సమ్మె విరమణ ప్రకటన చేస్తున్న జేపీఎస్‌ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీకాంత్ గౌడ్
సాక్షి, హైదరాబాద్/తొర్రూరు: జూనియర్/ ఔట్‌సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులు (జేపీఎస్/ఓపీఎస్) నిరవధిక సమ్మెను విరమించారు. తమ డిమాండ్ల సాధనకు 16 రోజులుగా నిర్వహిస్తున్న సమ్మెను విరమిస్తున్నట్టు శనివారం రాత్రి పొద్దుపోయాక ప్రకటించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జేపీఎస్‌లను రెగ్యులరైజ్ చేస్తారనే సంపూర్ణ విశ్వాసం ఉందని, ఆ ధీమాతోనే సమ్మెను విరమిస్తున్నట్లు జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎలికట్టె శ్రీకాంత్‌గౌడ్, ఇతర జిల్లాల నాయకులతో కలిసి మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో వెల్లడించారు.
అంతకుముందు వరంగల్‌లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును తెలంగాణ పంచాయత్ సెక్రటరీస్ ఫెడరేషన్ (టీపీఎస్‌ఎఫ్) అధ్యక్షుడు ఎ.శ్రీకాంత్‌గౌడ్ తదితరులు కలిశారు. ఈ క్రమంలో తొలుత సమ్మె విరమించి వెంటనే విధుల్లో చేరాలని వారికి మంత్రి సూచించినట్టు సమాచారం. ఆది లేదా సోమవారాల్లో టీపీఎస్‌ఎఫ్ ప్రతినిధులతో ఆయా అంశాలపై చర్చిస్తామని మంత్రి హామీనిచ్చిన మీదట సోమవారం నుంచి విధుల్లో చేరనున్నట్టు సంఘం ప్రకటించింది.
– జేపీఎస్‌ల వ్యవస్థ సృష్టికర్త కేసీఆరే
కాగా, జూనియర్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులరైజ్ చేయాలనే డిమాండ్‌తో 16 రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక, శాంతియుత సమ్మె నిర్వహించామని, జేపీఎస్‌ల వ్యవస్థను సృష్టించిందే సీఎం కేసీఆర్ అని సంఘం అధ్యక్షుడు శ్రీకాంత్‌గౌడ్ అన్నారు. జేపీఎస్‌ల వల్లే తెలంగాణకు కేంద్రం నుంచి 73 అవార్డులు వచ్చాయని, మున్ముందు సైతం అదే రీతిన పనిచేసి మంచి ఫలితాలు రాబడుతామని తెలిపారు. ఈనెల 15వ తేదీ (సోమవారం) నుంచి యథావిధిగా విధుల్లో కొనసాగుతామని స్పష్టం చేశారు. సమ్మెకు సహకరించిన ప్రతి ఒక్క జూనియర్ పంచాయతీ కార్యదర్శికి ధన్యవాదాలు తెలిపారు.
ప్రభుత్వ కఠిన వైఖరి ప్రభావంతోనే విరమణ?
ప్రభుత్వం కఠినచర్యలకు దిగనున్నట్టు చేసిన ప్రకటన సమ్మె విరమణను ప్రభావితం చేసినట్టు తెలుస్తోంది. శనివారంలోగా విధుల్లో చేరకుండా గైర్హాజరైన జేపీఎస్, ఓపీఎస్‌ల తొలగింపుతో పాటు వారి స్థానాల్లో తాత్కాలిక పద్ధతుల్లో నియామకాలు చేపట్టాలని సీఎస్ ఎ.శాంతికుమారి ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో శనివారం రాత్రి దాకా సమ్మె కొనసాగించాలా వద్దా, విరమిస్తే పరిస్థితి ఏమిటి, కొనసాగిస్తే ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుందనే దానిపై టీపీఎస్‌ఎఫ్ రాష్ట్ర,జిల్లా కమిటీల్లో తీవ్రస్థాయిలో చర్చ సాగింది.
సమ్మెలో ఉన్న జేపీఎస్‌లలోనూ పునరాలోచన మొదలైంది. దీనికి తగ్గట్టే శనివారం సాయంత్రానికి పలుజిల్లాల్లో పెద్దసంఖ్యలోనే జేపీఎస్‌లు విధుల్లో చేరినట్టు పీఆర్ కమిషనరేట్‌కు నివేదికలు అందాయి. ఇది సమ్మె విరమణ దిశగా ప్రభావం చూపినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ప్రభుత్వం కూడా సమ్మె చేసిన జేపీఎస్‌ల పట్ల కొంత చూసీచూడనట్టు వ్యవహరించాలని భావిస్తున్నట్టు సమాచారం. జేపీఎస్‌ల సమ్మె విరమణ నేపథ్యంలో.. వారి స్థానంలో గతంలో జేపీఎస్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారి నియామకం, గ్రామాల్లో స్థానికంగా డిగ్రీ పాసై, కంప్యూటర్ పరిజ్ఞానమున్న వారిని నియమించే ప్రక్రియను కూడా నిలిపేసినట్టు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment