►సబ్జెక్టుల వారీగా ప్రథమ సంవత్సరంలో విద్యార్థులకు ఎన్ని మార్కులు వచ్చాయో.. అవే మార్కులను సెకండియర్‌లోనూ కేటాయించే అవకాశం ఉంది.విద్యార్థులు రాసిన ►రికార్డ్ బుక్‌ల ఆధారంగా ప్రాక్టికల్ మార్కులను ఇవ్వాలని అధికారుల ఆలోచన.
►బైపీసీ విద్యార్థులకు ఒక్కో సబ్జెక్టులో గరిష్టంగా 30 మార్కుల చొప్పున నాలుగు సబ్జెక్టులకు 120 మార్కులు, ఎంపీసీ విద్యార్థులకు రెండు సబ్జెక్టులకు కలిపి 60 మార్కులను కేటాయించే యోచన.
►ఫస్టియర్‌లో ఫెయిలైనవారికి ఆయా సబ్జెక్టుల్లో 45 శాతం మార్కులు ఇవ్వాలని.. పైచదువులకు వెళ్లేవారికి కనీస మార్కుల నిబంధన సమస్య రాకుండా చూడాలనే ప్రతిపాదన!
►మార్కులపై ఏం చేయాలన్న దానిపై కమిటీ. ఆ కమిటీ సూచనల మేరకు తుది నిర్ణయం తీసుకునే అవకాశం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసింది. కరోనా నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా పరీక్షలు రద్దు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించిన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి బుధవారం ప్రకటించారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో విద్యార్థులు చదవడమే ఓ పరీక్షగా మారిందని.. దానికితోడు పరీక్షల నిర్వహణ సమస్య తలెత్తిందని ఆమె చెప్పారు. ‘‘సీఎం కేసీఆర్ ఇంతకు ముందే.. విద్యార్థుల ఆరోగ్యం, తల్లిదండ్రుల ఆందోళనను దృష్టిలో పెట్టుకొని పదో తరగతి పరీక్షలు రద్దు చేసి, ఇంటర్నల్స్ ఆధారంగా మార్కులు కేటాయించాలని ఆదేశించారు. తర్వాత ఇంటర్ ఫస్టియర్ పరీక్షలను కూడా రద్దుచేసి, విద్యార్థులను సెకండియర్‌కు ప్రమోట్ చేశారు. ఇంటర్ సెకండియర్ పరీక్షలు నిర్వహించాలని అధికారులు ప్రతిపాదించినా.. విద్యార్థుల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టే ప్రయత్నం వద్దని సీఎం సూచించారు. తల్లిదండుల ఆందోళన, విద్యార్థుల ఆవేదనను దృష్టిలో పెట్టుకొని పరీక్షలు రద్దు చేయాలన్నారు.ఈ మేరకు పరీక్షలు రద్దు చేస్తున్నాం..’’ అని సబిత ప్రకటించారు.
విధి విధానాలపై కమిటీ..
విద్యార్థులను ఎలా పాస్ చేయాలన్న దానిపై విధి విధానాలను త్వరలోనే ప్రకటిస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఇందుకోసం కమిటీ వేశామని, రెండు మూడు రోజుల్లో కమిటీ నివేదిక వస్తుందని, త్వరలోనే ఫలితాలను ప్రకటిస్తామని వెల్లడించారు. విద్యార్థుల ఫస్టియర్ మార్కుల ఆధారంగా సెకండియర్‌లో మార్కులు వేసి ఫలితాలను వెల్లడిస్తామన్నారు. ఇప్పుడు ఇచ్చే మార్కులతో సంతృప్తి చెందని విద్యార్థులు మళ్లీ పరీక్షలు రాయాలనుకుంటే పరిస్థితులు చక్కబడిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని వివరించారు. కాగా.. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం కూడా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) 12వ తరగతి పరీక్షలను ఇటీవల రద్దు చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోనూ ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షల రద్దు వైపే ప్రభుత్వం మొగ్గు చూపింది.
కనీస మార్కుల సమస్య రాకుండా..
గత ఏడాది మార్చిలో నిర్వహించిన ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షల్లో దాదాపు 1.99 లక్షల మంది విద్యార్థులు ఫెయిలయ్యారు. అందులో కొందరు ఒక సబ్జెక్టు ఫెయిల్ కాగా.. మరికొందరు ఎక్కువ సబ్జెక్టుల్లో ఫెయిలయ్యారు. వారికి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించలేదు. ప్రస్తుతం వారంతా సెకండియర్ పూర్తి చేస్తున్నారు. ఇప్పుడు కూడా పరీక్షలు నిర్వహించని నేపథ్యంలో.. ఫస్టియర్ ఫెయిలైన సబ్జెక్టుల్లో కనీస మార్కులను కేటాయించేలా ఇంటర్ బోర్డు చర్యలు చేపడుతోంది. వారికి ఆయా సబ్జెక్టుల్లో 45 శాతం మార్కులు వేసి పాస్ చేసే అవకాశం ఉన్నట్టు తెలిసింది. అంతేగాకుండా సెకండియర్‌లోనూ 45 శాతం మార్కులు వేయాలని.. పైచదువులకు వెళ్లినపుడు కనీస అర్హత మార్కుల నిబంధనతో ఇబ్బంది రాకుండా చూడాలని భావిస్తున్నట్టు సమాచారం.
జూలై మధ్యలో నిర్వహించాలనుకున్నా..
వాస్తవానికి జూలై మధ్యలో ద్వితీయ సంవత్సర పరీక్షలను నిర్వహించేందుకు ఇంటర్ బోర్డు గతంలోనే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. రాష్ట్రం ప్రభుత్వం కూడా దీనిపై కేంద్ర ప్రభుత్వానికి నివేదికను అందజేసింది. జూలై మధ్యలో పరీక్షలు నిర్వహించి ఆగస్టులో ఫలితాలు వెల్లడిస్తామని పేర్కొంది. పరీక్ష సమయాన్ని 90 నిమిషాలకు కుదిస్తామని, సగం ప్రశ్నలకే జవాబులు రాసేలా చర్యలు చేపడతామని పేర్కొంది. అయితే కేంద్రం సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్షలను రద్దు చేయడం, కరోనా పూర్తిగా నియంత్రణలోకి రాకపోవడం, థర్డ్ వేవ్ ప్రభావం పిల్లలపై ఉండొచ్చన్న అంచనాల నేపథ్యంలో పరీక్షల రద్దుకే రాష్ట్ర ప్రభుత్వం మొగ్గుచూపింది. అధికారుల కమిటీ ఇచ్చే విధివిధానాల మేరకు ఇంటర్ బోర్డు మార్కులను కేటాయించి ఫలితాలను వెల్లడించనుంది.
చదవండి: తెలంగాణ హైకోర్టులో జడ్జిల సంఖ్య పెంపు
లాక్‌డౌన్: హైదరాబాద్ మెట్రో రైళ్ల వేళల్లో మార్పులు
Comments
Please login to add a commentAdd a comment