ఈగిల్ రోబో పనితీరును ఆసక్తిగా చూస్తున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి తదితరులు
‘ఇందుగలడందు లేడని సందేహంబు వలదు.. ఎందెందు వెదికినా అందందే గలడు’ అన్నట్టు రెస్టారెంట్స్ నుంచి హాస్పిటల్స్ వరకు సేవలందిస్తున్న రోబోటిక్ టెక్నాలజీ విద్యారంగంలోనూ తన ఉనికి చాటుతోంది. పాఠాలు చెప్పే ఉపాధ్యాయుల స్థానంలోకీ మర బొమ్మలు ప్రవేశించాయి. భారత తొలి రోబో ‘ఈగిల్’ను రూపొందించినట్టు హైదరాబాద్‌కు చెందిన ఓ ప్రైవేట్ స్కూల్ చెప్పింది.
సాక్షి, హైదరాబాద్: నగరానికి చెందిన ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్ మొదటి టీచింగ్ రోబో ‘ఈగిల్’ను పరిచయం చేసింది. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుని వారికి 30 రోబోలను అందజేశారు. హైదరాబాద్, బెంగళూరు, పుణేలలోని తమ స్కూల్స్‌లోనూ, ఒక్కో దగ్గర ఏడు చొప్పున రోబోలను ఏర్పాటు చేసి, బోధిస్తున్నట్టు స్కూల్ ప్రతినిధులు అంటున్నారు. ఈ నేపథ్యంలో మన ప్రభుత్వ పాఠశాలల్లోనూ నాణ్యమైన విద్యను అందించేందుకు రోబోలను అందుబాటులోకి తెచ్చే అవకాశాన్ని పరిశీలించాలని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డిని కోరారు. ఈ మేరకు ‘ఈగిల్ రోబో’ పనితీరును మంత్రి కార్యాలయంలో ఆదివారం ప్రదర్శించారు.
ప్రత్యేకతలివే...
లాంగ్వేజెస్‌తోపాటుగా సైన్స్, హ్యుమానిటీస్, తదితర సబ్జెక్టులను బోధించడానికి ‘ఈగిల్’ రోబోలు ప్రోగ్రామ్ చేయబడ్డాయి. ఇది భావ వ్యక్తీక రణతో పాటు, ముఖాముఖిగానూ చురుకుగా ఉంటుంది. తరగతి గదిలో ఎవరిపైనా ఆధారపడకుండా గ్రేడ్ 5 నుంచి 11వ తరగతి విద్యార్థులకు బోధించగలదు. 30కిపైగా విభిన్నమైన భాషలలో విద్యను అందిస్తాయి. విద్యార్థుల సందేహాలను నివృత్తి కూడా చేస్తాయి. అనలటిక్స్ సహాయంతో తరగతి చివరి దశలో రివిజన్స్ నిర్వహించగలవు. తమ మొబైల్, ట్యాబ్ లేదా ల్యాప్ టాప్‌లతో రోబో కంటెంట్‌తో విద్యార్థులు అనుసంధానం కావచ్చు. రోబో ప్యాకేజీ ప్రీలోడెడ్ కంటెంట్‌ను కలిగి ఉంటుంది. దీన్ని వివిధ భాషల్లో విభిన్న పాఠ్యాంశాల కోసం రూపొందించుకోవచ్చు. టీచర్ ట్రైనింగ్ ప్యాకేజీ ద్వారా రోబోల వినియోగం గురించి ఉపాధ్యాయులకు శిక్షణనూ ఇస్తుంది.
గుణాత్మక మార్పు కోసం...
విద్యార్జనలో సాంకేతికత సహకారాన్ని తీసుకురావాలనే ఆలోచనే రోబో తయారీకి మమ్మల్ని ప్రేరేపించింది. ఇతర రంగాల్లో మాదిరిగానే, విద్యారంగంలోనూ మానవ మేధస్సు, కృత్రిమ మేధస్సు మిళితమైతే గుణాత్మక మార్పు వస్తుంది. హ్యూమనాయిడ్ రోబోలు టీచర్‌కి బోధించడంలో సహాయం చేస్తాయి
– రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ అర్జున్ రే, ఇండస్ స్కూల్ నిర్వాహకులు
ఉపాధ్యాయుల కొరత తీరుతుంది..
ఈ రోబోల వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతను తగ్గించొచ్చు. విద్యలో నాణ్యతను మెరుగుపరచొచ్చు. విద్యార్థులు భవిష్యత్ సవాళ్లను స్వీకరించేలా తీర్చిదిద్దడానికి వీలు కల్పిస్తుంది. దేశ వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలోని విద్యా సంస్థలకు ‘ఈగిల్’ రోబోలను అందుబాటులో ఉంచాలని భావిస్తున్నాం.
–అపర్ణ ఆచంట, ఇండస్ స్కూల్ నిర్వాహకులు
Comments
Please login to add a commentAdd a comment