సాక్షి, హైదరాబాద్: ఇంటర్ బోర్డ్ లీల మరొకటి వెలుగులోకొచ్చింది. ఫెయిల్ అయిన విద్యార్థి రీ వ్యాల్యుయేషన్ జరిపిస్తే, ఏకంగా 31 మార్కులు తేడా వచ్చాయి. ఒకటి, అరా ఓకే కానీ, ఇన్ని మార్కుల తేడా ఎలా వచ్చిందని ఇంటర్ బోర్డ్ అధికారులు సైతం ముక్కున వేలేసుకుంటున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లకు చెందిన ముస్కాన్ బేగం ఈ ఏడాది మే నెలలో జరిగిన ఇంటర్ ద్వితీయ వార్షిక పరీక్షలకు హాజరైంది.
అన్ని సబ్జెక్టులు కలిపి ఆమెకు 741 మార్కులొచ్చాయి. జువాలజీలో 10 మార్కులే రావడంతో ఫెయిల్ అయినట్టు ఫలితం వచ్చింది. దీంతో కంగారుపడ్డ బాలిక రీ వ్యాల్యుయేషన్‌కు వెళ్లింది. పూర్తి చేసిన అనంతరం 41 మార్కులు వచ్చినట్టు తేల్చారు. అంటే 31 మార్కులు తక్కువ వేసి, ఆమెను ఫెయిల్ చేశారు. ఇంటర్ బోర్డ్ నిర్వాకం కారణంగా తాను ఇన్ని రోజులు తీవ్ర మనోవేదనకు గురయ్యాయని ముస్కాన్ తెలిపింది.
రీ వ్యాల్యుయేషన్‌కు రూ.600, సప్లిమెంటరీ పరీక్షకు రూ.500 చెల్లించానని, నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన తనకు ఇది కూడా భారమేనని తెలిపింది. ఇందుకు బాధ్యులైన వారిపై చర్య తీసుకోవాలని కోరింది. ఘటనతో కంగుతిన్న బోర్డ్ అధికారులు పేపర్ మూల్యాంకనం చేసిన అధ్యాపకుడిపై చర్యలకు సిద్ధమయ్యారు. నిబంధనల ప్రకారం అతనికి రూ. 5 నుంచి 10 వేలు జరిమానా, మూడేళ్లపాటు మూల్యాంకన బాధ్యతల నుంచి తప్పించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కాగా, విద్యార్థుల భవిష్యత్‌తో ముడిపడి ఉన్న పరీక్షల విభాగంలో కొంతమంది జోక్యం వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని తెలంగాణ ఇంటర్ విద్య పరిరక్షణ సమితి కన్వీనర్ మాచర్ల రామకృష్ణ గౌడ్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment