శనివారం రవీంద్రభారతిలో గానకోకిల పి.సుశీలకు ఘంటసాల శతజయంతి ప్రత్యేక పురస్కారం ప్రదానం చేస్తున్న భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ. చిత్రంలో ఏపీ ఎమ్మెల్యే ధర్మేంద్ర, తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మండలి బుద్ధ ప్రసాద్ తదితరులు
సాక్షి, హైదరాబాద్: తెలుగు భాష సంస్కృతీ ఔన్నత్యాలను తెలుగువారంతా కాపాడుకోవాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పిలుపునిచ్చారు. ప్రస్తుతం తెలుగు భాషా సంస్కృతులను దిగజార్చేలా చోటుచేసుకుంటున్న పరిణామాలను చూస్తూంటే తెలుగువాడిగా ఎంతో ఆవేదనకు గురవుతున్నట్లు చెప్పారు. అమర గాయకుడు ఘంటసాల వేంకటేశ్వరరావు శత జయంతి సందర్భంగా సంగమం ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో నిర్వహించిన వేడుకలకు జస్టిస్ ఎన్వీ రమణ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ప్రభుత్వాలు మద్దతు ఇవ్వట్లేదు...
ఘంటసాల వంటి మహానుభావులు తెలుగుభాషా సంస్కృతులను ఉన్నత శిఖరాలకు చేర్చారని, తెలుగు భాష ప్రతిష్టను పెంచారని జస్టిస్ ఎన్వీ రమణ కొనియాడారు. కానీ ప్రస్తుత పరిణామాలు బాధ కలిగిస్తున్నాయన్నారు. తెలుగు భాష ఔన్నత్యాన్ని దిగజార్చుకోవడం సరికాదన్నారు.
జీవన పోరాటంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం పరభాషలు నేర్చుకోవడం తప్పనిసరిగా మారినప్పటికీ అందుకోసం మన భాషను తక్కువ చేయొద్దని హితవు పలికారు. ప్రభుత్వాలు సైతం తెలుగు భాషాభివృద్ధికి మద్దతు ఇవ్వడం లేదని, ఆంగ్లం నేర్చుకొంటేనే భవిష్యత్తు బాగుంటుందనే అపోహను సృష్టిస్తున్నాయన్నారు. ఈ ధోరణి ఏమాత్రం సరైంది కాదన్నారు.
ఇప్పటి నటులకు తెలుగు సరిగ్గా రావట్లేదు..
ఒకప్పుడు సినిమాలు చూసి తెలుగు ఉచ్ఛారణను నేర్చుకున్నామని, తెలుగు భాషకు సినిమాలు పట్టం కట్టాయని జస్టిస్ ఎన్వీ రమణ గుర్తుచేసుకున్నారు. కానీ ఇప్పటి తెలుగు సినీనటులు, గాయనీగాయకులకు తెలుగు సరిగ్గా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
వారంతా బాధ్యతగా తెలుగు నేర్చుకోవాలని సూచించారు. సినీరంగమే తెలుగు వైభవాన్ని, గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిచెప్పాలని కోరారు. సామాజిక స్పృహగల సినిమాలు మాత్రమే చర్చనీయాంశమవుతాయని, అలాంటి మంచి సినిమాలు తీయాలంటే భాష, సాహిత్య, సంస్కృతులపై ఎంతో పట్టు ఉండాలన్నారు.
గానకోకిలకు ఘన సన్మానం...
ఈ సందర్భంగా గానకోకిల పి.సుశీలను ఘంటసాల శతజయంతి ప్రత్యేక పురస్కారంతో జస్టిస్ ఎన్వీ రమణ ఘనంగా సత్కరించారు. ఆమెకు రూ. లక్ష నగదు, నూతన వస్త్రాలు, శాలువాను ప్రదానం చేశారు. ఘంటసాలతో కలసి వేలాది పాటలు పాడిన తాను ఆయన శతజయంతి సందర్భంగా పురస్కారాన్ని అందుకోవడం ఎంతో సంతోషంగా ఉందని సుశీల చెప్పారు. ఈ సందర్భంగా ఆహూతుల కోరిక మేరకు ఆమె కొన్ని పాటలు పాడి అలరించారు.
ఏపీలోనూ నిర్వహిస్తాం...
ఘంటసాల శతజయంతి ఉత్సవాలకు ఏడాదిపాటు తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ అన్ని విధాలుగా సహకరిస్తుందని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ చెప్పారు. ఏపీలోనూ ఘంటసాల శతజయంతి ఉత్సవాలను నిర్వహించనున్నట్లు చోడవరం ఎమ్మెల్యే ధర్మేంద్ర తెలిపారు. కార్యక్రమానికి ఏపీ మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ అధ్యక్షత వహించారు.
ఈ వేడుకలో సీనియర్ నటి కృష్ణవేణితోపాటు నటులు మురళీమోహన్, ఆర్. నారాయణమూర్తి, మంజుభార్గవి, దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, వివేకానంద ఆసుపత్రి ఎండీ డాక్టర్ వి. గీత, సంగమం ఫౌండేషన్ వ్యవస్థాపకులు సంజయ్ కిషోర్, శాంతా బయోటెక్ అధినేత వరప్రసాద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వేడుకల ప్రారంభంలో జయశ్రీ, శశికళల సారథ్యంలో 100 మంది చిన్నారులు ఘంటసాల పాటలు ఆలపించి ఆహూతులను మంత్రముగ్ధులను చేశారు.
Comments
Please login to add a commentAdd a comment