వన్‌డే ఫార్మింగ్‌ ఫార్మ్‌ టూరిజం యువ‘సాయం’ | IT Employees One Day Farming And Farm Tourism In Telangana | Sakshi
Sakshi News home page

వన్‌డే ఫార్మింగ్‌ ఫార్మ్‌ టూరిజం యువ‘సాయం’

Published Tue, Jan 17 2023 12:38 AM | Last Updated on Tue, Jan 17 2023 3:35 PM

IT Employees One Day Farming And Farm Tourism In Telangana - Sakshi

ఘట్‌కేసర్‌లోని వ్యవసాయ క్షేత్రంలో పని చేస్తున్న ఐటీ ఉద్యోగులు 

సాక్షి, హైదరాబాద్‌: నేటి ఆధునిక సాంకేతిక యుగం ఐటీ చదువులు మొదలు అంతరిక్షజ్ఞానం వరకు ఎదిగిపోయింది. కానీ మనిషి బతకడానికి మూలాధారమైన వ్యవసాయాన్ని మాత్రం అన్ని రంగాల కు దీటుగా అభివృద్ధి చేయలేకపోతోంది. ఆహార భద్రత మరింత అవసరమని ప్రపంచ వేదికలు చెబుతున్నా నిర్లక్ష్యానికి గురవుతోంది.

ఇలాంటి తరుణంలో నగరానికి చెందిన ముగ్గురు యువకులు నగర శివారు ప్రాంతంలో ‘సాయిల్‌ ఈజ్‌ అవర్‌ సోల్‌’ అనే వ్యవసాయ క్షేత్రాన్ని సృష్టించి నేటితరం యువతను వ్యవ‘సాయం’వైపునకు మళ్లించేలా వన్‌డే ఫార్మింగ్, ఫార్మ్‌ టూరిజమంటూ వినూత్న కార్యక్రమాలను చేపట్టారు. ఐటీ ఉద్యో గులతోపాటు నగరంలోని విద్యార్థులను తమ క్షే త్రానికి తీసుకెళ్లి వ్యవసాయంపై అవగాహన కల్పి స్తున్న ఈ యువ కర్షకులను ‘సాక్షి’ పలకరించింది.

మూడేళ్లు శ్రమించి...
ఘట్‌కేసర్‌ సమీపంలో 18 ఎకరాల్లో ఈ ప్రకృతి వ్యవసాయ క్షేత్రం పురుడుపోసుకుంది. ఇక్కడ వరితోపాటు తృణధాన్యాలు, పప్పుదినుసులు, కూరగాయలు, ఫలాలు, ఔషధాలు సాగు చేస్తున్నారు. బీటెక్‌ అగ్రికల్చర్‌ చదివిన రాకేశ్, ఐటీ రంగంలో అనుభవమున్న మురళీధర్‌రావు, శ్రీనివాస్‌ అనే యువ కర్షకులు ఈ క్షేత్రంలో నేచురల్‌ ఫార్మింగ్‌ చేస్తున్నారు.

వ్యవసాయాన్ని విద్యగా మార్చాలనే సంకల్పం, యువతను సాగు వైపునకు తీసుకురావాలనే సంకల్పంతో కలిసికట్టుగా మూడేళ్లు శ్రమించి ఈ క్షేత్రాన్ని తయారు చేశారు. వన్‌ డే ఫార్మింగ్‌లో భాగంగా వరినాట్లు వేయడం, నీటి పారుదల, కలుపుతీయడం, కూరగాయలు తుంచడం, చీడపీడల నివారణ తదితరాలను వివరిస్తూ రోజంతా రైతు పడే కష్టాన్ని వివరిస్తారు. ఈ ఫామ్‌ టూరిజం కోసం పలు ఐటీ కంపెనీల నుంచి పలువురు వీకెండ్‌ సెలవుల్లో ఇక్కడ వాలిపోతున్నారు.

చోటా కిసాన్‌...
తినే ఆహారం ఎక్కడి నుంచి వస్తుందో కూడా తెలియని నగర విద్యార్థులకు పంటలు ఎలా పండుతాయనే విషయాలపై అవగాహన కల్పిస్తున్నారు. ప్రాజెక్టులో భాగంగా పాఠశాలలు తమ విద్యార్థులకు ఇక్కడకు తెస్తున్నా యి. మట్టి తాకితే అపరిశుభ్రం అనే భావనను తొలగించి మట్టిలో యాక్టినో మైసిటిన్‌ వంటి బ్యాక్టీరియాలుంటాయని చెబుతూ అవి చేసే సాయాన్ని వివరిస్తున్నారు. బురద మట్టిలో కబడ్డీ, ఫుట్‌బాల్‌ వంటి మడ్‌ గేమ్స్‌ ఏర్పాటు చేసి మళ్లీ మట్టికి మనుషులను దగ్గర చేస్తున్నారు. వ్యవసాయ డిప్లొమా, అగ్రికల్చర్‌ బీటెక్‌ విద్యార్థులకు ప్రాక్టికల్‌ నాలెడ్జ్‌ కూడా ఉండాలని ఇంటర్న్‌షిప్‌ ప్రాజెక్టులు నిర్వహిస్తున్నారు. 

గత వైభవానికి పునఃనిర్మాణం
వ్యవసాయంలో గత వైభవా న్ని, పురాతన పద్ధతులను ఈ తరానికి చేరువ చేయాలనే లక్ష్యంతో ఈ నేలను లీజుకు తీసుకున్నాం. ఇంటిగ్రేటెడ్‌ ఫార్మింగ్‌ విధానంతో పూర్వం ఉండే రచ్చబండ, మంచె, తాటిపాకలు ఏర్పాటు చేసి సహజమైన జీవనాన్ని రూపొందిస్తున్నాం. సత్తుపల్లి మదర్‌ థెరిస్సా ఇంజనీరింగ్‌ కాలేజీ, సంగారెడ్డి రత్నపురి కాలేజీ సహా వివివిధ ప్రాంతాల నుంచి అగ్రికల్చర్‌ డిప్లొమా, పాఠశాలల విద్యార్థులు వస్తున్నారు.     
– రాకేశ్, క్షేత్ర వ్యవస్థాపకుడు

ఫార్మ్‌ టూరిజం
ఐటీలో ఉద్యోగం చేశాను, వ్యాపారం చేస్తున్నాను. కానీ మన మూలాలైన వ్యవసాయం అంటే అమితమైన ఇష్టం. ఇందులో అవగా హన కోసం ఈ క్షేత్రాన్ని సందర్శించాను. ఎన్నో మెళకువలు తెలుసు కున్నాను. ఒకే వ్యవసాయ క్షేత్రంలో విభిన్న పంటలకు సంబంధించిన విషయాలను తెలుసుకోవచ్చు. ఈ ఫార్మ్‌ టూరిజాన్ని పిల్లలకు చేరువ చేయాలని విరివిగా వస్తున్నాను. 
–రామక్రిష్ణ, బీహెచ్‌ఈఎల్‌

సంతృప్తినిచ్చే సమీకృత వ్యవసాయం
రసాయనాలు వాడకుండా కూర గాయలు, వరి, పసుపు, అల్లం, కంది, కుసుమ, పశుగ్రాసం సాగు చేస్తున్నాం. వీటితోపాటు మామిడి, జామ, సపోట, పనస, ఉసిరి, సీతాఫలాలం, అలాగే టేకు, మహాగని, సాండిల్‌–రోజ్‌ వుడ్‌ వంటి కలప మొ క్కలనూ పెంచుతున్నాం. సమీకృత వ్యవసాయంలో భాగంగా ఆవులు, కోళ్లు,  కుందేళ్లు, చేపలు పెంచుతూ.. వీటి ద్వారా వచ్చే ఎరువులను సేంద్రియ ఎరువులుగా వినియోగిస్తున్నాం. పది, ఇరవై ఏళ్లకు కూడా లాభాలను అందించేలా దీర్ఘకాలిక వృక్షాలనూ పెంచుతున్నాం. వ్యవసాయంలో అద్భుతమైన జీవితం ఉందని నిరూపిస్తున్నాం.     
–మురళీధర్‌రావు, క్షేత్ర వ్యవస్థాపకుడు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement