తున్నాం. మిగిలినది దిగుమతి చేసుకుంటున్నాం. కాబట్టి గానుగ నూనె అందరికీ ఇవ్వలేం. గానుగ నూనె మంచిది కాదని కూడా చెప్పడం లేదు. శుద్ధి చేసిన నూనెలు మంచివి కావని ప్రచారం చేయడమే తప్పు.  

ఎక్కువ రాదు కాబట్టి గానుగ నూనె ధర ఎక్కువ 
గింజలను గానుగ ఆడించినప్పుడు వాటి నుంచి నూనె మొత్తం రాదు. దాదాపు 25 శాతం చెక్కలోనే ఉండిపోతుంది. కాబట్టి వాటి ధర ఎక్కువ ఉంటుంది. ఇక శుద్ధి చేసిన నూనెలను తయారు చేసే కంపెనీలు పెద్దమొత్తంలో తక్కువ ధరకు ముడిపదార్థాలు కొంటాయి. పైగా యంత్రాలతో నూనె మొత్తాన్నీ తీస్తాయి. అందువల్ల వాటి ధర తక్కువగా ఉంటుంది.

ఇక గానుగ చేసేందుకు వాడే గింజల్లో పుచ్చిపోయినవి ఉంటే వాటి నూనె విషంగా మారుతుంది. ఉదాహరణకు పుచ్చిపోయిన పల్లీలతో నూనె తీస్తే అందులో ఎఫ్లాటాక్సిన్‌ అనే విష పదార్థం ఉంటుంది. ఇది క్యాన్సర్‌ వంటి ప్రమాదకరమైన వ్యాధులకు కారణం అవుతుంది. అయితే అవే గింజలను రిఫైన్‌ చేస్తే ఎఫ్లాటాక్సిన్‌ పోతుంది. అప్పుడు అది మంచిదవుతుంది. పెద్ద పెద్ద కంపెనీలు తయారు చేసే రిఫైన్డ్‌ నూనెల్లో కల్తీ జరుగుతుందని చెప్పడం నిజం కాదు.  

ఆమ్లాలు సమాన నిష్పత్తిలో ఉండాలి 
నూనెల్లో సాచురేటెడ్‌ ఫ్యాటీ ఆమ్లాలు, మోనో అన్‌ సాచురేటెడ్‌ ఫ్యాటీ ఆమ్లాలు, పాలి అన్‌సాచురేటెడ్‌ ఫ్యాటీ ఆమ్లాలు ఉండాలి. ఈ మూడూ సమాన నిష్పత్తిలో ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) స్పష్టం చేసింది. ఈ మూడూ సమతూకంలో లేకపోతే అనేకరకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. పాలి అన్‌సాచురేటెడ్‌ ఫ్యాటీ ఆమ్లాల్లో ఒమెగా–3, ఒమెగా–6 ఆమ్లాలుండాలి.

ఒమెగా–3 ఆమ్లాలు అన్ని నూనెల్లో ఉండవు. కేవలం సోయాబీన్, ఆవనూనెల్లో మాత్రమే 5–10 శాతం ఉంటాయి. ఒమెగా–3 లేని నూనెలను వాడితే శారీరక రుగ్మతలు తలెత్తుతాయి. కాబట్టి ఒమెగా–3 ఉన్న నూనెలను వాడనివారు, ఇతర నూనెలు వాడుతున్నవారు తప్పనిసరిగా అవిసె గింజలు దోరగా వేయించినవి రోజూ కొద్దిగా తింటే సరిపోతుంది.

అవిసె గింజల్లో 55 శాతం ఒమెగా–3 ఆమ్లాలుంటాయి. నిత్యం చేపలు తినేవారికి ఒమెగా–3 లభిస్తుంది. కానీ మన వద్ద నిత్యం చేపలు తినే పరిస్థితి ఉండదు. అలాగే అందరూ చేపలు తినరు. కాబట్టి ఆ ఆమ్లాలున్న నూనెలు వాడాలి. ఆలివ్‌నూనెలో మోనో అన్‌సాచురేటెడ్‌ ఫ్యాటీ ఆమ్లాలు దాదాపు 75 శాతం ఉంటాయి. సన్‌ఫ్లవర్, సోయాబీన్, మొక్కజొన్న, పత్తి గింజ, అవిసె నూనెల్లో పాలి అన్‌సాచురేటెడ్‌ ఫ్యాటీ ఆమ్లాలు 50 శాతం కంటే ఎక్కువగా ఉంటాయి. కొబ్బరి నూనెలో 90 శాతం, పామాయిల్‌లో 50 శాతం వరకు సాచురేటెడ్‌ ఫ్యాటీ ఆమ్లాలుంటాయి.  

నూనెల మిక్సింగ్‌ మంచిది 
రెండు అంతకంటే ఎక్కువ నూనెలను కలిపి వాడాలి. ఒక నూనెలో మూడు ఫ్యాటీ ఆమ్లాలు సమాన నిష్పత్తిలో లేనప్పుడు, సమాన నిష్పత్తిలోకి తీసుకొచ్చేలా ఏవైనా రెండు అంతకంటే ఎక్కువ నూనెలు ఇంట్లోనే కలిపి వాడుకోవచ్చు. ప్రతి నూనె ప్యాకెట్‌ మీద ఆ మూడు ఫ్యాటీ ఆమ్లాల నిష్పత్తి ఉంటుంది. మూడు ఫ్యాటీ ఆమ్లాల నిష్పత్తితో పాటు నూనెల్లో అతి తక్కువ పరిమాణంలో ఉండే కొన్ని గామా ఒరిజినాల్, టోకోఫిరాల్స్‌ (విటమిన్‌–ఈ), పైటోస్టిరాల్‌ వంటి పదార్థాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

ఉదాహరణకు రైస్‌బ్రాన్‌లో ఒరిజనాల్‌ అనే పదార్థం ఉంటుంది. దీనివల్ల గుండెకు మేలు జరుగుతుంది. దాదాపు అన్నింటిల్లోనూ పైటోస్టిరాల్‌ ఉంటుంది. దీనికి కొలెస్టరాల్‌ తగ్గించే స్వభావం ఉంది. నువ్వుల నూనెలో సిసీమోల్, సిసీమోలిన్‌ అనే యాంటీæ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవన్నీ లేబిలింగ్‌లో చూసుకోవాలి. ప్యాకింగ్‌పై ఉన్న అధికారిక సమాచారంతోనే దాన్ని వాడాలా లేదా తెలుసుకోవచ్చు.  

నూనె లూజ్‌గా అమ్మకూడదు
లూజ్‌ ఆయిల్‌ అమ్మడం నిషేధం. చట్ట ప్రకారం నేరం. లూజ్‌ అంటే ప్యాక్‌ చేయకుండా కొలిచి అమ్మే నూనె. దీనిని కొనకూడదు. ప్యాకేజ్డ్‌ నూనెనే కొనుగోలు చేయాలి. ప్యాకెట్లు, ప్లాస్టిక్‌ సీసాల్లో విక్రయించే నూనెలకు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్స్‌ ఉండాలి. పోషక విలువలు, కొలెస్ట్రాల్‌ వంటివి ఎంతున్నాయో ముద్రించాలి. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్స్‌ ఉన్న బ్రాండెడ్‌ కంపెనీలవే వాడాలి.

ప్యాకింగ్‌ను ట్యాంపరింగ్‌ చేసినట్లు ఉంటే బ్రాండెడ్‌ కంపెనీల నూనెలనైనా కొనకూడదు. సైంటిఫిక్‌ రిఫరెన్స్‌ లేబిలింగ్‌ ఉందో లేదో చూసుకోవాలి. గడువు తేదీ కూడా చూసుకోవాలి. లైసెన్స్‌ లేకున్నా, నిబంధనల ప్రకారం నూనె ప్యాకెట్లపై వివరాలు లేకున్నా ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ టోల్‌ ఫ్రీ నంబర్‌ (1800112100) కు ఫోన్‌ చేయవచ్చు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement