సాక్షి, హైదరాబాద్: ఈ యాసంగి సీజన్‌లో కాళేశ్వరం ద్వారా గోదావరి జలాల ఎత్తిపోత ఫిబ్రవరి లేక మార్చి నుంచి ఆరంభమయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎస్సారెస్పీ సహా మిగతా రిజర్వాయర్‌లలో నీటి లభ్యత పుష్కలంగా ఉంది. ఇప్పుడిప్పుడే కాల్వల ద్వారా నీటి విడుదల కొనసాగుతున్న దృష్ట్యా యాసంగి పంటల చివరి దశకు కాళేశ్వరం ద్వారా నీరందించేలా ప్రణాళిక వేసింది. ఈ సీజన్‌లో గరిష్టంగా 40 టీఎంసీల నీటిని ఎత్తిపోయాల్సి ఉంటుందని అంచనా వేసింది.
ఇప్పటిదాకా ఎత్తింది 12 టీఎంసీలే...
రాష్ట్రంలో గత ఏడాది ఖరీఫ్ సీజన్‌లో భారీగా వర్షాలు కురవడంతో కాళేశ్వరం ద్వారా పెద్దగా ఎత్తిపోత అవసరం రాలేదు. మేడిగడ్డ మొదలు మిడ్‌మానేరు వరకు మొత్తంగా 12 టీఎంసీల మేర మాత్రమే నీటిని ఎత్తిపోశారు. యాసంగి సీజన్‌కు సంబంధించి కాళేశ్వరం పరిధిలో కొత్తగా 72 వేల ఎకరాల ఆయకట్టుకు నీరివ్వడంతో పాటు, ఎస్సారెస్పీ, ఎఫ్‌ఎఫ్‌సీ (వరదకాలువ) కింద ఉన్న పూర్తి ఆయకట్టును స్థిరీకరించాలని నిర్ణయించారు. ఎస్సారెస్పీ నుంచి లోయర్‌మానేరు డ్యామ్ వరకు ఉన్న 4.62 లక్షల ఎకరాలు, ఎల్‌ఎండీ దిగువన 5.10 లక్షల ఎకరాలకు, దీంతోపాటే ఎస్సారెస్పీ స్టేజ్–2 కింద ఉన్న 3.50 లక్షల ఎకరాలకు కలిపి 13 లక్షల ఎకరాలకు నీరందించాలని నిర్ణయించారు. దీనికై మొత్తంగా 110 టీఎంసీలు అవసరమని లెక్కించారు. ప్రస్తుతం ఎస్సారెస్పీలో 87 టీఎంసీ, లోయర్ మానేరులో 21, మిడ్‌మానేరులో 25 టీఎంసీల మేర నీటి లభ్యత ఉంది. వీటితో పాటే ఎగువన మేడిగడ్డలో 15 టీఎంసీ, అన్నారంలో 7, సుందిళ్లలో 8 టీఎంసీ మేర నీటి లభ్యత ఉంది.
ఎస్సారెస్పీ కింద సాగు అవసరాలకు రిజర్వాయర్‌లలో డెడ్‌స్టోరేజీ, తాగునీటి అవసరాలకు నీటిని పక్కనపెట్టి, 70 టీఎంసీల మేర నీటిని సాగుకు వినియోగించే అవకాశం ఉంది. మరో 40 టీఎంసీలు మాత్రం కాళేశ్వరం ద్వారా ఎత్తిపోయాల్సి ఉంటుంది. కాల్వలకు నీటి విడుదల ఇప్పుడే మొదలు కాగా, మార్చి వరకు ప్రతి నెలా కనీసంగా 40 టీఎంసీల అవసరాలుంటాయి. ఈ లెక్కన ప్రస్తుత లభ్యత జలాలు ఫిబ్రవరి చివరి తడుల వరకు సరిపోనున్నాయి. అనంతరం కాళేశ్వరం ద్వారా నీటిని తోడి అవసరాలకు తగ్గట్లుగా రిజర్వాయర్‌లకు తరలిస్తామని ప్రాజెక్టు అధికారులు చెబుతున్నారు. మూడు బ్యారేజీల్లో ఉన్న నీటిని దిగువ రిజర్వాయర్లకు తరలిస్తూనే, గోదావరి నదిలో లభ్యతగా ఉండే నీటిని రోజుకు కనీసంగా 6 వేల నుంచి 10 వేల క్యూసెక్కుల నీటిని తోడేలా ప్రణాళికలు వేసుకున్నారు. మొత్తంగా చివరి తడులకు నీటికి ఇబ్బంది రాకుండా జాగ్రత్తలు తీసుకుంటూనే... జూన్, జులై అవసరాలకు నీటి లభ్యత ఉంచేలా ఎత్తిపోతలు ఉంటాయని ప్రాజెక్టు అధికారులు చెబుతున్నారు.
ఖరారు కాని సీఎం పర్యటన..
కాగా కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన ఇంకా ఖరారు కాలేదు. ఈ నెల 5న మేడిగడ్డ ప్రాంతంలో పర్యటిస్తారని ప్రచారం జరిగినా అధికారులు ధృవీకరించడం లేదు. ఈ నెల 8న పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్ పుట్టా మధు కూతురు వివాహానికి ముఖ్యమంత్రి వచ్చే అవకాశం ఉందని, అదే రోజున కాళేశ్వరం పరిధిలో పర్యటించే అవకాశాలున్నాయని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment