సాక్షి, నిజామాబాద్: జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదులతో జరిగిన ఎదురు కాల్పుల్లో ఇందూరు బిడ్డ వీరమరణం పొందాడు. దీంతో ఆయన స్వగ్రామం వేల్పూరు మండలం కోమన్‌పల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి. కోమన్‌పల్లికి చెందిన ర్యాడా మహేష్ ప్రాథిమిక విద్యాభ్యాసం స్వగ్రామంలో జరిగింది. కుకునూర్‌లో పదో తరగతి వరకు చదువుకున్నాడు. నిజామాబాద్‌లోని ఓ ప్రేవేటు కళాశాలలో ఇంటర్ పూర్తి చేసిన అనంతరం కరీంనగర్ మిలిటరీ శిక్షణ సంస్థలో శిక్షణ తీసుకున్నాడు. ఐదేళ్ల క్రితం ఆర్మీకి ఎంపికయ్యాడు. గతేడాది డిసెంబర్‌లో ఇంటికి వచ్చి ఈ ఏడాది జనవరిలో తిరిగి వెళ్లాడు.
ఏడాదిన్నర క్రితం ప్రేమ వివాహం చేసుకున్న ఆయనకు ఇంకా సంతానం కాలేదు. అక్టోబర్ వరకు డెహ్రాడూన్‌లో విధులు నిర్వర్తించిన మహేష్ బదిలీపై జమ్మూకశ్మీర్‌కు వెళ్లాడు. ఆదివారం ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో వీరమరణం పొందాడు. ఈ వార్త తెలియగానే అతడి తల్లిదండ్రులు చిన్నరాజు, గంగమల్లు కన్నీరుమున్నీరయ్యారు.
అమర జవాన్‌కు నివాళి
జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులతో జరిగిన పోరులో వీరమరణం పొందిన ర్యాడా మహేష్‌కు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి నివాళి అర్పించారు. దేశ రక్షణ కోసం సైన్యంలో చేరి భారతావని కోసం మహేష్ చేసిన త్యాగం మరువలేనిదని కొనియాడారు. ‘వీర సైనికుడు మహేష్‌కు యావత్తు తెలంగాణ నివాళి అర్పిస్తోంది. ఎదురు కాల్పుల్లో వీరమరణం పొందిన మహేష్ తోటి సైనికులకు నా జోహార్లు. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా’అని పోచారం శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు.
ఆర్మీ జవాన్ మహేష్ వీర మరణం పట్ల మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత ఘన నివాళి అర్పించారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మహేష్ త్యాగం మరువలేనిదని అన్నారు. మహేష్ కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. మహేష్‌తో పాటు వీర మరణం పొందిన సైనికులకు జోహార్లు పలికారు. (చదవండి: కశ్మీర్‌లో కాల్పులు, ముగ్గురు జవాన్ల వీర మరణం)
Comments
Please login to add a commentAdd a comment