సాక్షి, హైదరాబాద్: ఎదురెదురుగా వస్తున్న రైళ్లు ఢీకొనకుండా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఆటోమెటిక్ ట్రెయిన్ ప్రొటెక్షన్ సిస్టం ‘కవచ్’ విస్తరణలో దక్షిణ మధ్య రైల్వే రికార్డు సృష్టించింది. ఇప్పటి వరకు 1,445 రూటు కిలోమీటర్లను కవచ్ సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తరించారు.‘ఆత్మనిర్భర్ భారత్’లో భాగంగా రైల్వేశాఖ ఈ కవచ్ ప్రాజెక్టును చేపట్టింది.
గతేడాది దక్షిణమధ్య రైల్వే పరిధిలో 859 కిలోమీటర్లను కవచ్ పరిధిలోకి తెచ్చారు. తాజాగా ఈ పరిధిని 1,445 కిలోమీటర్లకు విస్తరించారు. రీసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ (ఆర్‌డీఎస్‌ఓ) ఆధ్వర్యంలో ‘కవచ్’ వ్యవస్థను అభివృద్ధి చేశారు. ప్రమాదకరమైన రెడ్ సిగ్నల్ దాటడం, రైళ్లు ఎదురెదురుగా ఢీకొనకుండా నియంత్రించడం, ఒకవేళ రైలు పరిమితిని మించి వేగంగా ప్రయాణించినప్పుడు వేగాన్ని డ్రైవర్ అదుపు చేయలేకపోయినా బ్రేకింగ్ వ్యవస్థ ఆటోమెటిక్‌గా పని చేయడం కవచ్ సాంకేతికతలోని ప్రత్యేతలు.
దశలవారీగా అభివృద్ధి..
దక్షిణమధ్య రైల్వే కవచ్ వ్యవస్థను దశలవారీగా అభివృద్ధి చేసింది. మొదట ‘వాడి’ నుంచి వికారాబాద్ వరకు, సనత్‌నగర్– వికారాబాద్ – బీదర్ సెక్షన్లలో 25 స్టేషన్ల పరిధిలో 264 కిలోమీటర్ల వరకు ప్రయోగాత్మకంగా అమలు చేశారు. అనంతరం అదనంగా 32 స్టేషన్లకు, 322 కిలోమీటర్లకు విస్తరించారు. గత ఏడాది కవచ్‌ను మరో 77 స్టేషన్లలో 859 కిలోమీటర్లకు పొడిగించారు. ప్రస్తుతం కవచ్ వ్యవస్థ 133 రైల్వేస్టేషన్లు, 29 ఎల్‌సీ గేట్లను, 74 లోకోమోటివ్‌లను కవర్ చేస్తూ 1,445 కిలోమీటర్లకు విస్తరించినట్లయింది.
ప్రత్యేకతలివీ..
రైళ్లు, లోకోమోటివ్‌లు ప్రమాదకరమైన రెడ్ సిగ్నల్ దాటడాన్ని కవచ్ నివారిస్తుంది. సిగ్నలింగ్ తాజా స్థితిగతులను నిరంతరం డ్రైవర్ మెషిన్ ఇంటర్‌ఫేస్ (డీఎంఐ), లోకో పైలట్ ఆపరేషన్ కమ్ ఇండికేషన్ ప్యానెల్ (ఎల్‌పీఓసీఐపీ)లో– అధిక వేగ నియంత్రణకు ఆటోమెటిక్ బ్రేకింగ్ వ్యవస్థగా కవచ్ పని చేస్తుంది. రైళ్లు లెవల్ క్రాసింగ్ దాటే సమయంలో గేట్ల వద్ద ఆటో విజువలింగ్ వ్యవస్థగా ఇది అప్రమత్తం చేస్తుంది. నెట్‌వర్క్ మానిటర్ సిస్టం ద్వారా రైలు నడిచే మార్గాలపై ప్రత్యేక కేంద్రీకృత పర్యవేక్షణ ఉంటుంది.
(చదవండి: ఈ ఊరికి చేరాలంటే.. 8 కి.మీ. నడవాలి)
Comments
Please login to add a commentAdd a comment