సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మంత్రి మల్లారెడ్డిపై ఐటీ దాడుల వ్యవహారం రాజకీయంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఇక, ఈ కేసులో భాగంగా ఐటీ అధికారులు మంత్రి మల్లారెడ్డి కుటుంబ సభ్యులతో సహా కాలేజీల్లో పనిచేసే వారిని కూడా విచారిస్తున్నారు.
అయితే, తాజాగా మంత్రి మల్లారెడ్డి కేసులో ఈడీకి ఐటీ అధికారులు లేఖ రాశారు. కాగా, మంత్రి మల్లారెడ్డి అవకతవకలకు పాల్పడ్డారని అధికారులు గుర్తించారు. సోదాలకు సంబంధించి పూర్తి నివేదికతో ఈడీకి ఐటీ అధికారులు లేఖ పంపించారు. ఇప్పటి వరకు సేకరించిన సాక్ష్యాలను ఐటీ.. ఈడీకి తెలిపింది. కాగా, ఈ కేసులో ఈడీ దర్యాప్తు అవసరం ఉందని ఐటీ అధికారులు భావిస్తున్నారు. ఇక, మెడికల్ సీట్లు, డొనేషన్లలో అవకతవకలు జరిగినట్టు ఐటీ అధికారులు గుర్తించారు. మనీలాండరింగ్ కోణంలో ఈడీ దర్యాప్తు జరపాలని ఐటీ అధికారులు ఈడీని కోరారు.
ఇదిలా ఉండగా.. మంత్రి మల్లారెడ్డి, ఆయన కుమారుడు, అల్లుడు ఇళ్లలో సోదాల సందర్భంగా ఐటీ అధికారులు 18 కోట్ల రూపాయలు, లాకర్లను పగులగొట్టి డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇక, దర్యాప్తులో భాగంగా విదేశాల్లో పెట్టుబడులు, విదేశాలకు డబ్బు తరలించినట్టు ఐటీ అధికారులు గుర్తించారు. దీంతో, ఈడీకి ఐటీ అధికారులు లేఖ రాసినట్టు సమాచారం. ఈడీ విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని ఐటీ భావిస్తున్నది. కాగా, ఈ లేఖపై ఈడీ అధికారులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment